విజయానికి నాలుగు వికెట్ల దూరంలో టీమిండియా
ఇశాంత్ బౌలింగ్ ధాటికి బంగ్లా విలవిల
సెంచరీతో రాణించిన కోహ్లీ
ప్రస్తుతం బంగ్లాదేశ్ : 152/6
ఈడెన్‌లో పింక్‌బాల్ టెస్టు
కోల్‌కతా: బంగ్లా-భారత్ మధ్య జరుగుతున్న డే/నైట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 347 పరుగులు చేయగా, అదే స్కోరు వద్ద డిక్లేర్డ్ చేశాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. తన బౌలర్ల ప్రదర్శన పట్ల విశ్వాసం ఉంచిన కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు వెనుకాడలేదు. షమీ, ఉమేశ్, ఇషాంత్‌లతో కూడిన టీమిండియా పేస్ దళాన్ని ఎదుర్కొని 200 పైచిలుకు పరుగులు చేయడం బంగ్లాకు తలకు మించిన పనే! ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ (136) సెంచరీ హైలైట్ అని చెప్పాలి. పింక్ బంతిని ఎదుర్కోవడం తొలిసారే అయినా ఎంతో పట్టుదల కనబర్చిన కోహ్లీ అద్భుతరీతిలో శతకం సాధించాడు. అంతకుముందే రహానే (51), జడేజా (12) కూడా వెనుదిరిగారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ 3, ఇబాదత్ 3, అబు జాయేద్ 2 వికెట్లు సాధించారు. రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ దూకుడుగా ఆడి రికార్డు సెంచరీ నమోదు చేయగా.. రహానే ఓపికగా ఆడి, అర్థ సెంచరీ సాధించాడు. తొలి సెషన్‌ను భారత్ 4 కోల్పోయి, 289 పరుగులతో ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (59; 70 బంతుల్లో 10స4) ఆచితూచి ఆడుతున్నాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతడికి తైజుల్ ఇస్లామ్ (11; 21 బంతుల్లో 1స4) సహకారం అందిస్తున్నాడు. 32 ఓవర్లకు బంగ్లా 152/6తో ఉంది. ఆ జట్టు ఇంకా 89 పరుగుల లోటుతో ఉంది. ఆట ముగిసేందుకు మరికొన్ని ఓవర్లు మాత్రమే ఉండటంతో వికెట్లు తీసేందుకు టీమిండియా బౌలర్లు ప్రయత్నిస్తున్నారు.
కోహ్లీ సెంచరీ..
ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ. వన్డేల్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 43 సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుపు, ఎర్ర బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ తాజాగా పింక్ బాల్ టెస్టులో సైతం సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్(26 సెంచరీలు) రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. దీంతో పాటు టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 27 టెస్టు సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్‌తో కలిసి 17వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ ప్రస్తుతం 438 ఇన్నింగ్స్‌ల్లో 70 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్‌ల్లో 100 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా, రికీ పాంటింగ్(668 ఇన్నింగ్స్‌ల్లో 71 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా 41 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన కోహ్లీ… మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. ఈ ఏడాది 8వ టెస్టు మ్యాచ్ ఆడుతోన్న విరాట్ కోహ్లీ కోల్‌కతా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియాను విజయం దిశగా నడిపిస్తున్నాడు. ఇక, భారత్‌లోని ప్రముఖ టెస్టు స్టేడియాలైన ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల్లో గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌ల తర్వాత టెస్టు సెంచరీలు సాధించి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈడెన్‌లో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో కోహ్లీ సెంచరీతో అనేక రికార్డులు సొంతమయ్యాయి.
పదో వికెట్ వద్ద భారత్ డిక్లేర్డ్..
తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాను ఆలౌట్ చేసిన టీమిండియా.. 174/3ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుతూ దూసుకెళ్తున్నారు. సెంచరీకి మించిన స్కోరుతో పలు రికార్డులు నమోదు చేసిన కోహ్లీ.. 194బంతుల్లో 136పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి 203పరుగుల భారత్ ఆధిక్యంలో ఉన్నది. 308పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అవడంతో క్రీజులో వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు. కోహ్లీతో పాటు పూజారా(55), రహానె(51)లు హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో రాణించారు. ఈ క్రమంలో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. 347/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రత్యర్థిపై 241 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఎక్కడైనా మంచి ప్రదర్శనే చేస్తా : డేనైట్ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత పేసర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఇషాంత్ శర్మ బౌలింగ్‌కు పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్ కకావికలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 106 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. 2007లో పాకిస్థాన్‌పై అరంగేట్ర టెస్టులోనే ఇషాంత్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా ఇన్నాళ్లకు మళ్లీ ఆ ఘనత సాధించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇషాంత్.. ఎక్కడ ఆడినా ఉత్తమ ప్రదర్శన చేయాలనేదే తన లక్ష్యమని చెప్పాడు. నేను జీవితంలో ఒక దశకు చేరుకున్నా. ఏ ఫార్మాట్‌లో ఆడుతున్నాననే విషయం గురించి ఆందోళన చెందడం మానేశా. నాకిప్పుడు 31 ఏళ్లు. ఎక్కడ ఆడుతున్నాననే విషయాన్ని పట్టించుకుంటే ఉత్తమ ప్రదర్శన చేయలేను. నాకు ఆడాలని మాత్రమే ఉంది, అది రంజీ ట్రోఫీ అయినా, భారత జట్టుకైనా. ఆటను ఆస్వాదిస్తే మన ప్రదర్శన బాగుంటుంది. చిన్న విషయాలను పట్టించుకుంటే ఎప్పటికీ మెరుగవ్వలేమని పేర్కొన్నాడు. మా జట్టులో బలమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉందని ఇషాంత్ అన్నారు. అది మా ప్రదర్శనలను మెరుగుపరుస్తుంది. జట్టులో మన స్థానం సుస్థిరమైనప్పుడు, సహచరుల నుంచి సవాళ్లు ఎదురుకానప్పుడు.. మంచి ప్రదర్శన చేయలేము. అలాంటప్పుడు రిజర్వ్ బెంచ్‌లోనూ ఉండటం కష్టం. నేనిప్పుడు నా ఆటను ఆస్వాదిస్తున్నా. ఇదివరకు నా ప్రదర్శనల పట్ల చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. అప్పుడు అనేక విషయాలు నా మెదడును తొలిచేవి. ఇప్పుడు అంతలా ఆలోచించట్లేదు. వికెట్లు ఎలా తీయాలనేదానిపైనే ఇప్పుడు నా ధ్యాసంతా నెలకొందని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.
గెలుపు లాంఛనమే!
RELATED ARTICLES