HomeNewsBreaking Newsగుణపాఠాలు నేర్చుకున్నాం

గుణపాఠాలు నేర్చుకున్నాం

యుద్ధాలవల్ల దారిద్య్రం, నిరుద్యోగమే మిగిలింది
విద్య, వైద్యం, ఉదోగ్యాలతో అభివృద్ధి చెందాలనుకుంటున్నాం
భారత్‌తో చర్చలకు చిత్తశుద్ధితో కృషి : పాక్‌ ప్రధాని షరీఫ్‌
ఇస్లామాబాద్‌ :
భారతదేశంతో ఉన్న అనేక సమకాలీన సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు జరిపేందుకు తమ దేశం చిత్తశుద్ధితో గట్టి కృషి చేస్తుందని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. దుబయ్‌ కేంద్రంగా పనిచేసే ‘అల్‌ అరేబియా’ న్యూస్‌ ఛానల్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్‌ ఈ విషయం చెప్పారు. “యుద్ధాలవల్ల సమయం, వనరులు వృథా అయ్యాయి, మా దేశం అభివృద్ధి చెందాలనుకుంటోంది, బాంబులు, ఆయుధ సామాగ్రితో మా వనరులు వృథా చెయ్యాలనుకోవడం లేదు, శాంతా? సమరమా?” నిర్ణయం మనదే అన్నారు షరీఫ్‌. “మన రెండుదేశాలు అణ్వస్త్రదేశాలు, ఒకవేళ దేవుడి కరుణలేకపోతే రెండు దేశాలమధ్య యుద్ధం ప్రజ్వరిల్లితే ఎవరు మనుగడ సాగిస్తారో ఎవరు చెప్పగలరు?” అని షరీఫ్‌ హెచ్చరించారు. కీలక సమస్యల పరిష్కారానికి ఈ రెండు అణ్వస్త్రదేశాలమధ్య చర్చల పునరుద్ధరణలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) ముఖ్యపాత్ర వహిస్తుందని ఆయన అన్నారు. కశ్మీరు సమస్య అతి పెద్ద సమస్య అని, ఈ సమస్య పరిష్కారానికి భారత్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో
చర్చలు జరపడానికి చిత్తశుద్ధితో గట్టి కృషి చేస్తామని అన్నారు. భారత్‌ పాకిస్థాన్‌ దేశాలమధ్య కశ్మీరు సమస్య వల్ల, సరిహద్దుల్లో ఉగ్రవాదం కారణంగా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. గతంలో తమ రెండు దేశాలూ కశ్మీరు సమస్యపై మూడో దేశం జోక్యాన్ని , మధ్యవర్తిత్వాన్నీ తిరస్కరించాయని అన్నారు. “భారత నాయకత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మేం పంపించే సందేశం ఒక్కటే, మనం ముందుగా చర్చలకు కూర్చుందాం, తీవ్రంగా, చాలా చిత్తశుద్ధితో చర్చల ద్వారా రెండు దేశాలమధ్య అపరిష్కృతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌ వంటి సమస్యలు పరిష్కరించుకుందాం” అని షరీఫ్‌ అన్నారు. “శాంతియుతంగా జీవించాలా? పురోగతి సాధించాలా? లేక పరస్పరం కలహించుకుంటూ చాలా సమయం, చాలా వనరులు వృథా చేసుకుందామా అనే విషయం మనపైనే ఆధారపడి ఉంది, ఇప్పటికే మన రెండు దేశాలమధ్య మూడు యుద్ధాలు జరిగాయి, దానివల్ల చాలా దుఃఖం మిగిలింది, దారిద్య్రం మిగిలింది, ప్రజలకు నిరుద్యోగం మిగిలింది” అని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి అన్నారు. “మా గుణపాఠాలు మేం నేర్చుకున్నాం, మేం శాంతియుతంగా బతకాలనుకుంటున్నాం, అయినప్పటికీ కూడా న్యాయబద్ధమైన, నిజంపై ఆధారపడిన సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం, మేం మా దేశంలో దారిద్య్రాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాం, పురోగతిని, సంపదను సాధించాలనుకుంటున్నాం, మా దేశంలో ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు అందించాలని కోరుకుంటున్నాం, వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం, బాంబులు, ఆయుధ సామాగ్రి ద్వారా మా వనరులను వృథా చెయ్యాలని మేం కోరుకోవడం లేదు, ఈ సందేశమే భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నేను తెలియజేయాలని కోరుకుంటున్న సందేశం” అని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. ఉగ్రవాదం, చర్చలు రెండు ఒకదానితో ఒకటి కలిసి ప్రయాణం చెయ్యలేవని, ఈ రెండూ చేయి చేయి కలిపి ముందుకు సాగబోవని, పాకిస్థాన్‌ తప్పనిసరిగా చర్చల పునరుద్ధరణకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలని భారత్‌ దీర్ఘకాలంగా చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. భారత్‌ 2019 ఆగస్టు 5న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన తరువాత రెందు దేశాలమధ్య సమస్య మరింత జటిలంగా మారింది. ఆ రాష్టాన్ని జమ్మూ, కశ్మీర్‌ అనే రెండు వేరు వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. దీంతో పాకిస్థాన్‌ ఈ నిర్ణయాన్ని చాలా తీవ్రంగా ప్రతిఘటించింది. అప్పటినుండి రెండు దేశాలమధ్య దౌత్య సంబంధాలు బాగా క్షీణించిపోయాయి. ముఖ్యంగా రెండుదేశాలమధ్య వాణిజ్ంయం నిలిచిపోయింది. “మన రెండుదేశాలు అణ్వస్త్రదేశాలు, ఒకవేళ దేవుడి కరుణలేకపోతే రెండు దేశాలమధ్య యుద్ధం ప్రజ్వరిల్లితే ఎవరు మనుగడ సాగిస్తారో ఎవరు చెప్పగలరు?” అని షరీఫ్‌ హెచ్చరించారు. లక్షలాదిమంది పాకిస్థానీయులకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రెండో నివాసంగా మారిపోయిన విషయం లిసిందే. “సౌదీ అరేబియా మా మైత్రీ దేశం, మా సోదరదేశం” అని కూడా షరీఫ్‌ చెప్పారు. పాకిస్థాన్‌ ఆవిర్భవించకముందునుండీ లక్షలాదిమంది భారతీయ ముస్లింలకు సౌదీ అరేబియా దేశే సోదరదేశంగా సంబంధాలు కొనసాగించిందని కూడా ఆయన అన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశం రెండు దేశాలమధ్య చర్చలకు మధ్యవర్తిగా ప్రముఖ పాత్ర వహిస్తుందని స్పష్టం చేశారు. అయితే భారతదేశం మాత్రం కశ్మీరు సమస్యను ద్వైపాక్షిక సమస్యగానే చూస్తున్నది. ఏ ఇతర దేశానికీఈ విషయంపై మాట్లాడే అర్హత లేదు, ఈ రెండు ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని ఇటీవలనే విదేశాగమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments