HomeNewsBreaking Newsగోధుమ ఎగుమతిపై నిషేధం రైతు వ్యతిరేక చర్య

గోధుమ ఎగుమతిపై నిషేధం రైతు వ్యతిరేక చర్య

విదేశాల్లో భారీ డిమాండ్‌ను దక్కకుండా చేశారు
క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వలేదు
పంజాబ్‌ రైతు సంఘాలు ధ్వజం
చండీగఢ్‌ : గోధుమ ఎగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్‌ రాష్ట్రంలోని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిషేధాన్ని రైతు వ్యతిరేక చర్యగా రైతు సంఘాలు అభివర్ణించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలకు ముఖ్యంగా గోధుమ ఎగుమతికి భారీ గిరాకీ ఉంది. ప్రపంచమార్కెట్‌లో గోధుమల రవాణా ఉక్రేన్‌ నుండి ఆగిపోవడంతో అనేక దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశంలోని గోధుమ రైతులు అంతర్జాతీయ మార్కెట్‌ను అందిపుచ్చుకుని ఆ లాభాలా ఫలితాలను పొందకుండా చేసిందని కేంద్ర ప్రభుత్వింపై పంజాబ్‌ రైతు సంఘాలు విరుచుకుపడుతున్నాయి. క్వింటాల్‌ గోధుమపై రూ.500 అదనపు బోనస్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని కూడా పంజాబ్‌ రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. మార్చినెలలో తీవ్రమైన వేడిగాలుల ఫలతంగా గోధుమ పంట ఉత్పత్తి క్షీణించిపోవడంవల్ల నష్టపరిహార ప్రాతిపదికపై రైతులకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని రైతు సంఘాలు కోరారయి. ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రిటైల్‌ ధరలు అదుపు చేయడం కోసమే మాత్రమే ఈ నిషేధం విధించామని ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే “ఇది రైతు వ్యతిరేక నిర్ణయం” అని భారతి కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రహాన్‌) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్‌ సింగ్‌ కోక్రికలాన్‌ వ్యాఖ్యానించారు. దేశీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే మంచి లాభాలు పొందడంకోసం గోదాములో నిల్వలు చేసిన రైతులు విదేశీ ఎగుమతులపై నిషేధం వల్ల తీవ్రంగా నష్టపోతారని అన్నారు. “ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు ఆశించలేదు” అని భారతీ కిసాన్‌ యూనియన్‌ (లాఖోవాల్‌) ప్రధాన కార్యదర్శి హరిందర్‌ సింగ్‌ లాఖోవాల్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు రైతులను అనుమతిస్తే రైతాంగం బాగుపడుతుందని, ఆ మార్కెట్‌ను అందిపుచ్చుకోవచ్చునని అన్నారు. భారీ ధరల డిమాండ్‌ రైతులకు దక్కుతుందన్నారు. శిరోమణి అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కూడా కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో బాగా దెబ్బతిన్న రైతాంగానికి విదేశీ మార్కెట్‌ను చేజిక్కించుకోవడం మంచి అవకాశమని, అందుకు వీలు కలిగించాలని అన్నారు.
ఇదిలా ఉండగా పంజాబ్‌ ప్రభుత్వం మరోవైపు ఆ రాష్ట్రంలో కనీస మద్దతుధరలకే గోధుమ సేకరణ 232 మండీల వద్ద మే 31 వరకూ కొనసాగించాలని ఆదేశించింది. ఎగుమతులపై నిషేధం వల్ల దేశంలో ధరలు తగ్గిపోతాయని పంజాబ్‌ ఆహార, పౌర సరఫరాల శాఖామంత్రి లాల్‌ చంద్‌ కటరుచాక్‌ అన్నారు. మంచి ధర వచ్చేదాకా ఎదురుచూడాలని గోధుమను దాచిపెట్టుకున్న రైతులు ఈ నిషేధ ఉత్తర్వుల కారణంగా పునరాలోచనలో పడ్డారని, వారంతా తీవ్ర నష్టాలకు గురవుతారని మంత్రి అన్నారు. పంజాబ్‌లో గోధుమ సేకరణ 30 లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చినెలలో ఆకస్మికంగా వేడిగాలులు భారీగా పెరిగిపోవడంతో గోధుమ ఉత్పత్త దెబ్బతింది. దీంతో నిర్దేశిత కోటీ 77 లక్షల మెట్రిక్‌ టన్నులకు బదులుగా కేవలం కోటీ 47 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌కు ఇప్పటివరకూ కోటీ రెండు లక్షల టన్నుల గోధుమ మార్కెట్‌లోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతి నిషేధిస్తున్నట్లు ఈనెల 13 వ తేదీతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయ. విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టొరేట్‌ జనరల్‌ కార్యాలయం (డిడిఎఫ్‌టి) ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే అమలులో ఉన్న ఎగుమతి ఒప్పందాలను దీని నుండి మినహాయించారు. ప్రైవేటు వ్యాపారులు భారీ ఎత్తున ఇప్పటికే గోధుమ కొనుగోలు చేశారు. 2022 కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల 444 లక్షల టన్నుల గోధుమ సేకరించాలని రికార్డుస్థాయీ లక్ష్యం నిర్దేశించింది. సెంట్రల్‌ పూల్‌కు చాలా తక్కువ స్థాయిలో కొనుగోళ్ళు జరగడంతో బహిరంగ మార్కెట్‌ క్రయ పథకం (ఒఎంఎస్‌ఎస్‌) కింద గోధుమ విక్రయాన్ని కేంద్రం నిలిపివేసింది. 2021 జూలై పంటల సంవత్సరంలో 11 కోట్ల 42 లక్షల టన్నుల గోధుమ దేశంలో ఉత్పత్తి అయింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments