HomeNewsBreaking Newsచంద్రబాబుకు రిమాండ్‌

చంద్రబాబుకు రిమాండ్‌

14 రోజులపాటు జ్యుడిషియల్‌ కస్టడీ
రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
తీవ్ర ఉత్కంఠ మధ్య ఎసిబి కోర్టు జడ్జి తీర్పు
ఎపి వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించిన ప్రభుత్వం
అమరావతి:
ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చేందుకు ఎసిబి కోర్టు నిరాకరించింది. ఆయనకు 14 రోజులపాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ (ఈనెల 22వరకు)కు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తొలుత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఎసిబి కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేసిన అనంతరం గంటల కొద్దీ ఉత్కంఠ నెలకొంది. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు తొలిసారిగా అరెస్ట్‌ కావడం… తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌ అయిన క్షణం నుంచి అడుగడుగునా ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 9వ తేదీ (శనివారం)న చంద్రబాబును సిఐడి సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తరలించి… ఆ తర్వాత విజయవాడ ఎసిబి కోర్టులో చంద్రబాబును సిఐడి అధికారులు హాజరుపరిచారు. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో రెండు పక్షాల నుంచి సుదీర్ఘంగా జరిగిన వాదనలు విన్నాక న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ తీర్పు ఎలా వస్తుందనే దిశగా ఇరు పక్షాలు పడిగాపులు కాశారు. తుదకు సిఐడి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. చంద్రబాబుకు
14 రోజులపాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు ఆదేశిస్తూ కీలక తీర్పునిచ్చింది. తీర్పు రిజర్వు చేసిన తర్వాత మూడు గంటల పాటు అన్ని కోణాల్లో అధ్యయనం చేసి, తగిన ఆధారాలను పరిశీలించి న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. ఈ సమయంలో కోర్టు హాలులో ఇరు పక్షాల నుంచి న్యాయవాదులతో సమా 30 మంది మాత్రమే ఉండేలా ఆదేశించారు.
ఉత్కంఠకు తెర స్కిల్‌ కేసు ఆరంభం నుంచి చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందా? లేక జైలుకు వెళ్తారా? అనే విషయమై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూశారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాగట్టిగా వాదించడంతో బెయిల్‌ వస్తుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆశించారు. అయితే ఆయన కేసు మెరిట్స్‌పై వాదనల్ని వ్యూహాత్మకంగా విన్పించలేదు. కేవలం నోటీసుల వ్యవహారం, సెక్షన్ల విధింపుపైనే సుదీర్ఘంగా వాదించారు. స్కిల్‌ కుంభకోణం కేసులో చంద్రబాబుపై 16 సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సెక్షన్లలో 17 (ఏ), 409 సెక్షన్లు కీలకంగా మారాయి. అవి రెండూ మినహాయిస్తే మిగిలినవన్నీ బెయిల్‌బుల్‌ సెక్షన్లుగానే ఉన్నాయి. 409 సెక్షన్‌ అనేది నేర పూరిత ఒప్పంద ఉల్లంఘన కిందకు వస్తుంది. 409, 17 (ఏ) సెక్షన్ల నమోదును వ్యతిరేకిస్తూ చంద్రబాబు తరపున లూథ్రా గట్టిగా వాదనలు విన్పించారు. చంద్రబాబు కేసులో ఒక్క 409 మినహా మిగిలిన సెక్షన్లు అన్నీ బెయిల్‌కు అనుమతులు ఉన్నవేనని అన్నారు. అదే స్థాయిలో సీఐడీ తరపున ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గట్టిగా వాదనల్ని విన్పిస్తూ… స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు చంద్రబాబేనని నొక్కిచెప్పారు. ఇందులో భారీ అవినీతి జరిగిందని, కొందరు విదేశాలకు పరారయ్యారని వాదించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రూ.271 కోట్ల కుంభకోణానికి సూత్రధారి చంద్రబాబేనని, ఆయనను కస్టోడియల్‌ విచారణకు, రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తిని కోరారు. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను ఆయన కోర్టు ముందుంచారు.
ఆదివారం ఉదయం 6 గంటలకు వాదనలు ప్రారంభమైనప్పటి నుంచి తీర్పు వచ్చేంత వరకు కోర్టులోనే చంద్రబాబు ఉన్నారు. న్యాయమూర్తి తీర్పును చంద్రబాబు ప్రత్యక్షంగా విన్నారు. అంతకముందు ఉదయం తన వాదనల్ని స్వయంగా విన్పించుకున్నారు. కోర్టు తీర్పుతో చంద్రబాబును భారీ ఎస్కార్ట్‌ నడుమ రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏసీబీ కోర్టు దగ్గర భారీగా పోలీసులు, పారా మిలటరీ బందాలు 3 కిలో మీటర్ల మేర మోహరించారు. రోడ్డు మార్గంలో తీసుకెళ్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వాయు మార్గంలో తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి విమానంలో తీసుకెళ్లి… అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జైలుకు తీసుకెళ్లనున్నారు.
మరో వైపు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని మండలాల్లో 144 సెక్షన్‌అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హుకుం జారీ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments