అజేయ శతకంతో చెలరేగిన మిస్టర్ డిపెండబుల్.. రాణించిన మయాంక్
తొలి రోజు భారత్ 303/4
ఆస్ట్రేలియాతో చివరి టెస్టు
సిడ్నీ: నాలుగో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్స్ శుభారంభం చేశారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో మిస్టర్ డిపెండబుల్ చతేశ్వర్ పుజారా (130 బ్యాటింగ్; 250 బంతుల్లో 16 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి (90 ఓవర్లలో) 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77) మరోసారి విజృంభించి ఆడాడు. ఇతను పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో హనుమా విహారి (39 బ్యాటింగ్; 58 బంతుల్లో 5 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో పుజారాకు అండగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (23), అజింక్యా రహానే (18) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ఇక లొకేష్ రాహుల్ మరోసారి తన పేలవ ఫామ్‌ను పునారావృతం చేస్తూ (9) పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. ఇక ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు.
చివరి టెస్టులో గెలిచి నయా చరిత్ర సృష్టించేందుకు భారత జట్టు సిద్ధమయింది. తొలి రోజు ఆటలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు బ్యాట్స్‌మెన్స్ శుభారంభాన్ని అందించారు. మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ పుజారా మరోసారి తన బ్యాట్‌ను ఝులిపించాడు. అజేయ శతకంతో ఆసీస్ బౌలర్లను చీల్చి చెండడాడు. ఈ సిరీస్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న పుజారా మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఎన్నో రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఇతని ధాటికి ఆసీస్ బౌలర్లు నిస్సహాయులై ఉండిపోయారు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ చిరస్మరణీయ శతకాన్ని నమోదు చేశాడు. ఆసీస్ కొత్త స్పిన్నర్ మర్నూస్‌ను టార్గెట్ చేసి అతని ఓవర్లో పరుగుల వరద పారించాడు. ఇక పేస్ బౌలర్లనూ సైతం వదలకుండా వారి బౌలింగ్‌లోనూ భారీ పరుగులు చేశాడు. చివరి టెస్టు గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటున్న టీమిండియా కలకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు అరంగేట్రం టెస్టు సిరీస్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ కూడా అసాధారాణ బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ వేగంగా ఆడుతూ భారత్‌కు గట్టి పునాది వేయడంలో సఫలమయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ విఫలమైనా తాను మాత్రం పుజారాతో జత కలిపి భారత్‌ను ఆదుకున్నాడు. చివర్లో తెలుగబ్బాయి హనుమా విహారీ కూడా రాణించడంతో భారత్ పోరాడే స్కోరును నమోదు చేయగలిగింది. ప్రస్తుతం భారత్ 300పై పరుగులు సాధాంచి పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు కూడా భారత్ 100 పరుగులు చేస్తే దాదాపు మ్యాచ్ మన చేతిలో వచ్చినట్టే. బ్యాట్స్‌మెన్స్ అయితే తమ పని కానిచ్చారు. తర్వాత బౌలర్లు ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే విజయం మరింతగా సులువవుతోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలువని భారత్ ఈసారి ఆ ఫీట్‌ను అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయింది.
రాహుల్ మళ్లీ ఢమాల్..
గురువారం ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన భారత సారథి విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా దిగాడు. అయితే తొలి రెండు టెస్టులో ఘోరంగా విఫలమైన రహుల్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అయితే రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల కారణంగా నాలుగో టెస్టు ఆడలేక పోవడంతో అతని స్థానంలో రాహుల్‌కి మరోసారి చోటు లభించింది. కానీ దానిని వినియోగించుకోలేకపోయాడు. అదే పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. వరుసగా రెండు ఫోర్లతో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కానీ ఆ దూకుడును ముందుకు కొనసాగించలేడు. హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికే రాహుల్ (6 బంతుల్లో 9) పరుగులు చేసి షాన్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
ఆదుకున్న మయాంక్, పుజారా..
తర్వాత వచ్చిన మిస్టర్ డిపెండబుల్ చతేశ్వర్ పుజారాతో కలిసి మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు సాగించారు. ఒకవైపు పుజారా సమన్వయంతో ఆడుతుంటే.. మరోవైపు మయాంక్ మాత్రం ధాటిగా ఆడుతూపోయాడు. అవకాశం దొరికినప్పుడు చెత్త బంతులను బౌండరీలుగా మార్చు తూ వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా 13.6 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ జంటను విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎన్నో ప్రయత్నాలు చేసిన వారికి దక్కలేదు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీ రెండో వికెట్‌కు 104 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది. తర్వాత లంచ్ విరామ సమయానికి భారత్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. లంచ్ తర్వాత కూడా మయాంక్ దూకుడును కొనసాగిస్తూ పరుగులు సాధించాడు. మరోవైపు పుజారా తనదైన శైలీలో కుదురుగా ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మయాంక్ 96 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి ఆసీస్ సారథి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తరచు బౌలర్లను మార్చుతూ బౌలింగ్ వేయించిన ఫలితం మాత్రం లభించలేదు. వీరిద్దరూ మరో గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. సింగిల్స్, డబుల్స్‌తో పాటు అవకాశం లభించినప్పుడు బౌండరీలు కొడుతూ పరుగుల వేగం కూడా మరీ తక్కువకాకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా 30.1 ఓవర్లలో 100 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. మరోవైపు వీరు రెండో వికెట్‌కు 178 బంతుల్లోనే కీలకమైన శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని భారత్‌కు గట్టి పునాది వేశారు. అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్రయత్నం ఫలించింది. దూకుడుగా ఆడుతున్న మయాంక్ అగర్వాల్ (77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 126 పరుగుల వద్ద కీలకమైన రెండో వికెట్‌ను కోల్పోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జత చేశారు. తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన బారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. మరోవైపు పుజారా మాత్రం సమన్వయంతో ఆడుతూ ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. భారత బ్యాట్స్‌మెన్స్ ఆసీస్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. కుదురుగా ఆడుతున్న పుజారా 134 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు వీరు మూడో వికెట్‌కు 106 బంతుల్లో 50 పరుగులు జోడించారు. అనంతరం భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న కోహ్లీ (59 బంతుల్లో 23)ను హేజిల్‌వుడ్ వెనుకకు పంపాడు. దీంతో భారత్ 180 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. ఈ సమయంలో వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో కలిసి పుజారా మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కూడా కుదురుగా ఆడడంతో పరుగుల వేగం మందగించింది. వీరు సింగిల్స్, డబుల్స్ తీస్తూ ముందుకు సాగడంతో 62.1 ఓవర్లలో రెండు వందల మార్కును దాటింది. తర్వాత సమన్వయంతో ఆడుతున్న రహానే (55 బంతుల్లో 18)ను స్టార్క్ ఔట్ చేయడంతో 228 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
చివర్లో విహారితో కలిసి..
అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమా విహారితో కలిసి రహానే భారత ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. వీరిద్దరూ మరో వికెట్ చేజారకుండా జాగ్రత్త పడుతూనే స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. పుజారా నిదానంగా ఆడుతుంటే.. విహారి మాత్రం చెలరేగి ఆడాడు. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి అవకాశం దొరికిప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న మిస్టర్ డిపేండబుల్ పుజారా 199 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో మూడో శతకాన్ని నమోదు చేసుకున్న పుజారాకు ఇది టెస్టుల్లో ఓవరాల్‌గా 18వ శతకం కావడం విశేషం. ఈ సెంచరీతో మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం వీరిద్దరూ చెలరేగడంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది. ఈ క్రమంలోనే వీరు ఐదో వికెట్‌కు 72 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ జంటను విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే వీరు భారత్ స్కోరును 300 పరుగులు దాటించారు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో 303/4 పరుగులు చేసింది. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన చతేశ్వర్ పుజారా 250 బంతుల్లో 16 ఫోర్ల సహాయంతో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు విహారి కూడా (39 బ్యాటింగ్; 58 బంతుల్లో 5 ఫోర్లు) పరుగులు చేసి నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 51 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్‌కు చెరో వికెట్ లభించింది.
పుజారా ఖాతాలో రికార్డులు..
ద్రవిడ్ వారసుడిగా పేరొందిన నయా వాల్ పుజారా సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో కూడా సెంచరీ నమోదు చేశాడు. తాజా సెంచరీతో కెరీర్ 18వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఈ సిరీస్‌లో మూడో శతకం కావడం విశేషం. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మెన్స్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మన్, 3వ నెంబర్‌లో బ్యాటింగ్ చేసే ప్లేయర్లలో ఒకే సిరీస్‌లో మూడు శతకాలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా కూడా మరో రికార్డును సాధించాడు. మరోవైపు ఆసీస్ గడ్డపై మొదటి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్లలో పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు. తాజా సిడ్నీ టెస్టులో పుజారా మొదటి రోజు ఆటలో (130 పరుగులు) చేసి అజేయంగా నిలిచాడు. అయితే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో పుజారా నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో విరేంద్ర సెహ్వాగ్ (195) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత రెండో స్థానంలో మురళి విజయ్ (144), మూడో స్థానంలో సునీల్ గవాస్కర్ (132)లో నిలువగా.. పుజారా (130) పరుగులతో నాలుగో స్థానంతో సచిన్‌ను అధిగమించాడు. ఇక సచిన్ టెండూల్కర్ (124) పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకు 1000పైగా బంతుల్ని ఎదుర్కొన్న భారత ఆటగాళ్ల జాబితాలో కూడా పుజారా చోటు దక్కించుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించిన పుజారా ఆసీస్ పర్యటనలో వెయ్యి బంతులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చేరుకున్నాడు. అంతకుముందు ఆసీస్ పర్యటనలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు ఆడిన భారత బ్యాట్స్‌మెన్స్‌ల జాబితాను ఓసారి చూసుకుందాం.. 2003- సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ అత్యధికంగా 1203 బంతులు ఎదుర్కొని మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత విజయ్ హజారే (1192 బంతులు) రెండో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానల్లో విరాట్ కోహ్లీ (1093 బంతులు), సునీల్ గవాస్కర్ (1032 బంతులతో) ఉన్నారు.
చతేశ్వర్ చమత్కారం
RELATED ARTICLES