‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
దేశ్ బచావో, బిజెపి హటావో మా నినాదం
మోడీ ప్రభుత్వ ఓటమి ఖాయం
నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌ను చెయ్యాలంటే ఆటంకాలుండవు
పాట్నా : “ఇండియా” (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ ఎలయెన్స్) కూటమి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ప్రధానమంత్రి అభ్యర్థిపేరు ప్రకటించేందుకు భాగస్వామ్య పార్టీలన్నీ సుముఖంగా ఉన్నాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. సోమవారంనాడు నితీశ్ కుమార్‌ను డి.రాజా కలుసుకుని చర్చలు జరిపారు. ఆయన మంగళవారంనాడు పాత్రికేయులతో మాట్లాడారు. రానున్న పదీ పదిహేను రోజుల్లో “ఇండియా” కూటమిలో కన్వీనర్ పోస్టుతో సహా వివిధ బాధ్యతలలో నియామకాలు జరుగుతాయని ఇటీవల కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయం తెలిసిందే. పాత్రికేయుల ప్రశ్నలకు డి.రాజా స్పందిస్తూ,“ఇండియా” కూటమి అగ్రనేతలలో బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ కూడా ఒకరని, ఆ విషయంలో సందేహమే లేదని, ఆయన ఎంతో అనుభవజ్ఞుడని చెప్పారు. నితీశ్ కుమార్‌ను కూటమి కన్వీనర్ బాధ్యతల్లో అందరినీ ఉత్తమస్థాయిలో సమన్వయం చేసేవ్యక్తిగా భావించి నియమించాలని భావిస్తున్నారా? అని పాత్రికేయులు ప్రశ్నించగా, “ఇ ది మనకున్న గ్రహణశక్తిలో ఒకభాగమే, కానీ కూటమిలో బాధ్యతలు అప్పగించే విషయంలో అందరినీ సమైక్యంగా కలుపుకుని వెళ్ళడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు అని నేను మీకు చెబుతున్నా” అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో “ఇండియా” కూటమి గెలిచిన తర్వాతే కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి భాగస్వామ్యపార్టీలు సుముఖంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా గత సంప్రదాయాలను ఆయన గుర్తు చేశారు. 1990లో ఆనాటి ఐక్య సంఘటన ప్రభుత్వం లో కూడా ఇదే విధంగా జరిగిన అనుభవాలను గుర్తుచేశారు. నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రకటిస్తారా? అని ప్రశ్నించగా అలా చేయడానికి కూటమిలో ఐక్యత సాధించడానికి ఎ లాంటి ఆటంకాలు ఉండబోవని, నితీశ్ కుమా ర్ నిస్సందేహంగా “ఇండియా” కూటమి అగ్ర నాయకులలో ఒకరని అన్నారు. సుదీర్ఘకాలం
బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని అన్నారు. రోజు రోజుకూ ఆయన పార్టీ మరింత బలం పుంజుకుంటున్నదని అన్నారు.
సీట్ల సర్దుబాట్లకు సమయం మించిపోలేదు
“ఇండియా” కూటమిలో సీట్ల సర్దుబాట్ల విషయంపై ప్రశ్నించగా, మా పార్టీ (సిపిఐ) బీహార్‌సహా మిగిలిన రాష్ట్రాలలో కూడా ఒక శక్తిగా ఉందని, అయితే సంప్రదింపుల్లో కూర్చున్నపుప్పుడు కూటమి విజయం సాధించడానికి వీలుగా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలన్నింటికీ సమాన అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని డి.రాజా అన్నారు. తాను నితీశ్ కుమార్‌ను కలిసినప్పుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో టెలిఫోన్ సంభాషణ చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించి చెప్పారన్నారు. పదే పదే వాయిదాలవల్ల సమయం మించిపోతోంది కదా అని పాత్రికేయులు ప్రశ్నించగా, “ఈ విషయంలో ఆలస్యం అవుతోందని మేం అనుకోవడం లేదు, ఈ వేగాన్ని లెక్కించడానికి ఈ విషయంలో కొలమానం ఏదీ లేదు, అన్నీ వాటంతట అవే సజావుగా జరుగుతాయి, అయితే సరైన సమయంలో మేం అందరం కూర్చుని ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటాం” అని రాజా చెప్పారు. నిర్ణీత ప్రకారం వచ్చేవారం ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవం ఆ తర్వాత మీరు రాహుల్‌గాంధీతో కలిసి యాత్రలో పాల్గొంటున్నారా? అని డి.రాజాను పాత్రికేయులు ప్రశ్నించారు. “ఇంతకుముందు భారత్ జోడో యాత్ర జరిగినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు నేను రాహుల్‌గాంధీతో శ్రీనగర్‌లో జరిగిన యాత్రలో పాల్గొన్నాను, ఈసారి కూడా మాకు ఆహ్వానం ఇంకా అందవలసి ఉంది”అన్నారు. “ఇండియా” కూటమిని చూసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాభరా పడుతోందని, ఆ పార్టీలో వణుకు పుట్టిందని అన్నారు. చివరకు ప్రధానమంత్రి, హోంశాఖామంత్రి కూడా ఇండియా కూటమి నాయకులపైన, పార్టీల పైన భయంతో తీవ్ర దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ‘ఇండియా’ కూటమి భాగస్వాములను భయపెట్టేందుకు, వెనుకంజ వేయించేందుకు కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధంగా ఉపయోగిస్తున్నదని విమర్శించారు. “జాతి ప్రయోజనాలకోసం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయం, అప్పటివరకూ ‘ఇండియా’ కూటమి “దేశ్ బచావ్, బిజెపి హటావ్” అనే నినాదంతో ప్రజల్లో ప్రచారం సాగిస్తుంది, కూటమిలో ఉన్న భాగస్వామ్యపార్టీలన్నీ కాషాయ కూటమికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసి ఓడించాలని గట్టి కృతనిశ్చయంతో ఉన్నాయి, ఆ మేరకు మేం అందరం తీర్మానించుకున్నాం, బిజెపి ప్రభుత్వం ప్రజా తీర్పుతో కుప్పకూలిపోతుందని “ఇండియా” కూటమి సంపూర్ణ విశ్వాసంతో ఉంది, దేశంలో విద్వేష రాజకీయాలను వ్యాప్తి చేస్తూ, రాజ్యాంగంపై దాడిచేస్తున్న శక్తులను తప్పనిసరిగా ఓడించి తీరాల్సిందే” అని డి.రాజా ఉద్ఘాటించారు.
20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?
బిల్కిస్‌బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేసే హక్కును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాత్రికేయులు ప్రశ్నించగా, కోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వ మోసాన్ని బహిర్గతం చేసిందని, గుజరాత్ ప్రభుత్వ వంచనకు ఈ తీర్పు తార్కాణమని, కేంద్రంలోని నరేంద్రబమోడీ ప్రభుత్వం అసత్యాలతో ప్రజలను మోసం చేసిందని వెల్లడైందని డి.రాజా అన్నారు. దేశంలో ప్రతి ఏడాదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయడం ద్వారా నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, పదేళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున మొత్తం 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఇప్పటివరకూ సృష్టించిన ఉద్యోగాలు ఎన్ని? అని ఆయన ప్రశ్నించారు.గౌతమ్ అదానీ లాంటి అతి సంపన్నులు మాత్రమే మోడీ పరిపాలనలో ప్రయోజనం పొందారని విమర్శించారు. మోడీ ఇప్పుడు మోసపూరితమైన హామీలు కురిపిస్తున్నారు, 1947 వరకూ జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి పాత్రా లేదు, కానీ స్వాతంత్య్రం సంపాదించాక 2047 గురించి ఆలోచించమని మా అందరికీ బిజెపి చెబుతోంది, ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధలన్నీ మరచిపోవాలని మోడీ వంచిస్తున్నారని డి.రాజా విమర్శించారు.
గెలిచాకే ప్రకటన
RELATED ARTICLES