సూర్యాపేటలో ఎవరి దుకాణం వారిదే
ఒక్క రోజులోనే ఒకే అంశంపై విడివిడిగా సమావేశాలు
ఎటు వెళ్ళాలో తెలియక క్యాడర్ అయోమయం
ప్రజాపక్షం/సూర్యాపేట: క్రమశిక్షణకు మారుపేరు అని పదే పదే చెప్పుకునే అధికార పార్టీ నేడు గ్రూపులకు నిలయంగా మా రింది. వేర్వేరు పార్టీల నుండి ఒకే పార్టీలో చేరిన నాయకుల మధ్య మొదటి నుండే ఏ మాత్రం సఖ్యతలేదు. ఆయా పార్టీల నుండి వచ్చిన నాయకులు వీడిన పార్టీలలో ఎవరెవరు కలిసి ఉన్నారో వారం తా ఒక గ్రూపుగా ఏర్పడి ఎవరి దుకాణం వారే నడుపుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్న చందంగా వారు అందరూ కలిసినట్లుగా నటిస్తూ పార్టీలో ముందుకు సాగుతున్నా రు. పురపోరు ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో వివిధ పార్టీల నుండి వచ్చిన వారు టిక్కెట్ల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తూనే అదే పార్టీలో టిక్కెట్‌ను ఆశిస్తున్న వారికి ఎలాగైన టిక్కెట్ దక్కకుండా పావులు కదుపుతున్నారు. వీరంతా ఎవరికి వారు మంత్రి జగదీష్‌రెడ్డి దృష్టిని ఆకర్షించేందుకు సర్వప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణపై మంత్రిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఒకేరోజు ఒకే అంశంపై నాయకులు విడిపోయి విడి విడిగా పత్రికా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. పత్రిక సమావేశానికి ముందు నాయకులు పలాన చోట తాము సమావేశం ఏర్పాటు చేశామని మీరు రావాలంటూ ఫోన్ చేయ డం… ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మరో నేత తాము సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వెంటనే రావాలంటూ కాల్ చేయడం ఇలా ఒక్కసారిగా నాలుగు సార్లు వేర్వేరు నాయకులు ఫోన్లు చేసి రమ్మన్నడంతో ఎటుపోతే ఏ నాయకుడు ఏమంటాడో తెలియక వారు అయోమయానికి గురయ్యారు. దీంతో గులాబీ పార్టీలో గ్రూపులు ఉన్నాయన్నది బహిర్గతమైంది. నియోజకవర్గం నుండి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ నాయకుల మధ్య మొదటి నుండి సఖ్యత లేకున్నా ఆయన సిఎం కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో విభేదాలు లేన్నట్లుగా నటిస్తూ కాలం గడుపుకుంటూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టిఆర్‌ఎస్‌లోకి ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వలస వచ్చారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్, టిడిపి నాయకులు అధికంగా ఉన్నారు. వీరిలో కొందరు ఒక్కప్పుడు ఉమ్మడి జిల్లాను కూడా శాసించిన వారు లేకపోలేదు. ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు అనేక మంది ఉన్నారు. రాజకీయంలో కూడా తలపండిన వారు. విధిలేని పరిస్థితుల్లో మారుతున్న రాజకీయ పరిణామాలతో చేసేది ఏమీలేక వారి రాజకీయ భవిష్యత్తుతోపాటు వారి వారసుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విలువలను పక్కకు పెట్టి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా విధిలేని పరిస్థితుల్లో కారు ఎక్కిన నాయకులు గత పార్టీల్లో తాము చక్రం తిప్పినట్లుగానే కారు స్టీరింగ్ తిప్పాలని తహతహలాడుతున్నారు. తాము గతంలో పనిచేసిన పార్టీలోని వారు టిఆర్‌ఎస్‌లో ఎంత మంది చేరారో లెక్కవేసుకొని వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వేరు కుంపటి పెడుతున్నారు. నిత్యం వీరు ఏదో ఒక చోట కలవడం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చర్చపోచర్చలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ను వదిలి వచ్చిన వారు ఓ గ్రూపు, టిటిడిపి నుంచి వచ్చిన వారు మరో గ్రూపు, బిజెపి నుంచి వచ్చిన వారు ఇంకో గ్రూపుగా ఏర్పడగా అన్ని కష్టాలకు, నష్టాలకు ఓర్చి పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న నాయకులు ఒక గ్రూపుగా పార్టీలో ముందుకు సాగుతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజక వర్గంలో పర్యటించిన సమయంలో కూడా వారు గ్రూపుల వారీగానే కలిసి తిరుగుతున్నారు. మంత్రిని ఆకర్షించేందుకు ఈ గ్రూప్ లీడర్లు పడరాని పాట్లు పడడం, వీలైతే ఒకరిపై ఒకరు మంత్రికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అన్ని విన్న ఆయన మాత్రం ఎవ్వరిని తప్పుపట్టకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.