అడ్డుకున్న పోలీసులు, తోపులాట: పలువురికి గాయాలు
ఉద్రిక్తంగా అశ్వారావుపేట నియోజకవర్గం
ప్రజాపక్షం/ ఖమ్మం అది ఓ గిరిజన గ్రామం. అనేక దశాబ్దాల తరబడి గిరిజనులు భూమిని నమ్ముకుని అక్కడ జీవిస్తున్నారు. నిజాం ప్రభుత్వం సైతం ఈ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. కానీ ఈ మధ్య కాలంలో అది రెవెన్యూ కాదు, అటవీ భూమి అంటూ ఆ భూముల్లో అటవీ అధికారులు ప్లాంటేషన్ చేయడమే ఇప్పుడు ఉద్రిక్తతకు కారణమైంది. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు తమ గోడును తెలియజేసుకునేందుకు చలో ప్రగతిభవన్ పేరిట సోమవారం పాదయాత్ర చేపట్టారు. రెండు కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగగానే పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు గిరిజనుల పాదయాత్రను అడ్డుకుని చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని సాగనివ్వకుండా చేశారు. గిరిజనులను ఈడ్చుకొచ్చి వాహనాల్లో వేస్తున్న క్రమంలో గిరిజనులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు గిరిజనులు గాయపడగా అశ్వారావుపేట ఎస్‌ఐ చల్లా అరుణ కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. గిరిజనులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండగా కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకోవడంతో నియోజక వర్గంలో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే… అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామం పూర్తిగా గిరిజన గ్రామం. ఇక్కడ మొత్తం గిరిజనులే నివసిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితం వరకు రెవెన్యూ భూములుగా ఉన్న వీటిని ఆ తర్వాత అటవీ భూములుగా చూపుతూ ఇక్కడ అటవీ నర్సరీలను ఏర్పాటు చేసి టేకు వెదురు, జామాయిల్ మొక్కలను పెంచుతున్నారు. అయితే 2018లో ఇక్కడి గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలను కూడా జారీ చేసింది. అయినప్పటికీ అటవీ శాఖాధికారులు ఈ భూమి వైపుకు గిరిజనులను రానివ్వకపోవడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కలెక్టర్ సహా ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ ఈ విషయాన్ని తెలియజేసినా ఎవరు సరైన రీతిలో స్పందించ లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ అటవీ భూమిగా ఎలా గుర్తిస్తారని గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజులుగా దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తామని గిరిజనులు హైదరాబాద్ ప్రగతి భవన్‌కు పాదయాత్రగా బయలు దేరారు. పోలీసులు అడ్డుకుని ఒక రకంగా గిరిజనులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొందరు గిరిజనులు గాయపడ్డారు. చివరకు కొత్తగూడెం జాయింట్ కలెక్టర్ 20 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సర్దుమణిగింది. పోలీస్ స్టేషన్లకు గిరిజనులను తరలిస్తున్న వాహనాన్ని ములకలపల్లిలో మాజీ శాసన సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో అడ్డుకున్నారు. ఈ సమస్యకు సత్వరం పరిష్కారం చూపాలని గిరిజనుల భూములను అటవీ శాఖ మాటును అక్రమించడం సరైంది కాదని ప్రభుత్వ వైఖరి మారకపోతే ఆందోళన తప్పదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయ
గిరిజనుల ‘చలో ప్రగతిభవన్’ పాదయాత్ర రణరంగం
RELATED ARTICLES