బెలారస్ సరిహద్దుల్లోని రహస్య ప్రాంతంలో సమావేశం
ధృవీకరించిన ఉక్రేన్ అధ్యక్ష కార్యాలయం
బెలారస్ చేరిన రష్యా బృందం
కీవ్ : రష్యాతో చర్చలకు ఉక్రేన్ సుముఖత వ్యక్తం చేయడంతో రష్యా బృందం బెలారస్‌కు చేరుకుంది. ఉక్రేన్ బృందంకోసం సిద్ధంగా ఉంది. అయితే ఉక్రేన్ సమస్యపై బెలారస్ నగరం గోమెల్ వేదికగా చర్చలకు తాము సుముఖంగా లేమని ఉక్రేన్ దేశాధ్యక్షుడు జెలెన్సీ ఆదివారం ఉదయం మొదట ఒక వీడియో సందేశంలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయన విముఖత చూపడంతో చర్చల ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగిందని అందరూ భావించారు. కానీ తరువాత జెలెన్స్కీ దిగివచ్చి బెలారస్ వద్ద చర్చలు జరిపేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బెలారస్ సరిహద్దులోని రహస్య ప్రాంతానికి వచ్చేందుకు ఉక్రేన్ అధ్యక్షుడు తర్వాత సుముఖత వ్యక్తం చేశారని రష్యన్ మీడియా తెలియజేసింది. బెలారస్ సరిహద్దుల్లో ఉన్న గుర్తు తెలియని ప్రదేశంలో రష్యా సమావేశం జరుగుతుంది. అయితే సమావేశం ఎక్కడ జరిగేది, ఎన్నిగంటలకు సమావేశం జరిగేదీ మాత్రం తెలియజేయలేదు. ఉక్రేన్ అధ్యక్ష కార్యాలయం ఈ విషయాలను ధృవీకరించింది. ఒక టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా ఉక్రేన్ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌తో అనుసంధానమైంది. నాటో బలగాలు చాలా దుందుడుకు ప్రకటనలతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారని, రష్యాకు చెందిన అణ్వస్త్ర శక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీచేసిన కొద్ది సేపటికే ఉక్రేన్ అధ్యక్ష కార్యాలయం నుండి చర్చకు అంగీకారం తెలియజేస్తూ రష్యా అధికారులకు టెలిగ్రామ్ మెజేజింగ్ ద్వారా సమాచారం అందింది.రష్యా బృందం సిద్ధమైన తరువాత జెలెన్స్కీ శాంతి చర్చలపై ఆలస్యంగా స్పందించారు. అయితే రష్యా మాత్రం నాటో కూటమిలో ఉక్రేన్ చేరే విషయంలో ఎలాంటి ఆశలూ పెట్టుకోకూడదని, నాటో కూటమిలో ఉక్రేన్ చేరేందుకు తాము సుముఖంగా లేమని చర్చల్లో రష్యా బృందం స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉంది.
బెలారస్ రష్యాకు మిత్రవువని, పైగా గడచిన నాలుగు రోజులుగా రష్యా చేస్తున్న దాడులు బెలారస్‌ను వేదికగా చేసుకునే జరుగుతున్నాయని, అందువల్ల బెలారస్లో చర్చలకు తాము హాజరయ్యేదిలేదని జెలెన్స్కీ మొదట ఒక వీడియోలో పేచీ పెట్టారు. ప్రత్యామ్నాయ వేదికలను కూడా ఆయన చర్చల నిమిత్తం సూచించారు. పోలెండ్ రాజధాని వార్సా, బ్రటిస్లావా, ఇస్తాంబుల్, బుడాపెస్ట్ లేదా బాకు నగరాలలో ఎక్కడికైనా వచ్చి చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఉక్రేన్‌పై దాడికి రష్యా బెలారస్నే కేంద్రంగా చేసుకుందని, అందుకే తాము అక్కడ చర్చలు జరిపేందుకు సుముఖంగా లేమని జెలెన్స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చలకు తమ దేశం సిద్ధంగా ఉందని జెలెన్స్కీ చెప్పారు. అయితే బెలారస్ వెళ్ళేందుకు తాము సుముఖంగా లేమన్నారు. రష్యా అసత్యాలు చెబుతోందని, బెలారస్లో చర్చలకు తాము సుముఖత వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు.ఇప్పటికే బెలారస్ చేరుకున్న రష్యా చర్చల బృందంలో సైనిక అధికారులు,దౌత్యవేత్తలు ఉన్నారు. ఉక్రేన్తో సామరస్యపూర్వకంగా చర్చలు చేసేందుకు తమ బృందం ఆదివారంనాడు బెలారస్ చేరుకుందని, వారు అక్కడ సిద్ధంగా ఉన్నారని రష్యా అధికార కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి ద్మీత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అయితే అందుకు జెలెన్స్కీ మాత్రం సిద్ధంగా లేరని రష్యాకు సందేశం వెళ్ళింది. మేం ఉక్రేన్ బృందం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం అని పెస్కోవ్ అన్నారు. గురువారంనాడు ఉక్రేన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. ఈ దాడిలో ఇప్పటివరకు 198 మంది ఉక్రేనియన్లు మరణించగా, మరో 1000 మంది గాయపడ్డారు. అయితే వీరిలో సైనికులు ఎంతమంది? సామాన్య పౌరులు వీరిలో ఉన్నారా? అనే వివరాలను మాత్రం ఉక్రేన్ అధ్యక్షుడు స్పష్టం చేయడం లేదు.
స్విఫ్ట్ నుండి రష్యా తొలగింపు
ఇదిలాఉండగా,ఉక్రేన్కు అమెరికా అదనంగా 350 మిలియన్ డాలర్ల సహాయం అందించేందుకు వాగ్దానం చేసింది. సైనిక సహాయం రూపంలో దీనిని అందజేస్తారు. ఉక్రేన్కు యుద్ధ ట్యాంకుల విధ్వంసక ఆయుధాలను, శరీర రక్షణ కవచాలను, చిన్నపాటి ఆయుధాలను సమకూర్చడానికి ఆమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా మిత్రదేశాలు ‘స్విఫ్ట్’ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనానియల్ టెలికమ్యూనికేషన్స్) నుండి రష్యా బ్యాంకులను తొలగించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు రష్యాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. దిగుమతులకు సంబంధించిన చెల్లింపులు చేయడానికి, ఎగుమతులకు సంబంధించిన ధనాన్ని తమ ఖాతాల్లోకి తెచ్చుకోవడానికి రష్యాకు ఇబ్బందులు కలిగించేందుకే స్విఫ్ట్ నుండి రష్యా బ్యాంకుల వ్యవస్థను తొలగించినట్లు నాటో దేశాలు తెలిపాయి. రెండో ప్రపంచయుద్ధం తరువాత అంతర్జాతీయ స్థాయిలో అమలులో ఉన్న నిబంధనలను రష్యా ఉల్లంఘించిందని యూరోపియన్ యూనియన్ సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డేర్ లెయాన్ అన్నారు.రష్యా సమకూర్చుకున్న 600 బిలియన్ డాలర్ల నిధులను బ్లాక్ చేయడమే తమ ఉద్దేశమని వాల్‌స్ట్రీల్ జర్నల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాలకు చెందిన 11,000 బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలను సంయుక్తంగా అనుసంధానం చేసి ఉమ్మడి లావాదేవీలు, ఆదాన ప్రదానాలు కొనసాగించుకోడానికి ఈ స్విఫ్ట్ దోహదం చేస్తుంది. రష్యా చమురు ఆదాయాన్ని విదేశీ వాణిజ్య ఆదాయాన్ని ఆ దేశానికి చేరకుండా చేయడమే స్విఫ్ట్ నుండి రష్యా తొలగింపు వెనుక ప్రధాన ఉద్దేశమని ఉర్సులా వాన్‌డేర్ లెయాన్ చెప్పారు.స్విఫ్ట్ నుండి తొలగించడంవల్ల రష్యా తన స్విఫ్ట్ గుర్తింపు కోడ్‌ను కోల్పోతుంది. అంతర్జాతీయ తక్షణ లావాదేవీల నిర్వహణ పెద్ద సమస్యగా మారుతుది.
ఇదిలా ఉండగా రష్యా దాడివల్ల ఉక్రేన్‌లో ఇంటర్నెట్ వ్యవస్థ పతనమైంది. దీంతో ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం ఎవరికీ లేకపోవడంతో ఎలాన్ మస్క్ వెంటనే స్పందించి ఉక్రేన్కు అంతర్జాల సదుపపాయం కలుగజేస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఆయన చర్యలు తీసుకున్నారు. తమ శాటిలైట్ వ్యవస్థ స్టార్ లింక్ ద్వారా ఉక్రేన్‌లో అంతర్జాల కార్యకలాపాలకు ఆయన అవకాశం కల్పించారు. ఉక్రేన్‌లో తమ స్టార్ లింక్ యాక్టివ్‌గా ఉందని, అంతర్జాల వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.
దక్షిణ ఉక్రేన్ ప్రాంతాల్లోకి రష్యా సైన్యం
ఖెర్సన్ నగరం,బెర్డ్యాన్స్క్పోర్టు స్వాధీనం
పొరుగు దేశాలకు రెండు లక్షలమంది వలస
ఉక్రేన్‌పై సైనికచర్య ప్రారంభించిన రష్యా సేనలు నాలుగోరోజు ఆదివారంనాటికి దక్షిణ ఉక్రేన్, ఆగ్నేయ ప్రాంతాలకు చేరుకున్నాయి. ఆదివారంనాడు యుద్ధం పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. రష్యా సైన్యం ఉక్రేన్‌లో రెండవ అతిపెద్ద నగరమైన ఖెర్సన్‌ను, మరో ఓడరేవును కూడా స్వాధీనం చేసుకుంది. ఖెర్సన్ నగరంలో వీధి పోరాటం ప్రారంభమైంది. ఈ రెండూ ఉక్రేన్ ఆర్థిక లావాదేవీలకు అత్యంత కీలకమైన ప్రాంతాలు. రష్యా రక్షణమంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ మాట్లాడుతూ, రష్యా దళాలు నల్లసముద్ర ప్రాంతంలో ఉన్న ఖెర్సన్ నగరాన్ని చుట్టుముట్టాయని, అజోవ్ సముద్రంపై ఉన్న బెర్డ్యాన్స్క్ ఓడరేవును కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నాయని చెప్పారు. ఉక్రేన్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండూ అంత్యంత కీలకమైనవని ఆయన అన్నారు. ఈ ప్రాంతాలనుండి రష్యా క్రిమియా నుండి భూ మార్గంలో కూడా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. 2014 నుండి ఇపపటివరకూ ఈ ప్రాంతాలమధ్య అనుసంధానానికి 19 కి మీ వంతెన కూడా ఉంది. 2018లో ఈ వంతెన ప్రారంభమైంది. దక్షిణ ఉక్రేన్‌లోని వ్యూహాత్మకమైన ప్రాంతాలలో రష్యా సైన్యం దాడి ఒత్తిడి పెంచింది. ఖెర్సాన్ నగర సమీపంలోని వైమానిక స్థావరం పూర్తిగా రష్యా అధీనంలోకి వచ్చింది. అజోవ్ సముద్రతీరంలో ఉన్న హెనిచెస్క్ ఉక్రేనియన్ నగరాన్ని కూడా తన అధీనంలోకి తెచ్చుకుందని అధికారులు చెప్పారు. ఒడెసా, మైకోలైవ్, ఇతర ప్రాంతాలలో కూడా పోరాటం కొనసాగుతోంది. కీవ్ శివారు ప్రాంతాలలో ఇంకా భీకర పోరు కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున కీవ్ శివార్లలో పేలుళ్ళు సంభవించినట్లు ఆ ప్రాంత మేయర్ పేర్కొన్నారు. ఉక్రేన్ ఆరోగ్యశాఖామంత్రి శనివారం తెలియజేసిన సమాచారం ప్రకారం 198 మంది రష్యా దాడుల్లో మరణించారు. మరో 1000 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రెండవ ప్రపంచయుద్ధం తరువాత యూరప్‌లో అతిపెద్ద యుద్ధంగా దీనిని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
కాగా, యుద్ధం కారణంగా భయాందోళన చెందిన రెండు లక్షలమంది ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్ళినట్లు ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలియజేసింది. యుద్ధం మొదలైన గురువారం నుండీ ఈ వలసలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ఈ వివాదంవల్ల సుమారు నాలుగు లక్షలమంది కాందిశీకులు పొరుగు దేశాలను ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే ఈ ఘర్షణ దీర్ఘకాలం కొనసాగే అవకాశాలను బట్టే ఈ గణాంకాలు అధారపడి ఉంటాయని కూడా ఐక్యరాజ్యసమితి తెలియజేసింది.