బ్రిస్బేన్‌లో భారత్ చారిత్రక విజయం
ప్రముఖుల ప్రశంసలు
బిసిసిఐ ఐదు కోట్ల నజరానా
బ్రిస్బేన్: గబ్బా క్రికెట్ స్టేడియంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించే ఆస్ట్రేలియాకు చేదు అనుభవం మిగిలింది. 32 సంవత్సరాల తర్వా త టెస్టు క్రికెట్‌లో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది. అపూర్వమైన విజయాన్ని సాధించి పెట్టిన అజింక్య రహానే నేతృత్వంలోని జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఐదు కోట్ల రూపాయల నజరానా ప్రకటించిం ది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో భారత జట్టును అభినందించారు. ఈ విజయంలో కీల క పాత్ర పోషించిన వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్‌కు దక్కింది. ఇలావుంటే, తొలుత శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, చివరిలో రిషభ్ పంత్ వీరోచిత బ్యాటింగ్ టీమిండియాకు అత్యంత కీలకమైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందించింది. 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని అనుకున్న వారికి భారత జట్టు తన పోరాటపటిమతో తగిన సమాధానం చెప్పింది. మూడు వికెట్ల తేడాతో గెలిచి, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్‌కాగ, అందుకు సమాధానంగా భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియాకు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీనితో ఆ జట్టు 294 పరుగులకు ఆలౌటైంది. కాగా, 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా నాలుగు పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన మంగళవారం మ్యాచ్‌ని కొనసాగించిన భారత్ 18 పరుగుల స్కోరువద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది. అతను 7 పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసిన ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో భారత్ కోలుకుంది. రెండో వికెట్‌కు 114 పరుగులు జత కలిసిన తరాత గిల్ వికెట్ కూలింది. 91 పరుగులు సాధించిన అతను దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి చేయలేక, నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ అజింక్య రహానే 24 పరుగులకే కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ అందించి వెనుదిరగడంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడినట్టు కనిపించింది. కానీ, థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన పంత్ ఎంతో సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు దూకించాడు. జట్టు స్కోరు 228 పరుగుల వద్ద పుజారా వికెట్‌ను భారత్ కోల్పోయింది. 56 పరుగులు సాధించిన అతనిని కమిన్స్ ఎల్‌బిగా పెవిలియన్‌కు పంపాడు. మాయాంక్ అగర్వాల్ 9, వాషింగ్టన్ సుందర్ 22, శార్దూల్ ఠాకూర్ 2 చొప్పున పరుగులు చేసి వెనుదిరిగారు. వికెట్లు కూలుతున్నప్పటికీ, పంత్ తన పోరాటాన్ని కొనసాగించాడు. చివరి క్షణం వరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో అతను విన్నింగ్ షాట్ కొట్టి, సరికొత్త చరిత్రను లిఖించాడు. 97 ఓవర్లలో ఏడు వికెట్లకు 329 పరుగులు చేసి, భారత్ విజయాన్ని సాధించే సమయానికి పంత్ 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మరో నాటౌట్ బ్యాట్స్‌మన్ నవ్‌దీప్ సైనా తన పరుగుల ఖాతాను తెరవలేదు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా, నాథన్ లియాన్‌కు రెండు వికెట్లు లభించాయి.
సంక్షిప్త స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 115.2 ఓవర్లలో 369 ఆలౌట్ (మార్నస్ లబుషేన్ 108, స్టీవెన్ స్మిత్ 36, మాథ్యూ వేడ్ 45, కామెరాన్ గ్రీన్ 47, టిమ్ పైన్ 50, మహమ్మద్ సిరాజ్ 77/1, నటరాజన్ 78/3, శార్దూల్ ఠాకూర్ 94/3, వాషింగ్టన్ సుందర్ 89/3.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 111.4 ఓవర్లలో ఆలౌట్ 336 (రోహిత్ శర్మ 44, చటేశ్వర్ పుజారా 25, అజింక్య రహానే 37, మాయాంక్ అగర్వాల్ 38, రిభష్ పంత్ 23, వాషింగ్టన్ సుందర్ 62, శార్దూల్ ఠాకూర్ 67, మిచెల్ స్టార్క్ 2/88, జొస్ హాజెల్‌వుడ్ 5/57, పాక్ కమిన్స్ 2/94.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 75.5 ఓవర్లలో ఆలౌట్ 294 (మార్కస్ హారిస్ 38, డేవిడ్ వార్నర్ 48, మార్నస్ లబుషేన్ 25, స్టీవెన్ స్మిత్ 55, కామెరాన్ గ్రీన్ 37, మహమ్మద్ సిరాజ్ 5/73, శార్దూల్ ఠాకూర్ 4/61.
భారత్ రెండో ఇన్నింగ్స్: 97 ఓవర్లలో 7 వికెట్లకు 329 (శుభ్‌మన్ గిల్ 91, చటేశ్వర్ పుజారా 56, అజింక్య రహానే 24, రిషన్ పంత్ 89. వాషింగ్టన్ సుందర్ 22, పాట్ కమిన్స్ 4/55, నాథన్ లియాన్ 2/85).
గబ్బా కోట బద్దలు
RELATED ARTICLES