‘సమీర్ హాస్పిటల్’ ద్వారా రోగులకు చికిత్స
అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ చదివింది పదో తరగతి. చేసేది డాక్టర్ కొలువు. అంతేకాదు ఏకంగా హైదరాబాద్‌లో ఒక ఆస్పత్రినే ప్రారంభించారు. దీనికి డిఎంహెచ్‌ఓ నుంచి సర్టిఫికెట్ కూడా పొందారు. ఇంకేముంది యథేచ్ఛగా రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఇలా కొంతకాలం ఆ ఆస్పత్రి మూడు పువ్వులు, ఆరు కాయలుగా చెలామణి అయింది. మొత్తానికి ఈ నకిలీ దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ నకిలీ డాక్టర్‌తో పాటు మరో వ్యక్తిని హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి పి.రాధాకిషన్‌రావు నేతృత్వంలో వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు, ఎస్‌ఐలు పి.మల్లికార్జున్ ఎం.డి.ముజఫర్ అలీ, ఎన్. రంజిత్‌కుమార్ బృందం ఈ కేసును చేధించింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మెహిదీపట్నంలో నివాసం ఉంటున్న మహ్మద్ షోయబ్ సుబాని(35) బికామ్ ద్వితీయ సంవత్సరం డిస్‌కంటిన్యూ అయింది. కాగా 2011 సంవత్సరంలో మెహిదీపట్నంలో ‘గ్లోబల్ టెక్నో స్కూల్’ను ప్రారంభించారు. మెహిదీపట్నంలో నివాసం ఉండే ఇతని స్నేహితుడు మహ్మద్ అబ్దుల్ ముజీబ్ (42) పదవ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న ఎంఎం హాస్పిటల్‌లో డైరెక్టర్‌గా పని చేశాడు. ఇక్కడ అనేక విషయాలపై అవగాహన పెంచుకున్నాడు. ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని మహ్మద్ షోయబ్ సుబానికి తెలియజేశాడు. దీంతో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వారిద్దరూ ప్లాన్ వేసుకున్నారు. ఇందులో భాగంగా మహ్మద్ అబ్దుల్ ముజిబ్ పేరు ముందు డాక్టర్ అని పెట్టి 2017 సంవత్సరంలో ఒక ఆధార్ కార్డును తీసుకున్నారు. ఆధార్ కార్డు రాగానే డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజిబ్ మేనేజింగ్ డైరక్టర్‌గా ‘ సమీర్ హాస్పిటల్’ ఏర్పాటు కోసం షోయబ్ సుబాని దరఖాస్తు పెట్టాడు. దీంతో డిఎంఅండ్‌హెచ్‌వో రిజిస్ట్రేషన్ నంబర్ ‘07ఎఫ్-ఎపిఎంసిఇ-1095’తో సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఈ సర్టిఫికెట్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి 2022 అక్టోబర్ 17 వరకు అనుమతి ఉన్నది. దీంతో ఆసిఫ్‌నగర్ రోడ్, ఆంధ్రబ్యాంక్ ఎదురుగా సమీర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఆస్పత్రులకు వచ్చే పలు రకాల రోగులకు చికిత్స కూడా చేశాడు. ఇలా కొంత కాలం నకిలీడాక్టర్ వైద్యసేవలను అందించాడు. వెస్ట్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో సమీర్ హాస్పిటల్‌పై దాడి చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహ్మద్ అబ్దుల్ అసలు డాక్టరే కాదని, అతను చదువుకున్నది పదవ తరగతి అని తేలడంతో పోలీసులు కూడా విస్తుపోయారు. మహ్మద్ అబ్దుల్‌తో పాటు మహ్మద్ షోయబ్ సుబాని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారి వద్ద ఉన్న సర్టిఫికెట్లు నకిలీవా..? ఇతర అంశాలతోపాటు ఇందులో ఇతరుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
చదివింది పదో తరగతిచేసేది డాక్టర్ కొలువు
RELATED ARTICLES