పోడు రైతు పోరాట కమిటీ నాయకుల డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్ గ్రామ సభలతోనే అటవీ హక్కుల- 2006 చట్టం ద్వారా పోడు భూముల సమస్యను పరిష్కరించాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. 30 రోజుల గడువుతో చట్టాన్ని తూతూమాత్రంగా మమ అనిపించే కుట్ర దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోడు రైతు పోరాట కమిటీ నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి,(సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్దన్, కాంగ్రెస్ నాయకురాలు భవాని పాల్గొన్నారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ఆకలి మంటల ఆగ్రహ పోరాటమన్నారు. చట్టం కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. అటవీ హక్కుల చట్టం – 2006 పరిధిలో తెలంగాణ ప్రభుత్వం పని చేయడం లేదన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ఇంత వరకు సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దుల సమస్య ఉందని, ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేదన్నారు. రెవెన్యూ భూముల్లో కెసిఆర్ సర్కార్ ఇచ్చిన పాసు పుస్తకాలు ఉన్నాయని, వాటిలో కూడా అటవీ శాఖ అధికారులు పోడు రైతులను వెళ్లగొడుతున్నారని చెప్పారు. గ్రామ సభలు లేకుండా హడావిడిగా చట్టం అమలు చేయడం పద్ధతి కాదన్నారు. 30 రోజుల గడువు అంటే చట్టాన్ని తూతూమంత్రంగా అమలు చేస్తున్నట్టు కనబడుతుందన్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన టిఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బిజెపితో యుద్ధం అని ప్రకటించి సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసలైన పోడు సాగుదారులకు పట్టాలు వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్ర స్థాయి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అటవీ హక్కుల చట్టం -2006 అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని చెప్పారు. పోడు భూముల విషయంలో రాజకీయ ప్రమేయం ఉండకూడదన్నారు. అడవిలో ఉన్న గ్రామాన్ని తరలించాలని అనడం, సాగుచేసుకుంటున్న భూమిని కాకుండా ఎక్కడో భూమి చూపిస్తాం అనడం చట్ట విరుద్ధమన్నారు. అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించాలని చూస్తున్నారన్నారు. అడవిని రక్షించాలని అనుకుంటే యురేనియం తయారీకి ఎందుకు అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించారు. పోడు పట్టాలు ఇవ్వడానికి ఉన్న రోడ్ మ్యాప్ స్పష్టంగా ప్రకటించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలన్నారు. చట్టంపై అవగాహన లేనివారికి బాధ్యతలు ఇస్తున్నారని తెలిపారు. చట్టం సక్రమంగా అమలు చేయకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అవసరం అయితే ఢిల్లీలో ధర్నా చేస్తామని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో అనడం సిగ్గుమాలిన వైఖరన్నారు. బిజెపి సర్కార్ బిల్లులకు మద్దతు తెలిపి, ఇప్పుడు ధర్నా చేస్తానంటే ఎవరు నమ్మతారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒకరిపై ఒకరు మాటల యుద్ధం మాత్రమే చేస్తున్నారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పు చూసి సిఎం కెసిఆర్‌కు భయం మొదలైందన్నారు. అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతమవుతుందన్నారు. కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించాలన్నారు. చట్టానికి లోబడి సమస్య పరిష్కారం చేయాలని కోరారు. చట్టం ప్రకారం గ్రామ సభలను నిర్వహించాలన్నారు. శాటిలైట్ పిక్చర్‌పై ఆధార పడితే సరిపోదన్నారు. ఏదో నలుగురికి పట్టాలు ఇచ్చి దీన్ని ముగిద్దాం అని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నిజమైన పోడు సాగుదరులను గుర్తించి, పట్టాలు ఇవ్వాలని కోరారు. ఎక్కడ ఉల్లంఘన జరిగిన ఊరుకోమన్నారు. గోవర్థన్ మాట్లాడుతూ అడవులపై అధిపత్యం ఆదివాసిలదేనని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని యధావీధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 13 లక్షల మంది వరకు బాధితులు ఉన్నారని, అర్హులందరికీ పట్టాలు ఇచ్చే వరకు ప్రక్రియ కొనసాగించాలన్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి గ్రామ సభకు ఉన్న అధికారాలు హరించే విధంగా చట్టం అమలు చేయవద్దన్నారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. గవర్నర్, గిరిజన సంక్షేమ కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కలిసి, పోడు సమస్యను పరిష్కరించాలని కోరుతామన్నారు. కాంగ్రెస్ నాయకురాలు భవాని మాట్లాడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు నెల రోజుల సమయం ఇవ్వడం సరికాదన్నారు. ఇందులో కూడా కెసిఆర్ సొంత లాభం ఉంటుందన్నారు. నర్సాపూర్‌లో అటవీ భూమి తగ్గిపోయిందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, నాయకులు రంగన్న, శ్రీరామ్ నాయక్, టిడిపి నాయకులు శ్రీపతి సతీష్, టిజెఎస్ నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.