HomeNewsBreaking Newsగెలిచి నిలిచారు...

గెలిచి నిలిచారు…

ఆక్లాండ్‌: రెండో టి20లో టీమిండియా 7 వికెట్లతో ఘన విజయం సాధించి లెక్క సరిచేసింది. న్యూజిలాండ్‌ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1 సమం చేసింది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్‌ ఆదివారం హామిల్టన్‌ వేదికగా జరగనుంది. శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్‌ సేన అదరగొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో సమిష్టిగా రాణించి గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బౌలర్లు విజృంభించడంతో ఆతిథ్య న్యూజిలాండ్‌ను 20 ఓవర్లో 158/8 పరుగులకు కట్టడి చేసింది. స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా (3/28) వికెట్లతో మెరిసాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (50; 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (40నాటౌట్‌; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ధావన్‌ (30) రాణించడంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ 162/3 పరుగులు చేసి విజయ దుందుభి మోగించింది. కృనాల్‌ పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌ పోరులో సజీవంగా నిలిచింది. కీలక సమయంలో ఆటగాళ్లు పుంజుకోవడం టీమిండియాకు కలిసొచ్చింది. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. గత కొన్ని మ్యాచుల్లో విఫలమవుతున్న రోహిత్‌ ఈ మ్యాచ్‌ ద్వారా తిరిగి పుంజుకున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ లక్ష్యఛేదనలో మరోసారి తన సత్తా చాటుకున్నా డు. మరోవైపు అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా మరికొన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన బౌలింగ్‌ దళం ఈ మ్యాచ్‌లో తమ ఉనికిని చాటుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో భారీ పరుగులు సమర్పించుకున్న వీరూ ఈసారి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. ముఖ్యంగా పేసర్లు భువనేశ్వర్‌ కుమా ర్‌, ఖలీల్‌ అహ్మద్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. స్పిన్నర్లలో కృనాల్‌ పాండ్యా ఆరంభంలోనే వరుస ఓవర్లలో కీలమైన 3 వికెట్లు పడగొట్టి భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఇక న్యూజిలాండ్‌ జట్టులో కొలిన్‌ గ్రాండ్‌ హోమ్‌ (50; 28 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు), సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ (42) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్స్‌ విఫలమయ్యారు. బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. భారత బ్యాట్స్‌మెన్స్‌ల దాడికి తేలిపోయారు. ఏ దశలోనూ అటాకింగ్‌ చేయలేకపోయారు. గత మ్యాచ్‌లో విజృంభించి బౌలింగ్‌ చేసిన టిమ్‌ సౌథీ ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌ కూడా తీయలేక పోయాడు. 4 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నాడు. రోహిత్‌ సేన కలిసికట్టుగా రాణించి మంచి కంబ్యాక్‌ చేసింది. ఇక చివరి టి20లోనూ ఇదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో కనిపిస్తోంది.
విధ్వంసం..
159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ శుభారంభాన్ని అందించారు. ధావన్‌ కుదురుగా ఆడుతుంటే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం చెలరేగి ఆడాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శిస్తూ కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు ధావన్‌ ఆచితూచి ఆడుతూ ఇతనికి అండగా నిలిచాడు. అవకాశం దొరికినప్పుడు బౌండరీలు కొట్టాడు. ఈక్రమంలోనే వీరు తొలి వికెట్‌కు 36 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకొని గట్టి పునాదికి బాటలు వేశారు. తర్వాత మరింతగా రెచ్చిపోయిన రోహిత్‌ బౌండరీల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలల్లో బంతిని తరలిస్తూ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో కెరీర్‌ 20వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ (50)ను ఇష్‌ సోధీ ఔట్‌ చేసి భారత్‌కు షాకిచ్చాడు. దీంతో భారత్‌ 9.2 ఓవర్లలో రోహిత్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. 79 పరుగుల తొలి వికెట్‌ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్ది సేపటికే కుదురుగా ఆడుతున్న మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (30; 31 బంతుల్లో 2 ఫోర్లు) ఫెర్గ్యూసన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో టీమిండియా 88 పరుగుల వద్ద రెండో వికెట్‌ చేజార్చుకుంది.
పంత్‌ దూకుడు..
తర్వాత వచ్చిన యువ సంచలనం రిషభ్‌ పంత్‌, ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరూ కూడా దూకుడుగా ఆడుతూ రన్‌రెట్‌ తగ్గకుండా చూశారు. మరోవైపు భారత్‌ 12.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. కాగా, శంకర్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. వేగంగా ఆడే క్రమంలో శంకర్‌ 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికే భారత్‌ 13.4 ఓవర్లలో 118 పరుగులు చేసి విజయానికి చేరువైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి రిషభ్‌ పంత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. శంకర్‌ ఆవుటైన తర్వాత దూకుడు పెంచిన పంత్‌ కివీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చెత్త బంతులను పెవిలియన్‌కు పంపుతూ వేగంగా పరుగులు పిండుకున్నాడు. మరోవైపు ధోనీ సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ ఇతనికి అండగా నిలిచాడు. వీరిద్దరి జంటను విడదీయడానికి కివీస్‌ బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఇద్దరూ తమ వికెట్‌లను కాపాడుకుంటూనే పరుగులు సాధించారు. మెల్లగా టీమిండియాను లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఈక్రమంలోనే భారత్‌ 17.1 ఓవర్లలో 150 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఇక చివర్లో కివీస్‌ బౌలర్లు కొంతగా ఇబ్బంది పెట్టినా వీరిద్దరూ తెలివిగా ఆడుతూ మరో ఓవర్‌ మిగిలి ఉండగానే భారత్‌ విజయాన్ని పరిపూర్ణం చేశారు. వీరిద్దరూ చివరి వరకు అజేయంగా ఉండి భారత్‌ను విజయ తీరానికి చేర్చారు. దీంతో 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిన టీమిండియా 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. చెలరేగి ఆడిన రిషభ్‌ పంత్‌ 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు సీనియర్‌ ధోనీ 17 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 20 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఇష్‌ సోధీ, డారిల్‌ మిచెల్‌ తలొ వికెట్‌ తీశారు.

టాస్‌ గెలిచిన విలియమ్సన్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో కివీస్‌ ఓపెనర్లు బరిలో దిగారు. కానీ భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆదిలోనే కివీస్‌కు షాకిచ్చాడు. గత మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేసిన ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ (12) పరుగులకే పెవిలియన్‌ పంపి కివీస్‌కు పెద్ద దెబ్చేశాడు. దీంతో కివీస్‌ 15 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది.
మాజిక్‌..
అనంతరం క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌తో కలిసి మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కొద్ది సేపటివరకు తమ వికెట్లను కాపాడుకోవడంలో సఫలమయ్యారు. ఆచితూచిగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈక్రమంలోనే జట్టు స్కోరు 40 పరుగులు దాటింది. ఆ తర్వాత స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా తన మ్యాజిక్‌ చూపించాడు. ఆరో ఓవర్లో బంతి అందుకున్న కృనాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రెండో బంతికే ఓపెనర్‌ మున్రో (12) పరుగులను రోహిత్‌ శర్మచే క్యాచ్‌ పట్టించి పెవిలియన్‌ పంపాడు. అదే ఓవర్‌ చివరి బంతికి డారిల్‌ మిచెల్‌ (1)ని కూడా ఎల్బీగా ఔట్‌ చేసి కివీస్‌కు పెద్ద షాకిచ్చాడు. దీంతో కివీస్‌ రెండు పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత 8వ ఓవర్‌ వేసిన కృనాల్‌ ధాటిగా ఆడుతున్న కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ (20; 17 బంతుల్లో 3 ఫోర్లు)ను ఎల్బీడబ్ల్యూ చేసి న్యూజిలాండ్‌కు కొలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో కివీస్‌ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.
ఆదుకున్న టేలర్‌, గ్రాండ్‌హోమ్‌..
ఈ సమయంలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో కివీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు. ఒకవైపు గ్రాండ్‌హోమ్‌ విజృంభించి ఆడుతుంటే.. మరోవైపు రాస్‌ టేలర్‌ ఆడపాదడపా బౌండరీలు కొడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించాడు. ఈ క్రమంలోనే కివీస్‌ కీలకమైన 100 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. మరోవైపు వీరు ఐదో వికెట్‌కు 29 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన గ్రాండ్‌ హోమ్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. చాహల్‌ బౌలింగ్‌లో భారీ పరుగులు పిండుకున్నాడు. ఈక్రమంలోనే గ్రాండ్‌హోమ్‌ 27 బంతుల్లోనే 1 ఫోర్‌ 4 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే హార్ధిక్‌ పాండ్యా ఇతనిని ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. వీరు ఐదో వికెట్‌కు కీలకమైన 77 పరుగులు జోడించారు. చివర్లో దూకుడుగా ఆడుతున్న రాస్‌ టేలర్‌ (42; 36 బంతుల్లో 3 ఫోర్లు) రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాతి బ్యాట్స్‌మెన్స్‌లో ఎవరు కూడా రెండంకెల స్కోరును చేయకపోవడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భాతర బౌలర్లలో కృనాల్‌ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments