మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజనచట్టంలో తెలంగాణకిచ్చిన హామీలను నెరవేర్చలేదని, అత్యంత ప్రతిష్టాత్మకం, వ్యయభరితమైన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఈ ఎన్నికల తరుణంలో టిఆర్ విమర్శిస్తుండగా, కాళేశ్వరానికి జాతీయహోదా గూర్చి ప్రభుత్వం అడగలేదని కేంద్ర ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరి తెలంగాణ ప్రభుత్వం నెత్తిపై పెద్ద బండవేశారు. అయితే గడ్కరీ మాట పచ్చి అబద్ధమని ఆపద్ధర్మ (ఇరిగేషన్) మంత్రి హరీష్ ఖండించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ 2016 ఫిబ్రవరి 11న ప్రధాని మోడీకి రాసిన లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తాను, పార్టీ ఎంపిలు, ఉన్నతాధికారులు ప్రధానిని, గడ్కరీ, ఉమాభారతిలను కలిసి విజ్ఞప్తి చేశామని, పార్టీ ఎంపిలు పార్లమెంటులో లేవనెత్తారని గుర్తు చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని గత ఏడాది ఆగస్టు 10న లోక్ చెప్పిన గడ్కరీ తెలంగాణ ప్రభుత్వం అసలు అడగనేలేదనటం అవాస్తవం అన్నారు. ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టును, తెలంగాణలో ప్రాణహితచేవెళ్ల (కాళేశ్వరానికి పూర్వరూపం) ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టులుగా చేబట్టాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా పొందుపరిచారు. ప్రాణహితచేవెళ్ల రీడిజైనింగ్ కాళేశ్వరం రూపుదాల్చింది.అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ రీడిజైనింగ్ ప్రాజెక్టు సవివర నివేదికను కేంద్రప్రభుత్వానికి పంపేనాటికే, పోలవరం తప్ప దేశంలో మరే ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా అంగీకరించరాదని మోడీ మంత్రివర్గం నిర్ణయించింది. గడ్కరీ ఆ వాస్తవం చెప్పకుండా నిందను తెలంగాణ ప్రభుత్వంపైకి నెట్టటం ఎన్నికల తరుణంలో మోసపూరిత ప్రకటన అనాల్సి ఉంటుంది. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ సహా విభజనచట్టంలో తెలంగాణకిచ్చిన హామీలను ఎందుకు అమలు జరపలేదో బిజెపి సంజాయిషీ ఇచ్చుకోవాలి.