HomeNewsBreaking Newsచరిత్రకు బిజెపి వక్రీకరణ

చరిత్రకు బిజెపి వక్రీకరణ

ప్రజాపక్షం/హైదరాబాద్‌: నాటి కేంద్ర హోం శాఖ మంత్రి వల్లభాయ్‌ పటేల్‌ వల్లనే హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైందని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నాటి విలీన సమయంలో అసలు బిజెపి ఉన్నదా? అప్పుడు వల్లభాయ్‌ పటేల్‌ ఏ పార్టీలో, ఏ ప్రభుత్వంలో ఉన్నారో చరిత్రను తెలుసుకోవాలని ఆయన సూచించారు. కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాటం త్యాగఫలం, రక్తతర్పణంతోనే హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనమైందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సంస్థాన ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని, మరో వైపు దొరలు పల్లెలు వదిలి పారిపోవడంతో భయపడిన నాటి నిజాం నవాబు ఆనాటి ప్రధాని నెహ్రూతో చీకటి ఒప్పందం చేసుకుని హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనంపై బిజెపి చేస్తున్న గొబెల్స్‌ ప్రచారాన్ని, మోసపూరిత మాటలను తిప్పకొట్టాలని చాడ వెంకట్‌రెడ్డి తెలంగాణ మేథావులను కోరారు. గుండ్రాంపల్లిలో అమిత్‌షా అమరవీరులకు నివాళులు అర్పించారని, ఇంతకు వారు ఎలా అమరులయ్యారో తెలుసా? ఎవరి చేతితో బలయ్యారో అదైనా తెలుసా అని చాడ ప్రశ్నించారు. సాయుధ పోరాటం ఊసే ఎత్తకుండా చరిత్రను వక్రీకరిస్తోందని ఇలాంటి ప్రచారాన్ని నిర్వహిస్తే ఖబడ్దార్‌ అని ఆయన హెచ్చరించారు. అనేక గ్రామాల్లో రజాకార్లు ఊచకోతకు, దాడులకు పాల్పడి, మహిళలపై మానభంగాలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. బిజెపిది వల్లభాయ్‌ పటేల్‌ అనే ఒకటే మంత్రం, ఒకటే తంత్రం అని, అదే నిజమైతే నిజాం నవాబు రాజబోగాలు ఎలా అనుభవించారని, నైజం ఆస్తులను ఎం దుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని, ఇది చీకటి ఒప్పందం కాదా అని చాడ ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదని చరిత్ర చెబుతున్నదన్నారు. తెలంగాణ రా ష్ట్ర సాధన ఉద్యమంలో కూడా సిపిఐ ప్రముఖ పాత్రను పోషించిందన్నారు. తెలంగాణ సా యుధ పోరాటాన్ని కాంగ్రెస్‌ కూడా గుర్తించలేదన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రెండవసారి అధికారంలోనికి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుందని, కార్పోరేట్‌కు అనుకూలంగా వ్యవహారిస్తోందని, కార్పోరేట్‌కు అనుకూలం, పేదలకు వ్యతిరేకం గా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి నాలుగు సీట్లు దక్కించుకోగానే దూకుడు పెం చిందని, వారి ఆగడాలు పెరిగాయన్నారు. బిజెపి-ఎన్‌డిఎ, రా్రష్ట్రంలోని కెసిఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడాన్ని సహించబోమని చాడ వెంకటరెడ్డి తెలిపారు.
విలీన దినోత్సవాన్ని
అధికారికంగా నిర్వహించాలి
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోని పూర్వపు హైదరాబాద్‌ సంస్థాన ప్రాంతాలలో విలీన దినోత్సవం జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని, రజాకార్ల పార్టీ ఎంఐఎంకు భయపడుతున్నారా అని చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న అధికారికంగా విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విలీనంలో కమ్యూనిస్టుల పాత్ర, నాటి సాయుధ పోరాటాన్ని ఉద్యమ సమయంలో కెసిఆర్‌ కొనియాడారని, రావినారాయణరెడ్డి, మఖ్ధూంమొహియుద్దీన్‌, చాకలి ఐలమ్మను పొగిడిన కెసిఆర్‌, అధికారంలోనికి రాగానే విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments