దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక మందగమనం
70 ఏళ్లలో తొలిసారిగా ప్రభుత్వానికి క్లిష్టపరిస్థితి
న్యూఢిల్లీ : “మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 72 సంవత్సరాలు పూర్తయింది. తొలి రెండేళ్లు వదిలేద్దాం. గడిచిన 70 ఏళ్లలో కనీవినీ ఎరుగనిరీతిలో భారతదేశం గడ్డుకాలాన్ని చవిచూస్తున్నది. ఆర్థిక వ్యవస్థ మందగమనం ఏనా డూ ఈస్థాయిలో లేదు. గత ఐదేళ్లలో పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఈ దేశం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ల డం జరిగింది” ఈ మాటలన్నది ఎవరో కాదు. స్వయంగా నీతిఅయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్. ఆయన తన మనసులోని బాధను గురువారంనాడు ఎఎన్‌ఐ వార్తాసంస్థతో వెల్లగక్కారు. దేశం అత్యంత సంక్లిష్ట దశలో వుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు ఈ తరహా ఆందోళన వెలిబుచ్చిన విషయం తెల్సిందే. ఆ వరుసలో తాజాగా రాజీవ్‌కుమార్ చేరారు. “గత 70 ఏళ్లలో భారత్ ఏనాడూ ఎదుర్కొనని అనూహ్యమైన పరిస్థితి”గా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఆయన అభివర్ణించారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అధ్వాన స్థాయి కి చేరిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం ఇస్తున్న సంస్థల్లో ఒకటిగా వున్న నీతి అయోగ్‌కు చెందిన ఉన్నతాధికారి ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాముఖ్యతను పొందాయి. “భారత స్వాతం త్య్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో భారత ప్రభుత్వం ఏనా డూ ఇలాంటి ద్రవ్య పరిస్థితిని చవిచూడలేదు. యావత్ ఆర్థిక రంగమే గందరగోళంలో వుంది. ఏ ఒక్కరూ ఏ ఒక్కరినీ విశ్వసించడం లేదు. ఏ వ్యవస్థ కూడా ఇంకో వ్యవస్థను నమ్మడం లేదు” అని రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు కొంత సమయం తీసుకునే విధంగా కొన్ని చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని చెప్పారు. ఐఎల్, ఎఫ్‌ఎస్ కంపెనీలు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్, ఆర్థిక సేవలు) దివాళా తీయడం వల్ల ఆర్థిక రంగంలో సంక్షోభం ముదిరిందని, ప్రభుత్వం, ఆర్‌బిఐ రెండూ ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నదని తెలిపారు. కానీ ఫలించడం లేదన్నారు. నోట్లరద్దు వ్యవహారం ప్రభావం తీవ్రంగా వుందని అభిప్రాయపడ్డారు. ఆర్‌బిఐ గత కొన్ని మాసాలుగా తీసుకున్న చర్యల వల్ల వ్యవస్థలో నగదు చెలామణి సర్దుకున్నట్లు కన్పించిందని తెలిపారు. బ్యాంకేతర ఆర్థిక కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు)కు ప్రభుత్వ రంగ బ్యాంకులు ద్రవ్యాన్ని సమకూర్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏడాదిలో వరుసగా నాలుగుసార్లు ఆర్‌బిఐ రెపో రేట్లను తగ్గించిందని గుర్తుచేశారు. రుణదారులకు వడ్డీరేట్లు తగ్గించి ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించిందన్నారు. ఎన్‌బిఎఫ్‌సి రంగం ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ప్రభుత్వం వరుస చర్యలు చేపట్టిందన్నారు. ఆర్థికంగా బలంగా వున్న ఎన్‌బిఎఫ్‌సిలకు చెందిన ఆస్తుల కొనుగోలుకు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సర్కారు అనుమతినించిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం చివరకు పది శాతం తగ్గించుకొని పిఎస్‌బిలకు ఆరుమాసాల పాక్షిక రుణహామీనిచ్చిందన్నారు. ఈస్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వుంటుందని కూడా ఆర్థిక నిపుణులు ఊహించివుండరని ఆయన అభిప్రాయపడ్డారు. తొలిసారిగా భారత ప్రభుత్వం అతిపెద్ద ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు.