నేటి నుంచి మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి
ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకొచ్చిన 15 మంది
ప్రజాపక్షం/ హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ప్లాస్మా థెరపీ చికిత్స అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సోమవారం ప్లాస్మా థెరపీని మొదలు పెట్టనున్నారు. కరోనా వైరస్ తగ్గినవారిలో 15 మంది ప్లాస్మాథెరపీ చికిత్సకు ముందుకొచ్చారు. దీంతో వారి నుండి 400 ఎం.ఎల్. రక్తాన్ని గాంధీ ఆస్పత్రి వైద్యులు సేకరించనున్నారు. కరో నా పాజిటివ్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది వ్యాధి నుండి కోలుకున్న సుమారు 200 మంది ప్లాస్మా చికిత్సకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రిసర్చ్(ఐసిఎంఆర్) మార్గదర్శకాల ప్రకారం ప్లాస్మా థెరపీ చికిత్సను నిర్వహించనున్నారు. ఈ చికిత్సలో భాగంగా రక్తం నుండి ప్లాస్మాను వేరు చేస్తారు. ఈ చికిత్సకు దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశమున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే రక్తం మ్యాచ్ చేయడంతో పాటు క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాతనే ఆ రాక్తన్ని కరోనా సోకిన ఇతర రోగులకు ప్లాస్మా ఎక్కించనున్నారు. కొవిడ్- రోగులకు ప్లాస్మా థెరపీని వాడాలని కేరళ వైద్య నిపుణుల ప్రతిపాదన మేరకే ఇటీవల ఐసిఎంఆర్ ఈ చికిత్సకు ఆమోదించినట్టు తెలిసింది. ప్లాస్మా థెరపీ విధానంపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో దాదాపు 1500లకు పైగా ఆస్పత్రుల సమన్వయంతో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే 600 మంది రోగులకుపైగా ఈ విధానం ద్వారా చికిత్స అందించారు. బ్రిటన్‌లోనూ అక్కడి శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి ట్రయల్స్ నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. దాతల నుండి ప్లాస్మాను సేకరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి బాగా ఉన్న వారిపై కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారి శరీరంలో వైరస్ ప్రవేశించగానే వారిలోని రోగ నిరోధక కణాలు (తెల్ల రక్తకణాలు) వైరస్‌పై దాడి చేస్తాయి. ఫలితంగా వైరస్ పనిచేయదు. ప్రస్తుతం కరోనా వైరస్‌కు ప్రత్యేక చికిత్స, అలాగే ప్రత్యేక మందులంటూ ఏమీ లేవు. పైగా దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
కోలుకున్న వ్యక్తి నుండే ప్లాస్మా వైరస్ సోకి చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది. రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటీబాడీ ఇందులో ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీబాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్ కణాలను తెల్ల రక్తకణాలు గుర్తించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారు చేస్తుంది. అందుకే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుండి ప్లాస్మాను తీసి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రోగులకు ఎక్కించడమే ప్లాస్మా చికిత్స అంటారు. అయితే కరోనా వైరస్ భారిన పడినవారు పూర్తిగా కోలుకోవాలి. వారికి ఒకటి, రెండు సార్లు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. వారి శరీరంలో ఇక వైరస్ లేదని వైద్యులు నిర్ధారించాలి. ఆ తర్వాత 14 రోజుల తర్వాత ఆ వ్యక్తిలోని రోగ నిరోధక కణాలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవాలి. దీనికి ఎలీసా పరీక్ష నిర్వహిస్తారు. కరోనా నుండి కోలుకున్న ఒక వ్యక్తి నుండి సుమారుగా 800 ఎం.ఎల్ ప్లాస్మా తీయవచ్చు. ఒక్కో కరోనా రోగికి 200 ఎం.ఎల్ ప్లాస్మా అవసరమైతుంది. ఇలా ఒక వ్యక్తి ద్వారా నలుగురు కరోనా రోగులకు ప్లాస్మా థెరపి ద్వారా చికిత్సను అందిచే అవకాశాలు ఉంటాయి.