ఆధారాలు చూపిస్తున్న శాస్త్రవేత్తలు
డబ్ల్యుహెచ్‌ఓకు 200 మంది సైంటిస్టుల లేఖ
న్యూయార్క్ : కోవిడ్-19 వ్యాప్తిపై శాస్త్రవేత్తలు సరికొత్త సమాచారంతో ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్ అసలు గాలిద్వారా సోకే అవకాశం లేదని ఇదివరకు కుండబద్దలు కొట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ, గాలి ద్వారా ఈ వైరస్ సోకే అవకాశం వుందని ఆధారాలతో సహా ఇంకొందరు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వాదనను గతంలోనే కొట్టేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ)కు వీరంతా లేఖ రాశారు. త్వరలోనే ఆధారాలను కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కీలక సమాచారం కరోనా పట్ల భయాన్ని మరింత పెంచింది. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కరోనా వైరస్ ప్రజలకు సంక్రమిస్తుందనేందుకు ఆధారాలున్నాయని 200 మందికిపైగా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిపై సిఫార్సులను ఈ మేరకు సవరించాలని వారు డబ్ల్యుహెచ్‌ఓకు పిలుపు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కరోనా వైరస్ ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడే వ్యక్తి దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడినప్పుడు వెలువడే తుంపరల నుంచి వేరొకరికి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యుహెచ్‌ఓ చెబుతూవస్తోంది. అయితే గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాలున్నాయని పేర్కొంటూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యుహెచ్‌ఓకు రాసిన లేఖలో వివరించారు. ఈ అంశాన్ని వచ్చే వారం ప్రముఖ సైంటిఫిక్ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించనున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తి దగ్గినప్పుడు వెలువడే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే అవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ప్రజలకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. వైరస్ రేణువుల సమూహమై గాలిలో ప్రయాణిస్తాయని తెలిపారు. కాగా వైరస్ గాలి ద్వారా సంక్రమిస్తుందనేందుకు చూపుతున్న ఆధారాలు ఆమోదయోగ్యంగా లేవని డబ్ల్యుహెచ్‌ఓ వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ గాలి ద్వారా సంక్రమించే అవకాశం లేకపోలేదని గత రెండు నెలలుగా తాము పలుమార్లు చెబుతూవచ్చామని అయితే దీనిపై స్పష్టమైన ఆధారాలు ఇంతవరకూ వెల్లడికాలేదని డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు డ్రాప్‌లెట్లగా మారి ఇతరుల్లోకి ప్రవేశిస్తాయని మొదట్లో డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. అయితే ఈ డ్రాప్‌లెట్లు 5 మైక్రాన్ల కన్నా చిన్న పరిమాణంలో ఉంటే తప్ప అవి గాలిద్వారా వ్యాప్తి చెందవని డబ్ల్యుహెచ్‌ఓ జూన్ 29న పునరుద్ఘాటించింది. కానీ తాజాగా శాస్త్రవేత్తలు చెపుతున్నది ఇందుకు భిన్నంగా వుంది. ఆ డ్రాప్‌లెట్లు గది అంత పరిమాణంలో వ్యాపించి, గాలి ద్వారా ఇతరులకు సోకడానికి చాలా సులువని వీరు చెపుతున్నారు. అతినీలలోహిత కిరణాలు సైతం ఈ వైరస్‌ను చంపుతాయన్న వాదనను కూడా వారు సవరిస్తున్నారు. ఇండోర్‌లలో అది సాధ్యం కాదన్నది వారి వాదన.
గాలి ద్వారా కరోనా!
RELATED ARTICLES