మరో ముగ్గురు రైతులు మృతి
13న లోహ్రి నాడు మూడు సాగు చట్టాల ప్రతుల్ని తగలబెట్టి పండగ చేసుకుంటాం
23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ‘కిసాన్ దివస్’గా పాటిస్తాం
రైతు నాయకుల ప్రకటన
నేడు ఏడో విడత చర్చలు
న్యూఢిల్లీ: నీటిముంపునకు గురైన గుడారాలు, తడిసిపోయిన కట్టెలు, దుప్పట్లు, ఇంకా తీవ్రమైన చలి ఇదీ ఆదివారం పొద్దున సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల పరిస్థితి. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నిరసన స్థలాలను నీటిముంపునకు గురిచేసింది. ఈ పరిస్థితిలో వాటర్ ప్రూఫ్ టెంట్లు ఉన్నప్పటికీ లాభం లేకపోయిందని నిరసనకారులు తెలిపారు. రైతులకు వాటర్ ప్రూఫ్ టెంట్లు ఉన్నాయి. అయితే ఎముకలు కొరికే చలి, నీళ్లు మళ్లుకోవడంతో అవి రైతులను రక్షించలేకపోయాయని సంయుక్త కిసాన్ మో ర్చా రైతు నాయకుడు అభిమన్యు కోహర్ అన్నారు. “వర్షం కారణంగా నీళ్లు మళ్లుకోవడంతో నిరసన స్థలాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక వర్షం తర్వాత చలి విపరీతంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మా కష్టాలను చూడలేకపోతోంది” అని ఆయన అన్నా రు. సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో కొన్నిచోట్ల నీళ్లు మళ్లుకున్నాయి. అయితే నెల రోజులకుపైగా నిరసన చేస్తున్న రైతుల స్ఫూర్తి మీద వాతావరణం నీళ్లు చల్లలేదు అని సింఘు సరిహద్దుల్లో ఉన్న మరో రైతు గుర్వీందర్ సింగ్ అన్నారు. సమస్యలు ఎదురైనప్పటికీ, మా డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడినుంచి కదలం అన్నది గుర్వీందర్ నిశ్చితాభిప్రాయం. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతా ల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇంకా మేఘాలు, తూర్పు గాలుల కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉందని వాతావరణ విభాగం అధికారి తెలిపారు. జనవరి 6వ తేదీ వరకు వడగళ్లతో కూడిన వర్షం కురవవచ్చని ఆ అధికారి అన్నారు. బురారీ మైదానంలో కూడా వర్షపు నీరు ప్రవేశించింది. వర్షంలో తమ వస్తువులు తడవకుండా ఉండేందుకు అక్కడున్న నిరసనకారులు నీటిని బయటికి పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 13న లోహ్రి నాడు మూడు సాగు చట్టాల ప్రతుల్ని తగలబెట్టి పండగ చేసుకుంటామని, ఇంకా 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని “కిసాన్ దివస్”గా జరుపుకొంటామని రైతు నాయకులు ప్రకటించారు. ఇక 39 రోజులుగా నిరసన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన పరిష్కారానికి ఈ రోజు (జనవరి 4) ఏడో విడత చర్చలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన మూడు కొత్త సాగు చట్టాల రద్దుకు రైతులు పట్టుపట్టడంతో ఇప్పటివరకు జరిగిన 6 విడతల చర్చలు విఫలమయ్యాయి. అయితే పర్యావరణం, విద్యుత్ చట్టాలకు సంబంధించి గత చర్చల్లో రెండు వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. కానీ రైతుల ప్రధాన డిమాండ్లయిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, మూడు సాగు చట్టాల ఉపసంహరణ విషయంలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అయితే వ్యవసాయ శాఖ రాష్ట్ర మంత్రి కైలాస్ చౌదరి మాత్రం రేపటి చర్చల్లో ఒక పరిష్కారం దొరుకుతుందని, రైతుల ఆందోళన ఆగిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కొత్త చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలని ప్రభుత్వం వాదిస్తోంది. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడతాయన్నది ప్రభుత్వం మాట. అయితే ఇవి కనీస మద్దతు ధర, మండీ విధానాన్ని బలహీనపరిచి, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చలిలోనూ, వానలోనూ అదేమాట.. అదేబాట!
RELATED ARTICLES