HomeNewsBreaking Newsచంద్రయాన్‌ 3కి వేగంగా సన్నాహాలు

చంద్రయాన్‌ 3కి వేగంగా సన్నాహాలు

వాహక నౌకపై యాక్సెప్టెన్స్‌ హాట్‌ టెస్ట్‌ విజయవంతం
న్యూఢిల్లీ:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌ 3 సన్నాహాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే, వాహక నౌక క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉష్ణాన్ని ఏ స్థాయి వరకూ భరించగలదో తెలిపే యాక్సెప్టెన్స్‌ హాట్‌ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్‌ 3 ప్రాజెక్టు లాంచ్‌ వెహికల్‌కు ఎగువ దశలో శక్తినిచ్చే సిఇ20 ఇంజన్‌ సామర్థ్యాన్ని పలు దశల్లో పరీక్షిస్తారు. అందులో భాగంగానే ఈనెల 24న తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్లోని హై ఆల్టిట్యూడ్‌ టెస్ట్‌ ఫెసిలిటీలో 25 సెకన్లపాటు హాట్‌ టెస్ట్‌ నిర్వహించినట్టు ఇస్రో బెంగళూరు ప్రధాన కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పరీక్ష సమయంలో అన్ని ప్రొపల్షన్‌ పారామీటర్లు సంతృప్తికరంగా ఉన్నాయని, అంచనాలకు దగ్గరగా సరిపోయినట్టు గుర్తించామని అని ఇస్రో తన ప్రకటనలో తెలిపింది. లాంచ్‌ వెహికిల్‌ ఇంజిన్‌ పూర్తిగా సమీకృత విమాన క్రయోజెనిక్‌ దశను గ్రహించడానికి ప్రొపెల్లెంట్‌ ట్యాంకులు, స్టేజ్‌ స్ట్రక్చర్లు, అనుబంధ ఫ్లూయిడ్‌ లైన్లతో మరింత అనుసంధానం చేయనున్నట్టు వివరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను ఇక్కడ యుఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఎలక్ట్రో – మాగ్నెటిక్‌ ఇంటర్ఫెరెన్స్‌/ ఎలక్ట్రో – మాగ్నెటిక్‌ కాంపాటిబిలిటీ (ఇఎంఐ/ఇఎంసి) పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అంతరిక్ష వాతావరణంలో ఉపగ్రహ ఉపవ్యవస్థల పనితీరును తెలుసుకోవడానికి, ఊహించిన విద్యుదయస్కాంత స్థాయిలతో వాటి అనుకూలతను నిర్ధారించడానికి ఈ పరీక్షలు జరుపుతారు. భారత్‌ చంద్రయాన్‌ ప్రాజెక్టులో ఇది మూడవది. జపాన్‌ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ భాగస్వామ్యంతో ఈ యాత్ర చేపట్టాలని ఇస్రో ఆలోచన చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఒక రోవరును, ఒక ల్యాండరునూ పంపుతారు. ప్రస్తుతం తాను అభివృద్ధి చేస్తూన్న హెచ్‌ 3 వాహనాన్ని, రోవరునూ జాక్సా ఈ యాత్ర కోసం అందించే అవకాశం ఉంది. ల్యాండరును ఇస్రో తయారు చేస్తుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనవి. హాట్‌ టెస్ట్‌ అనేది ఉపగ్రహాల సాక్షాత్కారంలో ఒక ప్రధాన మైలురాయి. ప్రొపల్షన్‌, ల్యాండర్‌, రోవర్‌ అనే మూడు ప్రాధాన మాడ్యూల్స్‌ఈ మిషన్‌లో ఉంటాయి. ఈ ప్రయోగాన్ని జూన్‌ మాసంలో నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. అందుకే, అన్ని రకాల పరీక్షలను పూర్తి చేస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments