విశ్వాస పరీక్షలో మూజవాణి ఓటుతో అశోక్ గెలుపు
21కి రాజస్థాన్ అసెంబ్లీ వాయిదా
జైపూర్: రాజస్థాన్‌లో గత కొన్ని రోజులు సాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు ముగింపు ప డింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్‌ప్రభుత్వం శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గెహ్లాట్ సర్కార్ నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ సిపి జోషీ ప్రకటించారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గింది. విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను బిజెపి కూల్చివేసిందని ఆరోపించారు. రాజస్థాన్‌లోనూ అదే ప్రయత్నం చేసిన కాషాయపార్టీ భంగపడిందని అన్నారు. గెహ్లాట్ నేతృత్వంలోని సర్కార్‌ను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. ఇక 200 మంది సభ్యులు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో గహ్లోత్ సర్కార్‌కు 107 మంది ఎంఎల్‌ఎల మద్దతు ఉండగా, బిజెపి సంఖ్యాబలం 72గా ఉంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టనీయబోనని సిఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ప్రయత్నించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకుంటామన్నారు. బిజెపి నేత వసుంధర రాజెతో తాను చేతులు కలిపినట్టు వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఆమెతో తానెలంటి సంభాషణా జరపలేదన్నారు. అసెంబ్లీ భేటీ వాస్తవాలకు అద్దం పడుతుందని, కాంగ్రెస్ ఎంఎల్‌ఎల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని.. సత్యమేవ జయతే అంటూ అసెంబ్లీ సమావేశాలకు ముందు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ప్రభుత్వం నెగ్గడం సంతోషంగా ఉందన్నారు. దీంతో ఊహాగానాలకు స్వస్తిపలికినట్టయిందని తెలిపారు. రాజస్థాన్ ప్రజల ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు.
యోధులనే సరిహద్దులకు పంపుతారు : సచిన్ పైలట్
సుమారు నెల రోజుల రాజకీయ అనిశ్చితి తర్వాత రాజస్థాన్ శాసనసభ శుక్రవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుగుబాటు అనంతరం సొంత గూటికి చేరుకున్న సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీలో ఆయన స్థానాన్ని అధికార పక్షానికి దూరంగా ప్రతిపక్షాలకు దగ్గరగా కేటాయించారు. దీనిపై సచిన్ తనదైన శైలిలో స్పందిచారు. ‘నేను కూర్చునే సీటును ప్రతిపక్షాలకు దగ్గరగా, అధికార పక్షానికి దూరంగా చివరన ఎందుకు కేటాయించారో తెలుసా?.. ధైర్యవంతులు, శక్తిమంతులైన సైనికులనే ఎప్పుడూ సరిహద్దులకు పంపుతారు” అని పైలట్ వ్యాఖ్యానించారు. నెల రోజుల క్రితం అశోక్ గెహ్లాట్‌తో విభేదించిన సచిన్ పైలట్ తన వర్గం ఎంఎల్‌ఎలతో తిరుగుబాటు చేశారు. పలు నాటకీయపరిణామాల తర్వాత అధిష్టానంతో పైలట్ జరిపిన చర్చలు సఫలం కావడంతో తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీంతో బలనిరూపణ కోసం శుక్రవారం అసెంబ్లీ సమావేశమైంది.
గట్టెక్కిన గెహ్లాట్
RELATED ARTICLES