భారత చెస్ క్రీడాకిరిణి కోనేరు హంపి
విజయవాడ : భారత చెస్ నంబర్‌వన్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజయవాడ చేరుకున్నారు. హంపి ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. దీంతో విశ్వవిజేతగా నిలిచిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచింది. విజయవాడ చేరుకున్న హంపి మీడియాతో మాట్లాడుతూ… ’చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ మెడల్ సాధించడం నా 15 ఏళ్ల కల. ప్రత్యర్థులతో ఎత్తుకు పైఎత్తు వేసి మేధస్సుకు పని చెప్పా. ఈ విజయం వెనక తల్లిదండ్రులు, భర్త ఉన్నారు. గోల్డ్ మెడల్ ఇస్తున్న సమయంలో జాతీయ గీతం వినగానే చాలా సంతోషం వేసింది’ అని అన్నారు. ’పాప పుట్టడంతో రెండేళ్ల వరకు ఆటకు దూరంగా ఉన్నా. తిరిగి ఆడిన గేమ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్ల వయసు నుంచే చెస్ ప్లేయర్‌గా రాణించా. రెండేళ్ల బ్రేక్ తర్వాత చెస్ ఆడటం కొంచెం కష్టమనిపించింది. ఈ సమయంలో గెలుపు, ఓటములను చూశా. మరిన్ని టోర్నమెంట్స్ అడి దేశం గర్వించే విధంగా చేస్తా’ అని హంపి చెప్పుకోచ్చింది. సోమవారం ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో హంపి నిర్ణీత 17 రౌండ్లలో 10.5 పాయింట్లు ఖాతాలో వేసుకొని 12వ స్థానంలో నిలిచింది. మొత్తం 17 రౌండ్ల ఈ బ్లిట్జ్ కేటగిరిలో ఆదివారం తొమ్మిది రౌండ్లు.. సోమవారం ఎనిమిది రౌండ్లు జరిగాయి. హంపి 17 రౌండ్ల తర్వాత 10.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను ప్రకటించగా.. హంపికి 12వ స్థానం దక్కింది. మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 12 రౌండ్లుగా హంపీ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని చాంపియన్‌గా అవతరించింది. 12 రౌండ్ల తర్వాత హంపి, లీ టింగ్‌జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో నిలిచారు. మెరుగైన ’టై’ బ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను ప్రకటించగా.. హంపి, లీ టింగ్‌జి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. చివరకు అర్మగెడాన్ గేమ్‌లో హంపి గెలుపొందింది.
గోల్డ్ మెడల్ నా పదిహేనేళ్ల కల
RELATED ARTICLES