HomeNewsBreaking Newsచమురు కంపెనీల భారీ వడ్డనలు

చమురు కంపెనీల భారీ వడ్డనలు

ఢిల్లీలో సిఎన్‌జిపై కిలోకు రెండు రూపాయలు పెంపు
వరుసగా పదోసారి పెరిగిన ఎటిఎఫ్‌ ధర
న్యూఢిల్లీ: అతి తక్కువ కాలం విరామమిచ్చిన చమురు కంపెనీలు మళ్లీ భారీ వడ్డనలకు దిగాయి. తాజా నిర్ణయాలతో దేశ రాజధానిలో సిఎన్‌జి ధర కిలోకు రెండు రూపాయలు పెరిగింది. అదే విధంగా విమానాలకు వాడే ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యుయల్‌ ధర వరుసగా పదోసారి పెరిగింది. ఢిల్లీ, పరిసర పట్టణాలు, నగరాల్లో ఇప్పటి వరకూ 71.63 రూపాయలుగా ఉన్న కిలో సిఎన్‌జి ధరను 73.63 రూపాయలకు పెంచినట్టు ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, వంట గ్యాస్‌ ధరలో ఎలాంటి మార్పు లేదని వివరించింది. ఈ ఏడాది మార్చి 7వ తేదీ నుంచి సిఎన్‌జి ధరలు పెరగడం వరుసగా ఇది 12వసారి. అప్పటి నుంచి కేజీ సిఎన్‌జి దర 17.6 రూపాయలు పెరగడం గమనార్హం. ఒక్క ఏప్రిల్‌ మాసంలోనే 7.50 రూపాయలు పెంచిన చమురు కంపెనీలు చిరు వ్యాపారులపై మరింత భారం మోపుతున్నాయి. ఏడాది కాలంలో కెజి సిఎన్‌జి ధర 60 శాతం, అంటే 30.21 రూపాయలు పెరిగింది. పైపుల ద్వారా ఇళ్లకు అందించే గ్యాస్‌ ధరలను ప్రస్తుతానికి స్థిరంగా ఉంచాయి. అయితే, ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత నెలకొన్న పరిస్థితులతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ధరల పెరుగుదలకు కారణమని అధికారులు అంటున్నారు. రష్యా, ఉక్రేన్‌ యుద్ధం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నదని స్పష్టం చేస్తున్నారు. ఇలావుంటే, ఎటిఎఫ్‌ ధరను కిలోలీటర్‌కు 5.29 శాతం (లీటర్‌కు 123 రూపాయలు) పెంచారు. అంటే విమాన ప్రయాణానికి ఎటిఎఫ్‌ ధర కిలో లీటర్‌కు 6,188.25 రూపాయలు పెరిగి, 1,23,039.71 రూపాయలకు చేరింది. ఈ ఏడాది ఎటిఎఫ్‌ ధరలు పెరగడం వరుసగా ఇది పదోసారి. ఇలావుంటే, ఈ ఏడాది మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ, క్రమం తప్పకుండా సుమారు పది రూపాయలు పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 41 రోజులుగా పెట్రో ధరలను పెంచకపోవడం విశేషం.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments