HomeNewsTelanganaగిరిజనాభివృద్ధికి పెద్దపీట

గిరిజనాభివృద్ధికి పెద్దపీట

విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలు బలోపేతం
ఐటిడిఎల పునర్వైభవానికి కృషి
మహిళలకు వడ్డీ లేని రుణాలు
పాలకమండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
ప్రజాపక్షం/భద్రాచలం
కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి పేద్దపీట వేసే దిశగా అడుగులేస్తోందని, గిరిజన కుటుంబాలకు మేలు జరిగేందుకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కల్పనతో పాటు గురుకులాల్లో విద్యావ్యవస్థను బలోపేతం చేయనుందుని, అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం భద్రాచలం ఐటిడిఎ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఐటిడిఎ పాలక వర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధి బాటలు వేసేందుకు ఐటిడిఎ అధికారులు కచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఐటిడిఎల పరిధిలోని గిరిజనుల స్థితిగతులు మెరుగుపడాలంటే విద్యాభివృద్ధి ఎంతో అవసరమని చెప్పారు. ప్రభుత్వ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అవసరమైన సహాయ, సహకారాలు ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. జూనియర్‌ కళాశాల చదువుల నుండే వారికి భవిష్యత్‌ ప్రణాళికలు నేర్పించాలని, ఉన్నత చదువులకు వెళ్లేందుకు ఏ విధంగా ముందుకు పోవాలో సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గిరిజన విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోడుభూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 2009, ఆగస్టు 9నఅప్పటి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భద్రాచలం కేంద్రంగా మూడున్నర లక్షల ఎకరాల పోడుభూములకు పట్టాలు పంపిణీ చేశారని చెప్పారు. ఆ రోజే హాస్టళ్లు, పాఠశాలలను స్వయంగా పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకుని మౌలిక వసతులు కల్పించడం జరిగిందని చెప్పారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఏఎన్‌ఎంలు, అంబులెన్సుల సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం రిమోట్‌ ఏరియాల్లోని పిహెచ్‌సిల్లో నడిపేందుకు సిబ్బంది లేనందున లోకల్‌గా ఉన్న నిరుద్యోగ గిరిజన యువతకు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించి గిరిజనులకు వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. 100 పడగల ఆస్పత్రులు మొదలుకుని పిహెచ్‌సిల్లో అంబులెన్సులు అందుబాటులో ఉండాలని, 24 గంటలు పనిచేసే విధంగా సంబంధిత వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఐటిడిఏలు అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పండ్ల తోటలు పెంపకం చేసేలా ప్రతీ మండలంలో ఫ్రూట్‌ ప్లాంటేషన్‌ విరివిగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధ చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన రైతులు ఆయిల్‌ పామ్‌ తోటలు పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా ఐటిడిఏ పిఓలు, కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. భూ సమస్యలు పరిష్కరించి, భూ పంపిణీ చేసి వ్యవసాయాభివృద్ధికి పాటుపడతామని, ఇందిర జల ప్రభ కార్యక్రమంలో మరలా గిరిజన రైతులకు సబ్సిడీపై కరెంటు మోటార్లు అందించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. చాలా మంది గిరిజన రైతులకు పాస్‌పుస్తకాలు సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు ఇప్పటికే ధరణి కమిటీ వేసినట్లు చెప్పారు. ఆ కమిటీ రిపోర్టులు అందగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట అభివృద్ధి పనులు చేపడతామని, అందుకు సంబంధించిన అవసరమైన మరిన్న నిధులు కూడా విడుదల చేస్తామని భట్టి చెప్పారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు అటవీ అధికారులు ఆటంకం కలిగించవద్దని, అంగన్‌ వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాల పెండింగ్‌ వేతనాలు త్వరలో విడుదల చేస్తామని, మహిళా సంఘాల గ్రూపులకు ఇందిర క్రాంతి పథం ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తామని, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు ప్రతీ నెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు. గిరిజనప్రాంతాల ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు సమవ్యయంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని భట్టి కోరారు. అనంతరం మైక్రో స్మాల్‌, మీడియా ఎంటర్‌ ప్రైజెస్‌ సభ్యులకు రూ.1కోటి29 లక్షల 4 వేలు విలువ చేసే చెక్కును అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్‌ సభ్యులు బానోత్‌ కవిత, ఎంఎల్‌సి తాతా మధుసూధన్‌ రావు, ఎంఎల్‌ఏలు డా.తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, రాందాస్‌ నాయక్‌, భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ డా.ప్రియాంక ఆలా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌, ఐటిడిఏ పిఓ ప్రతీక్‌ జైన్‌, ఓఎస్‌డి కృష్ణభాస్కర్‌, ఎస్‌పి రోహిత్‌ రాజ్‌, భద్రాచలం ఏఎస్‌పి పారితోష్‌ పంకజ్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments