సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్న గిరిజనుల హక్కులను పరిరక్షించుకోవడానికి గిరిజనులంతా ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఉపాధి, ఉద్యోగ, విద్య రంగాల్లో ఆదివాసీ గిరిజనులకు 10 శాతం రేజర్వేషన్‌లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్ళు కావస్తున్నా పేదలకు కుడు, గూడులతో పాటు ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడంలో పాలక వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ‘గొడ్డేటి దేముడు’ హాల్ (సత్యనారాయణరెడ్డి భవన్ )లో గురువారం ఏర్పాటు చేసిన తెలంగాణ గిరిజన సమాఖ్య 2వ రాష్ట్ర మహాసభలను చాడ వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. మహాసభలకు తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర నేతలు జువారి రమేష్, భూక్య శ్రీనివాస్, స్వరూప, కుటుంబరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. అంతకు ముందు మహాసభలను పురస్కరించుకొని వందలాదిమంది గిరిజనులతో భారీ ప్రదర్శనను హిమాయత్‌నగర్ మగ్ధూం భవన్ నుండి సత్యనారాయణరెడ్డి భవన్ వరకు నిర్వహించారు. అనంతరం గిరిజన సమాఖ్య సీనియర్ నాయకులు ఆర్.శంకర్ నాయక్ సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభల్లోగిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాల మల్లేష్, కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహరెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసురత్నం, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షులు యు.సృజన, తెలంగాణ బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ చారి, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు విజయ భాయి, రాంచందర్ నాయక్ పాల్గొన్నారు.
పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులను, జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను సహించేదిలేదని హెచ్చరించారు. రాష్ట్రంలో దశాబ్దాల కాలం నుంచి సాగు చేస్తున్న ఆదివాసీ పోడు రైతుల భూములలో అటవీ, రెవిన్యూ అధికారులు పంటలను ధ్వంసం చేస్తూ వారి భూములను బలవంతంగా లాక్కోవడం హేయమైన చర్య అని చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలను అడివి నుండి తరిమేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. బ్రిటిష్ వలస పాలకులు భారతదేశాన్ని ఆక్రమించుకున్నాక గిరిజనుల హక్కులు, సంప్రదాయాలు, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధానాలను దౌర్జన్యంగా అమలు చేశారన్నారు. ఆనాడు బ్రిటిష్ పాలకుల దాష్టీకాన్ని సిపిఐ నిరసించి ఆదివాసీ, గిరిజనులకు అండగా ఉంటూ, వారి హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్రం అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధిని ఫుర్తిగా విస్మరించడంతో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటుతనం వారిలో చాలా పెరిగిపోయిందని చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ హయంలో గిరిజనులపై పెరిగిన దాడులు
నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఎస్‌సిలు, ఎస్‌టిలు ఇతర బలహీన వర్గాలపై దాడులు చాలా పెరిగిపోయాయని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మనువాద సిద్ధాంతం ద్వారా అణగారిన వర్గాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోనళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగాలు పేద దళిత, గిరిజనులకు చేరువ కాకుండా చేస్తుందని ఆయన మండిపడ్డారు.
‘గిరిజనబంధు’ అమలు చేయాలి
గిరిజన, ఆదివాసీల్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం వెంటనే ‘గిరిజనబంధు’ పథకాన్ని అమలు చేయాలని, సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్‌లు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల కోసం పోరాడుతూ వారికి అండగా నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెపుతామని చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.