HomeNewsTelanganaగొర్రే.. గొర్రే.. నీవెక్కడ!

గొర్రే.. గొర్రే.. నీవెక్కడ!

మచ్చుకు కూడా కనపడని కెసిఆర్‌ గొర్రెలు
పంపిణీలో కుంభకోణంపై విచారణ
అక్రమార్కుల గుండెల్లో గుబులు
ప్రజాపక్షం/ ఖమ్మం
‘యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టెలును ఇస్తాం. ప్రతి గ్రామంలోనూ గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో ఉన్న సభ్యులకు అందరికి అందజేస్తాం. ఏడాదికి డబుల్‌ అవుతాయి. మూడేళ్లలో కోట్ల గొర్రెలు తెలంగాణలో ఉంటాయి. దేశానికే కాదు…. ఏకంగా ప్రపంచానికి మాంసం ఉత్పత్తి చేస్తాం. ఆ దిశగా తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుంది’ ఇది అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మాటలు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 3,28,860 గొర్రెలను పంచినట్లు అధికారులు లెక్కలు చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మచ్చుకు కూడా కెసిఆర్‌ గొర్రె కనిపించడం లేదు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు గొర్రెలు ఒక ప్రధాన చర్చనీయాంశలయ్యాయి. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులకు గొర్రెలను అందించే ప్రక్రియ చేపట్టింది. కానీ ఇందులో మొదటి దఫాలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. ఖమ్మంజిల్లాలో మొత్తం 327 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో 33,286 మంది సభ్యులుగా ఉన్నారు. తొలి దశ లో ఒక్కొక్క యూనిట్‌కు గాను రూ. 1,05,105 గా నిర్ణయించి గొర్రెలు పంపిణీ చేశారు. 20 గొర్రెలతో పాటు ఒక పొట్టెలును లబ్ధిదారులకు అందజేసేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. ఖమ్మం జిల్లాలో గొర్రెల కొనుగోళ్లకు గాను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదారి, పశ్చిమగోదారి జిల్లాలను ఎంపిక చేశారు. పశు సంవర్థక శాఖాధికారులు గొర్రెల కొనుగోలు కేంద్రాలకు వెళ్లి లబ్ధిదారులకు గొర్రెలను అందించే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ గొర్రెల కొనుగోలు, పంపిణీకి సంబంధించి రెండు రకాలుగా అవినీతి చోటు చేసుకుంది. గొర్రెల కొనుగోళ్లలో అసలు ధర కంటే తక్కువకు కొని అధికారులు చేతివాటం ప్రదర్శించారు. జిల్లా మొత్తంగా కోట్ల రూపాయలు ఈ రూపంలో చేతులు మారాయి. ఇక గొర్రెలను అక్కడి నుంచి తరలించేందుకు చేసిన ఖర్చు, ఇతరత్రా వ్యవహారాల్లో కూడా పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకుంది. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లాలో 3,28,660 గొర్రెలను కొనుగోలు చేసినట్లు చూపుతున్నారు. మొత్తం 10 నుంచి 50 యూనిట్లే రీసైక్లింగ్‌ జరిగాయని అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లబ్ధిదారులను తీసుకెళ్లడం గొర్రెలను కొనుగోలు చేయడం లబ్ధిదారుల స్వస్థలాకు గొర్రెలు చేరగానే తిరిగి ఆంధ్రాకు తరలి పోవడం చకచకా జరిగిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో మామిడి తోటలో గొర్రెలను ఉంచి రీ సైక్లింగ్‌ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గొర్రెల తరలింపు వాటికి సంబంధించి వాడిన వాహనాలు అధికారులు చూపిన లెక్కలు తీవ్ర గందర గోళానికి తావిచ్చాయి. ప్రభుత్వం మొదటి దశలో రూ. 1.5 లక్షల చొప్పున నిర్ణయించి లబ్ధిదారుల వద్ద నుంచి రూ. 31,250 డిడి రూపంలో స్వీకరించింది. కానీ లబ్ధిదారులు అక్కడి గొర్రెలు ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేక పోవడం పశుసంవర్థక శాఖాధికారులు అనారోగ్యంతో కూడిన గొర్రెలను అందజేయడంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం యూనిట్‌కు రూ. 1.5 లక్షల చొప్పున ఇచ్చిన గొర్రెలను తిరిగి రూ. 60వేల చొప్పున కొనుగోలు చేశారు. కేవలం లబ్ధిదారులకు రూ. 29 వేల లబ్ధి చేకూరిందని ఇందులో ఖర్చులు పోతే కేవలం రూ. 25 వేలు మాత్రమే మిగిలాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గొర్రెల పంపిణీకి సంబంధించి అధికార యంత్రాగం మాత్రం పూర్తి అవినీతిలో మునిగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీకి సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. కార్లు, ఆటోలు, మోటార్‌ సైకిళ్లు, అంబులెన్స్‌ల్లో తరలించినట్లు అధికారులు చూపడం గొర్రెల రీసైక్లింగ్‌ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో రికార్డుల ఆధారంగా విచారణ జరపనున్నట్లు సమాచారం. ఈ స్కాం పలువురి మెడకు చుట్టుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం యూనిట్‌ ధరను రూ. 1.5 లక్షలకు పెంచి లబ్ధిదారుల నుంచి రూ.43,750 చొప్పున డిడి రూపంలో సేకరించింది. వేలాది మంది డిడిలు చెల్లించి రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలోనే 100 మంది గొర్రెల పెంపకందారులు డిడిలు చెల్లించి రెండవ విడత పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల మంది ఎదురు చూస్తున్నారో అవగతమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి అవినీతిపై విచారణ చేయడంతో పాటు డిడిలు చెల్లించిన లబ్ధిదారులకు సత్వరం గొర్రెలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అన్నది ఇంత వరకు తేలలేదు. ఒకవేళ ఈ పథకాన్ని ఎత్తివేస్తే పెద్ద మొత్తంలో చెల్లించిన లబ్ధిదారుల సంగతి ఏమిటన్నది కూడా తేల్చాల్సి ఉంది. మొత్తంగా గొర్రెలు అప్పట్లో లబ్ధిదారులను కరిస్తే ఇప్పుడు అవినీతి అధికారులను కరుస్తున్నాయి. మరి దీనికి మందు ఏమిటో వేచి చూద్దాం.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments