HomeNewsBreaking Newsగౌరవెల్లి ప్రాజెక్టు పనుల పునఃప్రారంభంలో ఉద్రిక్తత

గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పునఃప్రారంభంలో ఉద్రిక్తత

మెరుగైన పరిహారం కోసం కొనసాగుతున్న బాధితుల ఆందోళనలు
రెండో రోజూ వంటావార్పు….. సాముహిక భోజనాలు
ఆందోళనకు మద్దతు తెలిపి బాధితులను పరామర్శించిన సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్‌
బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి లేఖ
ప్రజాపక్షం/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పునఃప్రారంభాన్ని నిర్వాసిత గ్రామాల ప్రజలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, నిర్వాసితుల మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప లాఠీచార్జ్‌కి దారితీసింది. మెరుగైన పరిహారం ఆందించాలని డిమాండ్‌ చేస్తూ గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితుల ఆందోళన రెండో రొజుకు చేరింది. ముంపు బాధితులు శుక్రవారం కూడా ప్రాజెక్టు పనులను అడ్డుకుని అక్కడే ‘వంటా వార్పు’ చేపట్టి సాముహిక భోజనాలు చేశారు. మొదటి రోజు పెద్దఎత్తున పోలీసులు మోహరించగా రెండో రోజు సైతం ప్రాజెక్టు వద్ద పోలీసులు పహారా కాశారు. నిర్వాసితులు శాంతియుతంగా తమ నిరసనలు చేపట్టి అక్కడే బైఠాయించి ఆందోళనలు కొనసాగించారు. గుడాటిపల్లి సర్పంచ్‌ బద్దం రాజిరెడ్డితో పాటు దాదాపు రెండు వందల మంది నిర్వాసితులు తమ నిరసనను కొనసాగించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, బిజెపి నేత రాంగోపాల్‌రెడ్డి, సామాజిక సేవకురాలు మంజులరెడ్డి నిర్వాసితులను కలసి మద్దతు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వద్దనే పొయ్యిలను ఏర్పాటు చేసి ఉదయం అల్పహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి వంటా వార్పు నిర్వహించి నిర్వాసితులు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ మాట్లాడుతూ గౌరవెళ్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. భూ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం వెంటనే ఆందించాలన్నారు. ముంపు బాధితుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలన్నారు. నిర్వాసితులపై పోలీసులు పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన లాఠీచార్జ్‌లో గాయపడిన వారిని సిపిఐ నాయకుల బృందం పరామర్శించింది. ఇదిలా ఉండగా ఈ జలాశయం పనులు 85 శాతం పూర్తయ్యాయి. మిగతా పనులను రెండేళ్లుగా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద రెండు చోట్ల రహదారులను మూసివేసి కట్టను నిర్మించాల్సి ఉంది. ఈ పనులను గురువారం రోజు పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ప్రారంభించగా గుడాటిపల్లి, సోమాజీతండా వాసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో భైరి చిరంజీవి, బోయిని మహేశ్‌ అనే యువకులకు గాయాలయ్యాయి. నిర్వాసితులు మట్టిపెళ్లలు విసరడంతో హుస్నాబాద్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ నుదుటికి గాయమైంది. తాజాగా 18 ఏళ్లు నిండిన మేజర్లు, ఇల్లు, పెరటి స్థలాలు ఇచ్చిన వారికీ పునరావాస ప్యాకేజీ, రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని గుడాటిపల్లి సర్పంచ్‌ రాజిరెడ్డితో పాటు నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎన్‌జిటిలో కేసు నడుస్తోందని, పనులు చేయబోమని అక్కడ చెప్పి ఇక్కడ కొనసాగిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. దాడి ఘటనకు సంబంధించి 13 మంది నిర్వాసితులపై కేసు నమోదు చేసినట్లు అక్కన్నపేట ఎస్‌ఐ కొత్తపల్లి రవి తెలిపారు.

బాధితులకు న్యాయం చేయాలి : చాడ
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : గౌరవెల్లి రిజర్వాయర్‌ వద్ద నిర్వాసితులు, రైతులపై జరిగిన లాఠీచార్జీ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో పాటు, నిర్వాసితుల సమస్యలపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు శుక్రవారం నాడు ఆయన లేఖ రాశారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరువుకు నిలయాలుగానున్న హుస్నాబాద్‌, భీందేవరపల్లి, గంగాధర, సిరిసిల్లా ప్రాంతాలకు సాగునీరు, తాగునీటి కోసం అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 1994 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం శ్రీరాంసాగర్‌ వరదకాలువను మంజూరు చేసిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో తోటపల్లి, గౌరవెల్లి, గండపల్లి రిజర్వాయర్లు మంజూరు చేసినా, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నామమాత్రంగా కేటాయించడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయని తెలిపారు. 2007లో గౌరవెల్లి, తదితర రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసినా, 2008 నుండి పనులు ప్రారంభించచారని పేర్కొన్నారు.ఉమ్మడి రాష్ర్టంలో గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యము 1.7 టియంసీలుకాగా, తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత దానిని 2015లో 8.29 టీయంసిలకు పెంచారని, దీనితో రైతులు రెండుసార్లు భూములు కోల్పోవలసి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు భూనిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ పూర్తిగా చెల్లించకపోవడంతో అధికారుల చుట్టు రైతులు, ప్రజలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడాటిపల్లి, తెనుగుపల్లి చుట్టు రిజర్వాయర్ల కట్ట నిర్మించారని, ప్రజల రాకపోకలకు కేవలం రెండు చోట్ల రహదారికి స్థలం విడిచిపెట్టారని చాడ తెలిపారు. పూర్తిస్థాయిలో భూనిర్వాసితులకు డబ్బులు ఇవ్వలేదని, 18 సంవత్సరాలు నిండినవారికి పునరావాస ప్యాకేజి, ఇండ్ల స్థలాలకు నిధులు, ప్రభుత్వ భూములున్న లబ్ధిదారులకు నష్టపరిహారం, డబుల్‌ బెడ్‌ రూమ్‌లు మంజూరి చేయకుండా ప్రజలను పోలీసు బలగాలతో భయబ్రాంతానికి గురి చేసి రాకపోకలు లేకుండా చేయడం అన్యాయమన్నారు. అ రహదారిని రాకపోకలను నిలిపివేయకుండా అడ్డుపడిన ప్రజలపై ఈ నెల 23న విచక్షణారహితంగా లాఠీచార్జీ చేసి బలప్రయోగం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
గౌరవెల్లికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలిఃభూనిర్వాసితులు, పునరావాస ప్యాకేజీ లాంటి అంశాలను పరిష్కరిస్తే ప్రజలే స్వచ్ఛంధంగా ఖాళీ చేస్తారని సిఎంకు రాసిన లేఖలో చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇండ్లు, భూములు సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యతగా ఇవ్వాలని సూచించారు. ఇందుకు మానవతా దక్ఫథముతో స్పందించి గౌరవెల్లి రిజర్వాయర్‌ పూర్తి కోసం రూ.1000 కోట్ల నిధులు తక్షణమే మంజూరు చేయాలని చాడ విజ్ఞప్తి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments