మోడీ పార్లమెంటు ముఖమే చూడటం లేదు
ప్రతిపక్షాల నిరసన ప్రదర్శన
ఎంపిల సస్పెన్షన్ రద్దుకు రాహుల్‌గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఇరవై రోజుల పాటు 12 మంది రాజ్యసభ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణం ఎత్తివేయాలని మంగళవారం ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సస్పెన్షన్‌కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులకు మద్దతుగా పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం నుండి విజయ్ చౌక్ వరకూ ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శన జరిపాయి. కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ సహా లోక్‌సభ రాజ్యసభలకు చెందిన అనేకమంది ప్రతిపక్ష సభా నాయకులు, ప్రతిపక్ష ఎం పిలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలను ప్రభుత్వం మాట్లాడనివ్వడం లేదని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ విమర్శించా రు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అస్సలు పార్లమెంటుకే రావడం లేదని, పార్లమెంటు మొహం చూడటం లేదని, అసలు ఇది ప్రజాస్వామ్య విధానమే కాదని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు ను అధికారపక్షం కేవలం ఒక భవనంగానూ, ఒక మ్యూజియంగానూ మార్చేసిందితప్ప ప్రజా సమస్యలు చర్చించే వేదికగా చూడటం లేదని ఆయన ధ్వజమెత్తారు. సస్పెన్షన్‌తో సహా ప్రజా సమస్యలనుప్రతిపక్షాలు సభలో ఎప్పుడు ప్రస్తావించడానికి ప్రయత్నించినాగానీ వారు తీవ్రంగా అణచివేస్తున్నారని, ఏ కోశానా ప్రజా సమస్యలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సభలో ప్రతిపక్షాలను అనుమతించడం లేదని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు పూర్తిగా అత్యున్నత చట్టసభల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సమస్యలున్నాయి, వాటిని ప్రస్తావించడాని కి మాకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. “సస్పెండైన 12 మంది ఎంపీలు మాతోపాటే ఇక్కడే ఉన్నారు, ప్రజాస్వామ్యానికి ఇదే ఒక నిదర్శనం, మేం వారికి మద్దతుగా నిలిచాం, సత్యానికి మద్దతుగా నిలిచాం. ఈ నిరసన ప్రదర్శనను బట్టే మీకు తెలుస్తోంది భారతదేశంలో ప్రజాస్వామ్యం గొంతు ఏ విధంగా వినబడకుండా నొక్కేస్తున్నారో.. ప్రభుత్వం ప్రజాగళాన్ని వినబడనీయకుండా చేస్తోందనడానికి ఇలా మేం బయటకు వచ్చి ప్రదర్శన చేయడమే ఒక నిదర్శనం, సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు తమ గళాన్ని వినిపించడానికి చట్టసభ లోపల కాకుండా,ఆ సభ వెలుపల సభా ప్రాంగణంలో కూర్చుని ఉన్నారు, ఇంతకంటే ఏం తార్కాణం కావాలి? రెండు వారాలుగా వారిని సస్పెండ్ చేశారు, ఇంకా వారం రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగుస్తున్నాయి, కానీ ఇంకా వాళ్ళు బయటే కూర్చుని ఉండిపోయారు, వారి ప్రభుత్వం వారి గొంతు నొక్కేసింది, ప్రధానమైన సమస్యలను సభలో చర్చించడానికి మమ్మల్ని అనుమతించడంలేదు ఈ ప్రభుత్వం, పార్లమెంటును నడిపించే పద్ధతి ఇది కాదు, ప్రధానమంత్రి పార్లమెంటుకు రావడం లేదు, మేం ఏ సమస్యను లేవనెత్తాలనుకున్నాగానీ మమ్మల్ని అక్కడే ఆపేయాలని చూస్తున్నారు, ఇది చాలా దురదృష్టకరమైన విషయం, ఇలా ప్రజాస్వామ్యం గొంతు నొక్కడం దురదృష్టకరం, కానీ మన అత్యున్నతమైన చట్టసభల్లో మాత్రం జరుగుతున్నది అదే” అని రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నవంబరు 29వ తేదీన సమావేశాల ఆరంభం రోజున 12 మంది ప్రతిపక్ష సభ్యులను తీర్మానం ద్వారా సభ నుండి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌ను ఈ సమావేశాల కడ వరకూ అమలు చేస్తున్నట్లు ఆనాడే తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. ప్రతిపక్ష సభ్యులు 12 మందీ సభా నియమ నిబంధనలు ఉల్లంఘించారని, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించారని, దేవాలయం వంటి చట్టసభలను అపవిత్రం చేశారని రాజ్యసభాపతి ఎం.వెంకయ్యనాయుడు తరచు చెబుతూ తమ వైఖరిని సమర్థించుకుంటున్నారు. గడచిన వర్షాకాల సమావేశాల్లో 254వ రాజ్యసభ సమావేశంలో ఈ సభ్యులు స్పీకర్‌ను కించపరచేలా ప్రవర్తించారని, సభా నియమ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ శీతాకాల సమావేశాల ఆరంభం రోజున తీర్మానం ద్వారా వారిని సభ నుండి వెళ్ళగొట్టారు. ఈ సస్పెన్షన్‌ను ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య విరుద్ధంగా, పార్లమెంటు నిబంధనలకు విరుద్ధమైనదిగా పేర్కొంటుండగా, అధికార ప్రతిపక్షాలు కూర్చుని మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మరోవైపు వెంకయ్యనాయుడు సలహా ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రాజ్యసభను కుదిపేసిన బహిష్కరణ సమస్య
సస్పెన్షన్ రద్దుకు ప్రతిపక్షాలు డిమాండ్
క్షమాపణ చెప్పమన్న సభాపతి
ప్రతిపక్షాలకు చెందిన 12 మంది ఎంపీలను పార్లమెంటు శీతాకాల సమావేశాల నుండి మొత్తం అన్ని రోజులూ సస్పెండ్ చేసిన అంశం మంగళవారం రాజ్యసభను కుదిపేసింది. సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ఈ సమస్యను లేవనెత్తాయి. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందుకు తిరస్కరించడంతో మరింత గందరగోళం సభలో చెలరేగింది. రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సభను అదుపుచేయలేక మధ్యాహ్నం రెండు గంటల వరకూ సభను వాయిదా వేశారు. అయితే, ఒకవైపు గందరగోళం జరుగుతుండగానే మరోవైపు వెంకయ్యనాయుడు సభలో పీయూశ్ గోయల్‌ను, మల్లికార్జున ఖర్గేను పిలిచి సంభాషించారు. ప్రబుత్వం సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, సస్పెండైన ప్రతిపక్ష సభ్యులు 12 మందీగనుక తమ ప్రవర్తనపట్ల పశ్చాత్తాపం వ్యక్తంచేస్తే, క్షమాపణలు చెబితే వారిని సభలోకి అనుమతిస్తానని ఆయన అన్నారు. “ఇప్పటికైదే ఇదే పరిసస్థితి, దీన్ని దాటి, ఇంతకుమించి నేను ఏమీ చేయలేను’ అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కానీ తాము ఏ తప్పూ చేయలేదని, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ప్రతిపక్ష సభ్యులు స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పెద్ద పెట్టున సభలో నినాదాలు చేశాయి. సభ అరంభమైనప్పటినుండీ గందరగోళం కొనసాగుతున్నప్పటికీ సభను నడిపించేందుకు వెంకయ్యనాయుడు ప్రయత్నించారు. శూన్యగంటలో సభ్యులు ముఖ్య విషయాలు ప్రస్తావించారు. ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి దూసుకు వచ్చి ఛైర్మన్‌కు తమ డిమాండ్లు తెలియజేశాయి. వారిపై తక్షణం సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభ్యులు కోరారు. నినాదాలు చేశారు. స్పీకర్ దృష్టిని తమవైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. సభ మధ్యలోకి దూసుకువచ్చి నిరసన తెలియజేసినాగానీ శూన్య గంటలో కూడా ప్రతిపక్షాలను మాట్లాడేందుకు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తొలుత అనుమతించలేదు. చివరకు గంట తర్వాత కూడా సభ సద్దుమణగకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు ఛైర్మన్ రాజ్యసభను వాయిదా వేయాల్సి వచ్చింది.
పదేపదే సభాపతి సభ్యులను తమ తమ స్థానాలకు వెళ్ళి కూర్చోవాలని సర్దిచెప్పేందుకు యత్నించారే తప్ప సమస్యను ప్రస్తావించడానికి, ఒక పరిష్కారం కనుగొనేందుకు ఆయన ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఆప్ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఉద్దేశించి ఛైర్మన్ మాట్లాడుతూ, మీరు మీ తప్పులను పెంచేసుకుంటున్నారు, మీ తప్పులు పేరుకుపోతున్నాయి అని హెచ్చరిస్తూ, ఆయన సభను సవాలు చేస్తున్నారు, ఆయనను బయటకు తీసుకువెళ్ళాల్సిందిగా సభాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా సభ వాయిదా పడటానికి కొద్ది నిమిషాల ముందే జరిగింది. మీరు ఇలా సభామధ్యస్థలంలోకి దూసుకు రావడం సస్పెండైన 12 మంది ఎంపీలకు ఏ మాత్రం మంచిది కాదు, వారికి ఇది ఏ మాత్రం మేలు చేయదు అని ప్రతిపక్ష సభ్యులను వెంకయ్యనాయుడు హెచ్చరించారు. “నన్ను మీరు ఆదేశించలేరు, ఎంతో ఆవేదనతో నేను మీకు చెబుతున్నా, సభలో క్రమశిక్షణ అమలు చేయడానికి నన్ను అనుమతించండి, ఇలాంటి ఒత్తిడి నన్ను సభలో పనిచేయనివ్వడం లేదు, నన్ను నా పని చేయనివ్వండి’ అని ఆయన అన్నారు. మీరు అలా అయితే సభ మధ్యలోనే కూర్చోండి, మీకు ఎవరూ సమాధానం చెప్పరు అని ఆయన నిందించారు.
చట్టసభల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
RELATED ARTICLES