కేరళలో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు
నాలుగు దశాబ్దాల్లో ఇదే ప్రథమం
తిరువనంతపురం: కేరళలో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) సరికొత్త చరిత్ర సృష్టించింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండోసారి అధికార పగ్గాలను చేపట్టి సత్తా చాటింది. కేరళ రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థా నాలకు జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 71 సీట్ల మైలురాయిని అధిగమించిన వెంటనే ఎల్డిఎఫ్ 44 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. గట్టిపోటీనిచ్చి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)కు ఎదురుదెబ్బ తప్పలేదు. గత నాలు గు దశాబ్దాల కేరళ రాజకీయ చరిత్రలో అధికార పార్టీ రెండోసారి గెలిచిన సందర్భాలు లేవు. కానీ, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలో ఎల్డిఎఫ్ ఈ సంప్రదాయానికి తెరదించింది. 2016లో 91 స్థానాలను దక్కించుకున్న ఎల్డిఎఫ్ ప్రజల్లో తనకు ఉన్న అభిమానాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి విజయన్‌పై వచ్చిన డాలర్ స్మగ్లింగ్ కేసునుగానీ, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని మహిళల ప్రవేశం అంశంపై వచ్చిన విమర్శలుగానీ ఎల్డిఎఫ్ ప్రతిష్టను దెబ్బతీయలేకపోయాయి. ఒకానొక దశలో ఎల్డిఎఫ్ కూటమిని అవినీతి కుంభకోణాలు కొంతమేర ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్‌లో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉందన్న ఆరోపణలు కేరళ రాజకీయాలను కుదిపేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేరళకు క్యూ కట్టాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ తదితర సంస్థలు కేరళ లెఫ్ట్ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై విచారణ పేరుతో నానా రభస సృష్టించాయి. కానీ, ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయాయి. జాతీయ దర్యాప్తు సంస్థల వధింపులనే ఎల్డిఎఫ్ ఒక అస్త్రంగా మార్చుకుంది. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా దీనిని అభివర్ణించింది. ఎల్డిఎఫ్ వాదనను ప్రజలు నమ్మారని, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అనడానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కరోనా కష్టకాలంలో ఎల్డిఎఫ్ సర్కారు చేపట్టిన చర్యలు, అందించిన సేవలు, మహమ్మారి కట్టడికి తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ చూరగొన్న ప్రభుత్వం వరదలు, నిఫా, కరోనా వైరస్ కారణంగా తలెత్తిన సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంది. కరోనా సంక్షోభ సమయంలో ఉచిత ఆహార కిట్ల పంపిణీ సర్కారును విజయ తీరాలకు చేరేందుకు దోహదపడ్డాయి. అలాగే రోడ్లు, రహదారులు, వంతెనలు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఎల్డిఎఫ్ సర్కారు పనితీరుకు గత డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు ఆమోద ముద్ర వేశారు. ’రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వంతెనలు ఐదేళ్ల క్రితం ఉన్నట్లే ఇప్పుడూ ఉన్నాయా?’ అంటూ విజయన్ ప్రచారంలో అడిగిన ప్రశ్నలకు ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం చెప్పారు. అందుకే, వరుగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు. ‘స్ట్రాంగ్ మ్యాన్’గా పేరుపొందిన ముఖ్యమంత్రి విజయన్ సమర్థమైన నాయకత్వం కూడా ఈ కూటమి విజయంలో ప్రధాన భూమిక పోషించింది. వాస్తవానికి కేరళలో ఎల్డిఎఫ్ కూటమి గెలుపు వామపక్ష పార్టీలకు కూడా ఎంతో కీలకం. దేశంలో ప్రస్తుతం లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం.
సైబర్ ఆర్మీ పాత్ర
కేరళలో ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంలో లెఫ్ట్ పార్టీల సైబర్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. ఈ సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకొని ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సాధించిన ఫలాలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కృషి వంటి అంశాలను ఎప్పటికప్పుడు సైబర ఆర్మీ ప్రజలకు చేర్చింది. ఎల్డిఎఫ్ విజయంలో ఈ ఎత్తుగడ సత్ఫలితాలనిచ్చింది.
మెట్రో మ్యాన్ శ్రీధరన్‌కు షాక్
మెట్రో మ్యాన్ శ్రీధరన్‌కు ఓటర్లు షాకిచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సీఎం అభ్యర్థిగా పాలక్కాడ్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన పరాజయాన్ని చవిచూశారు. కౌంటింగ్ ఆరంభంలో సుమారు నాలుగు వేలకుపైగా ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ఆతర్వాత క్రమంగా వెనుకబడ్డారు. చివరకు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంఎల్ఎ షఫీ పరాంబిల్ చేతిలో 6,754 ఓట్ల తేడాతో శ్రీధరన్ ఓడిపోయారు. కాగా, కేరళ బిజెపిఅధ్యక్షుడు కే సురేంద్రన్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. మంజేశ్వర, కొన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయనకు చేదు అనుభవమే మిగిలింది. కేరళలో తన ఉనికిని చాటుకోవాలనుకున్న బిజెపి ఏ రకంగానూ ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.
చరిత్ర సృష్టించిన ఎల్డిఎఫ్
RELATED ARTICLES