ముంబయి : పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కీర్తి కిరీటంలో ఈ ఏడాది ఇప్పటికే అనేక రికార్డులు సొంతం కాగా.. తాజాగా అతడి ఖాతాలో మరో ఘనత చేరింది. 2019 గూగుల్ గణంకాల ప్రకారం కోహ్లీ ’టాప్ ట్రెండింగ్ క్రీడా ప్రముఖుల్లో’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, కోహ్లీ ఇటీవల సాధించిన రికార్డులు పరిశీలిస్తే.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై టీమిండియా టెస్టుల్లో విజయం సాధించడంతో స్వదేశంలో వరుసగా 12 సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. గతనెల బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో కోహ్లీ శతకం బాదడంతో కెప్టెన్‌గా అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు(41) చేసిన ఆసీస్ దిగ్గజం రికీపాంటింగ్ సరసన నిలిచాడు. చారిత్రక డేనైట్ టెస్టులో శతకం చేయడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్‌స్మిత్‌ను వెనక్కి నెట్టి తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు భారత్‌లో గూగుల్ టాప్ ట్రెండింగ్ ప్రముఖుల్లో కోహ్లీ.. మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, ఉప సారథి రోహిత్ శర్మలను వెనక్కి నెట్టాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన ధోనీ రెండో స్థానంలో నిలవగా, ప్రపంచకప్ చరిత్రలో మరే బ్యాట్స్‌మన్‌కు సాధ్యం కాని విధంగా(ఇప్పటివరకు) ఐదు సెంచరీలు బాదిన హిట్‌మ్యాన్ మూడో స్థానంలో నిలిచాడు. వెన్నునొప్పి కారణంగా ఇటీవల శస్త్ర చికిత్స చేసుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నాలుగో స్థానంలో నిలవగా.. ప్రపంచకప్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్ ఐదో స్థానంలో నిలిచాడు. కాగా.. ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకొని వరుసగా విఫలమౌతున్న యువ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఆరో స్థానంలో.. ప్రపంచకప్ సెమీఫైనల్లో అదరగొట్టిన రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో క్రికెటర్లను మినహాయిస్తే పీవీ సింధు ఒక్కరే ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ సారథి సౌరభ్ గంగూలీ తొమ్మిది.. భాజపా ఎంపీగా ఎన్నికైన మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పదో స్థానంలో నిలిచారు.
గూగుల్‌లోనూ కోహ్లీనే టాప్
RELATED ARTICLES