టిఎస్‌పిఎస్‌సి కార్యాలయ ముట్టడికి అభ్యర్థుల యత్నం
ప్రజాపక్షం / హైదరాబాద్ ఈ నెలాఖరున జరిగే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయం నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు గురువారం ఉదయం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.అభ్యర్థుల నినాదాలతో టిఎస్‌పిఎస్‌సి కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, రియాజ్, పిల్లి సుధాకర్, విద్యార్థి జన సమితి రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి అరుణ్ కుమార్, ఎన్‌ఎస్‌యుఐ రాష్ర్ట ప్రెసిడెంట్ వెంకట్ బలమూర్ తదితరులు గ్రూప్-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్ష వాయిదా వేయాలని సుమారు ఐదు గంటల పాటు విద్యార్థులు నిరసన తెలిపారు . అభ్యర్థుల నిరసన నేపథ్యంలో
టిఎస్‌పిఎస్‌సి కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు.గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు.ఒకే నెలలో గ్రూప్ -2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా గ్రూప్- 2 పరీక్షలోని మూడో పేపర్ ఎకానమీ,లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ -2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు.మానవతా దక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. కాగా , విద్యార్థులకు ప్రతినిధిగా అద్దంకి దయాకర్ , రియాజ్. అనిల్, సింధు తో కూడిన బృందం టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలోకి వెళ్ళింది. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ జనార్ధన్ గారు లేకపోవడంతో అక్కడున్న ఇన్చార్జిలను కలిసి సమస్యను తెలిపారు, పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి: కోదండరాం
గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. అభ్యర్థులతో కలిసి నిరసనల్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం జేఎల్, గ్రూప్ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్నారు. దీనిని దష్టిలో పెట్టుకొని పరీక్షలకు చదువుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం.. పరీక్షకు మరో మూడు నెలలు ఆగలేదా?అని ఎన్‌ఎఎస్‌యుఐ రాష్ర్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. అభ్యర్థుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అరెస్టు చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల అర్తనాథాలు వినరా?ః రేవంత్‌రెడ్డి
నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కెసిఆర్, ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని ‘పరీక్ష’పెడుతున్నాడని టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మంత్రులెందుకు నోరు విప్పరుః ప్రవీణ్‌కుమార్
రాష్ర్టంలో వైన్స్ టెండర్లకు మంత్రుల బంధువులు, అనుచరులతో అప్లికేషన్లు వేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, వీళ్లు మంత్రులా మద్యం వ్యాపారులా? అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు. గ్రూప్-2 అభ్యర్థులు ఎగ్జామ్ ఒక రెండు నెలలు వాయిదా వెయ్యమంటున్నారు, ఒక్క మంత్రి నోరు విప్పడం లేదు, దందాలల్ల బిజీగున్నందుకా? అని ప్రశ్నించారు.
గ్రూప్ వాయిదా వేయాల్సిందే
RELATED ARTICLES