గోదావరి నీటి తరలింపుపై తెలంగాణ, ఎపిలు చర్చలు జరుపుతున్న తరుణంలో కేంద్రం ప్రతిపాదన
తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టత వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్న తెలంగాణ
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత కొంత కాలంగా గోదావరి నీటిని కృష్ణాకు తరలించడంపై చర్చలు జరుపుతున్న తరుణంలో కేంద్రం ఈ విషయంలో తాజాగా మరో ప్రతిపాదన చేసింది. కేంద్రం తొలుత నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా జానంపేట నుంచి పైప్‌లైన్ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలన్న ప్రతిపాదన చేసింది. అయితే దీనిని తెలంగాణ వ్యతిరేకించింది. దీంతో కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యుడిఎ) తొలి ప్రతిపాదనను పక్కన బెట్టి ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ కు నీటిని తరలించే ప్రక్రియను తెలుగు రాష్ట్రాల ముందు పెట్టింది. దీని కోసం మూసీ నదిని ఉపయోగించుకోవాలని ప్రతిపాదన చేసింది. కేంద్రం దీనికే మొగ్గుచూపుతున్నట్లు సమాచా రం. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు లు ఇటీవల సమావేశమై గోదావరి నీటిని కృష్ణాకు తరలించే విధానంపై చర్చించినప్పటికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కేంద్రం జలవనరుల అభివృద్ధి సంస్థ చేసిన ఇచ్చంపల్లి ప్రతిపాదనపై కూడా వారివురు స్పందించలేదు. అయితే కేంద్రం మాత్రం ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు తరలించడాన్నే ఆమోదం తెలుపాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై తెలంగాణ ఆమోదాన్ని కోరుతూ ఎన్‌డబ్ల్యుడిఎ లేఖ రాసింది. వాస్తవాన్ని పరిశీలిస్తే నదుల అనుసంధాన ప్రక్రియను కేంద్రమే తొలుత చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం మొదట 247 టిఎంసిల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలపడంతో జానంపేట ప్రతిపాదనను తెచ్చింది. దీని ద్వారా భూసేకరణను తగ్గించి పైప్‌లైన్ ద్వారా గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తే వ్యయం రూ.90 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా. పైప్‌లైన్ ద్వారా కాకుండా కాల్వల ద్వారా తరలిస్తే రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని ఇంజినీర్లు అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదన కూడా అంతగా అనుకూలంగా లేదని తెలంగాణ తిరస్కరించింది. దీంతో జానంపేట ప్రతిపాదనను పక్కన పెట్టిన కేంద్రం, తాజాగా ఇచ్చంపల్లి ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ ప్రతిపాదన మేరకు ఇచ్చంపల్లి నుండి గోదావరిని నాగార్జున సాగర్‌లో కృష్ణాకు అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించింది.