మత్తు, జల్సాలు, శారీరక సుఖం కోసం అడ్డదారులు
తల్లిదండ్రుల ఆశలకు తూట్లు
లక్ష్యం దిశగా సాగని ఉన్నత విద్యావంతులు
ప్రజాపక్షం/ ఖమ్మం
దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న యువత పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు సామాజిక పరిస్థితులలో యువత నడవడికను చూస్తే భవిష్యత్తు పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన యువత ఒక రకంగా, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత మరో రకంగా గాడి తప్పుతున్నారు. డబ్బు విలువ ఏమిటో తెలియకుండా డబ్బులో
పుట్టి డబ్బులో పెరిగిన కొందరు జల్సాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. జీవితాల తరబడి కూర్చుని తిన్నా తరగని సంపద కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వారు కొంత మంది అనుచరులను వెంటేసుకుని పబ్బులు, క్లబ్బులలో జల్సాలు చేస్తూ ఇతరుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు గాడి తప్పిన యువత తీరుకు అద్దం పడుతున్నాయి. మద్యం, డ్రగ్స్ వాడకాలు ఆ మత్తులో ఏమీ చేస్తున్నామో తెలియని పరిస్థితులలో మైనర్లను కూడా చూడడం లేదు. అతి విలువైన వాహనాలు, ఎంత ఖర్చు పెట్టినా ప్రశ్నించే స్థితి లేని కుటుంబాల నుంచి వచ్చిన యువత ఒక రకంగా నిర్వీర్యం అవుతుంటే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ మద్యానికి బానిసలై తప్పుదారిన పయనిస్తున్నారు. ఆ మద్యం మత్తులోనే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తమ అవసరాల కోసం దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేందుకు కూడా వెనుకాడడం లేదు. ఎందుకో మత్తుకు యువత బానిస అవుతుంది. తల్లిదండ్రుల ఆశకు తూట్లు పొడుస్తుంది. తమ గ్రామానికి చెందిన వారు లేదా తమ ప్రాంతానికి చెందిన వారు అని ఇతరులు కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదు. కొందరు గంజాయి రవాణాలో, మరి కొందరు గుట్కాల తరలింపులో కూడా ప్రధాన భూమిక పోషించడం గమనార్హం. పాలక వర్గాల వైఖరి కూడా యువత గాడి తప్పేందుకు కారణమవుతుంది. ఉపాధి, ఉద్యోగ కల్పన రంగాలపై దృష్టి సారించక పోవడంతో ఉన్నత చదువులు చదివిన ఏమీ సాధించలేమన్న వేదన కూడా యువతను మత్తుకు బానిస అయ్యేలా చేస్తుంది. తల్లిదండ్రులు, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోతే గాడి తప్పిన యువత తల్లిదండ్రులకు పెనుభారంగా సమాజానికి శాపంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా యువత పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోతే దేశ భవిష్యత్తు ఇబ్బందికర పరిస్థితి గురవుతుంది.
గాడి తప్పుతున్న యువత
RELATED ARTICLES