ట్రాక్టర్, లారీ ఎదురెదురుగా ఢీ
12 మంది దుర్మరణం
మృతుల్లో 9 మంది ఖమ్మం జిల్లా వాసులు
మరో ముగ్గురు కృష్ణా జిల్లాకు చెందిన వారు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వేదాద్రి వద్ద విషాద ఘటన
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా బుధవారం జరిగిన ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దేవాలయ సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే…ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి గోపిరెడ్డి మొక్కులు తీర్చుకునేందుకు తన ట్రాక్టర్లో మంగళవారం సాయంత్రం జగ్గయ్యపేట మండలం వేదాద్రి లక్ష్మినర్సింహాస్వామి గుడికి వెళ్లారు. మంగళవారం రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే మొక్కులు తీర్చుకుని మధ్యాహ్న సమయంలో అక్కడి నుంచి బయలుదేరారు. రెండు కిలోమీటర్లు రాగానే హేమాద్రి సిమెంట్ కర్మాగారం సమీపంలో ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న ట్యాంకర్ బలంగా ఢీ కొంది. ట్రాక్టర్ ట్రక్కు ఇంజన్ వీడిపోయాయి. ట్రక్కులో 27 మంది ఉండగా ఏ డుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారిని చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వేమిరెడ్డి పుల్లారెడ్డి (60), వేమిరెడ్డి భారతమ్మ (50), వేమిరెడ్డి పద్మావతి (45), వేమిరెడ్డి ఉదయశ్రీ (7), ఉన్నారు. వీరితో పాటు కృష్ణా జిల్లా జయంతి గ్రామానికి చెం దిన గోపిరెడ్డి సమీప బంధువులు గూడూరు సూర్యానారాయణరెడ్డి (46), గూ డూరు రమణమ్మ (45), గూడూరు ఉపేందర్‌రెడ్డి (15) ఉన్నారు. వీరితో పాటు జమలాపురం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి అప్పమ్మ (50), లక్కిరెడ్డి అక్కమ్మ (45), పెద్దగోపవరం గ్రామానికి భూమి రాజేశ్వరి (26), వేమిరెడ్డి కల్యాణి (16), శీలం లక్ష్మి (20) మృతిచెందిన వారిలో ఉన్నారు. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం, గ్రామంలో ఒకేసారి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో పెద్దగోపారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే మధిర సిఐ వేణు మాధవ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సాయం అందించారు. జగ్గయ్యపేట శాసన సభ్యుడు సామినేని ఉదయభాను క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ప్రమాద వివరాలను సిఎల్పి నాయకుడు మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, ఖమ్మంజిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు తెలుసుకున్నారు. ప్రమాద ఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
గవర్నర్ , సిఎం దిగ్భ్రాంతి జగ్గయ్యపేట మండలం, వేదా ద్రి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా వాసులు మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్, సిఎం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.