వ్యవస్థ రద్దుకు ఏడాది
వేతనాలు సరే… విధులేవి?
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసింది. తిరిగి వీరికి ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలను అప్పగించలేదు. తహసీల్దార్ కార్యాలయాల్లోకి రావడం, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాల విషయంలో జోక్యం తప్ప భూ వివరాల వైపు తొంగి చూసే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడున్నర వేల మంది విఆర్‌ఒలు ప్రభుత్వ నిర్ణయం కారణంగా గాలిలో తేలాడుతున్నారు. గతంలో విఆర్‌ఒ వ్యవస్థ పనితీరు ప్రామాణికంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీపై ఆధారపడి ఉండేది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదలు గ్రామాల్లో సామూహిక ఆస్తులను కాపాడడం, అక్రమ మైనింగ్, ఇసుక రవాణాను అరికట్టడంతో పాటు కుల, ఆదాయ, నివాస, జనన, మర ణ ధృవ పత్రాలను కూడా విఆర్‌ఒలే విచారించి సిఫారసు చేసేవారు. కొన్నింటిని ధృవీకరించే వారు. ఇక భూ చిట్టా మొత్తం విఆర్‌ఒల చేతుల్లోనే ఉండేది. భూమికి సంబంధించి క్రయ, విక్రయాలు, చెట్టు, పుట్టా పంచాయతీలన్నీ విఆర్‌ఒలే పరిష్కరించే వారు. ఇప్పుడు విఆర్‌ఒల వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం… ఆ హోదాను కల్పించడం కానీ, ఇతర శాఖలకు బదలాయించడం కానీ, స్పష్టమైన బాధ్యతలను అప్పగించడం కానీ చేయలేదు. దీంతో వేతనాలు అందుతున్నా ఉద్యోగ భద్రతపై రెవెన్యూ అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సీనియార్టీ, రెగ్యులరైజేషన్ ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి. ఇదిలా ఉండగా చాలా చోట్ల గతంలో మాదిరే విఆర్‌ఒల చేత అన్ని పనులు చేయిస్తున్నప్పటికీ దానికి చట్టబద్ధత లేదు. ఇలాంటి పనులు తాము చేయలేమని విఆర్‌ఒలు అంటే తహసీల్దార్లు సమ్మతించే పరిస్థితిలో లేరు. పనులు చేయడానికి సిద్ధం కానీ ఏ హోదాలో చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు తహసీల్దార్లు లేదా పై అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. విఆర్ వ్యవస్థ రద్దు తర్వాత గ్రామాల్లో కూడా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రైతాంగం ఇప్పుడు నేరుగా భూ సమస్యలపై తహసీల్దార్లను కలవడం తప్ప మరో మార్గం కన్పించడం లేదు. తహసీల్దార్లకున్న పని ఒత్తిళ్ల కారణంగా తీవ్ర కాలయాపన జరుగుతుంది. ఇప్పటికైనా రద్దు చేయబడిన విఆర్‌ఒ వ్యవస్థను పునరుద్ధరించడమా లేక రెవెన్యూ అధికారులకు సరైన బాధ్యతలు అప్పగించడమా అనే దానిపై ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గ్రామ రెవెన్యూ అధికారుల సర్వీసుకు ఎటువంటి భంగం కలుగకుండా నిర్ణయం తీసుకోవాలని విఆర్‌ఒలు కోరుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిన గ్రామ రెవెన్యూ అధికారులను వేరే శాఖల్లోకి బదిలీ చేయదలిస్తే విఆర్‌ఒల నుండి వారి వారి అభిప్రాయాలను సేకరించి బదిలీ చేయాలని ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను పూరించేందుకు ఇది తగు పరిష్కారం చూపుతుందని అంటున్నారు. అర్హత కలిగిన విఆర్‌ఒలకు పదోన్నతి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాధ్యతలు అప్పగించకుండా వేతనాలు అందించడం, విధులు లేకుండా నిధులను వెచ్చించడం మాని తగు బాధ్యతలు అప్పగించడం ద్వారా సరైన రీతిలో వేతనాలు అందించడం, పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గాలిలో విఆర్‌ఒలు
RELATED ARTICLES