భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
లోతట్టు ప్రాంతాలు జలమయం
విస్తాకాంప్లెక్స్ వద్దకు చేరుకున్న నీరు
పునరావాస కేంద్రాల్లోకి నిర్వాసితులు
ప్రజాపక్షం/భద్రాచలం భద్రాచలం వద్ద గోదావరికి వరద భారీగా పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నదికి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 7 గంటల వరకు 48.30 అడుగులకు చేరుకుంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం ఉదయం 7.45 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు 44.7 అడుగులు, సాయంత్రం 4 గంటలకు 47.5 అడుగులకు చేరుకుంది. 5 గం.లకు 47.9 అడుగులు ఉన్న నీటి మట్టం 5.40 గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహితతో పాటు తాలిపేరు నుండి భారీగా నీరు వచ్చి చేరుతోంది. అదే విధంగా ఎగువనున్న ప్రాజెక్టుల్లో నుండి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులు దాటి గోదావరి ప్రవహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
గోదావరినదికి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. డివిజన్‌లోని వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు ప్రాంతాల్లో గోదావరి నది రోడ్డుపైకి వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుమ్ముగూడెం మండల పరిధిలోని సున్నంబట్టి గ్రామానికి వరద తాకిడి ఉండే అవకాశం ఉండటంతో అధికారులు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించారు. మండలంలోని తూరుబాక, రేగుబల్లి గ్రామశివారుల్లో రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. భద్రాచలం పట్టణంలోని కొత్తకాలనీ, సుభాష్ నగర్ కాలనీకి వరద నీరు చేరింది. దీంతో ఆయా కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. పునరావాస కేంద్రాల వద్ద బాధితల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రామాలయం విస్తా కాంప్లెక్స్‌తో పాటు, అన్నదాన సత్రం రోడ్డు నీటిమయమైంది.
భయాందోళనలో జనం
గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు గతంకంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. పోలవరం బ్యాంక్ వాటర్ ప్రభావం ఈ సారి అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో సహజ వరదతో పాటు బ్యాక్ వాటర్ కలిసి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందనే వార్తలతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు అలుముకున్నాయి. అధికారులు సైతం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ క్షేత్రస్థాయిలో ఉండి వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ సెక్టోరియల్ అధికారులతో ముచ్చటిస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
గోదావరికి భారీగా వరద
RELATED ARTICLES