వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేష్
న్యూఢిల్లీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని ఎత్తి వేసే ప్రయత్నాలు చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు దించివేస్తారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బికెఎంయు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఎస్.బాలమల్లేష్ ప్రసంగించారు. ఆయన
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్‌డిఎ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామి చట్టంను ఎత్తి వేయాలని కుట్రలు చేస్తుందని అన్నారు. ఒకవేళ గ్రామీణ ఉపాధి హామి చట్టం ఎత్తివేస్తే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఎస్.బాలమల్లేష్ పేర్కొన్నారు. గ్రామాలను కొత్తగా నగర పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లతో కలిపి పట్టణం పేరుతో కూలీలకు పనిని రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం లేదు. పట్టణ పేదలకు ఉపాధి పని పెట్టాలనే సోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోయిందని విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం మీద వామపక్షాలు ఒత్తిడి తీసుకురావటం వల్ల ప్రతి కుటుంబానికి వంద రోజులు పనిని గ్యారంటీ చేస్తూ ప్రభుత్వమే పని కల్పించే విధంగా గ్రామీణ ఉపాధి హామి చట్టంను పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని 716 జిల్లాలు, 7168బ్లాక్‌లు, 2,69,453 గ్రామ పంచాయితీలలో ఉపాధి పనులు అమలౌతున్నాయని పేర్కొన్నారు. ఆరుకోట్ల 77 లక్షల కుంటుంబాలకు చెందిన 15కోట్ల 78 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. ఈ జాబ్ కార్డులలో 32కోట్ల మంది కూలీలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా 50శాతం మంది కూలీలకు సైతం పని కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా పధకాన్ని ఎత్తి వేయాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ బడ్జెట్‌లో రూ. 2.64 లక్షల కోట్లు కేటాయించాలని, లేనియెడల దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని, ఉపాధి హామీ పథకం రక్షణ కోసం వ్యవసాయ, ఉపాధి కూలీలు సమరశీల పోరాటాలకు సిద్దం కావాలని భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ బికెఎంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు టి.వెంకటరాములు, రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య, ఎల్.శ్రావణ్ కుమార్‌తో పాటు 40 మంది తెలంగాణ నుండి పొల్గొన్నారు.