HomeNewsBreaking Newsగం(ఎం)జాయ్‌

గం(ఎం)జాయ్‌

మత్తుకు బానిసవుతున్న యువత
భద్రాచలంలో అంతర్రాష్ట్ర ముఠా?
ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల నుండి రవాణా
ప్రజాపక్షం/భద్రాచలం
నిషేధిత ‘గంజాయి’ నేడు యువతకు ‘ఎంజాయ్‌’గా మారుతోంది. గంజాయి సేవించడం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలిసినప్పటికీ మత్తుకు బానిసైన యువకులు పెద్దఎత్తున గంజాయిని ఆస్వాదిస్తున్నారు. ఇదే అదునుగా గంజా యి స్మగ్లర్లు విచ్చలవిడిగా గంజయాయిని సాగు చేయించి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అంతర్‌రాష్ట్ర రవాణా సదుపాయం ఉన్న భద్రాచలం మీదుగా కోట్లాది రూపాయల విలువచేసే గంజాయి నిత్యం తరలిపోతోందని ప్రచారం జరుగుతుండడం ఇందుకు నిదర్శనం. దొరికితే దొంగ, లేదంటే దొర అన్న చందంగా ఉంది స్మగ్లర్ల పరిస్థితి. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారం కొందరికి కోట్ల రూపాయాలను తెచ్చిపెడుతూ మరి కొందరికి ఉపాధి హామీ పథకంగా మారగా యువత జీవితాలు జీవితాలు ఛిద్రమౌతున్నాయి. గంజాయికి పంటలకు అనువైన ప్రదేశం ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతా లు. దట్టమైన అడవులు, కొండల మాటున ఈ గంజాయి పంట పెద్దఎత్తున సాగుతున్నది. ఆ ప్రాంతాల్లో కొన్ని పంటల మాటున అంతర్‌ పంటగా కూడా సాగుచేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గంజాయికి బాగా ధర పలుకుతుండటంతో అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా ఇక్కడ మకాం వేసి కింది స్థాయి ముఠాలకు దిశా నిర్ధేశాలు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌టిసి బస్సు లు, కార్లు, లారీలు, కంటైనర్లు, టాటా మ్యాజిక్‌లలో రవాణాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్దమొత్తంలో పెట్టుబడి : విచ్చలవిడిగా వ్యాపారం
అక్కడ గంజాయిని పండించేందుకు కొందరు దళారులు ఏటా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిస్సా అడవులు సరిహద్దులను పంచుకుని ఉంటాయి. ఈ రెండు రాష్ట్రాలు ఎక్కువగా అటవీ క్షేత్రాలతో నిండి ఉండటంతో పాటు అనాగరిక ప్రజలు అధికంగా జీవిస్తుంటారు. ఇది స్మగ్లర్లకు బాగా కలిసొచ్చిన అంశం. ఒడిస్సాలో లభ్యమయ్యే గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారు చేసి ఏపిలోని చింతూరు మీదుగా తెలంగాణలోనికి తరలిస్తుంటారు. ఆ గంజాయిని భద్రాచలం పట్టణ శివారు ప్రాంతాల్లోని గ్రామాలు, కాలనీల్లో భద్రపరిచి రాత్రివేళల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గడ్‌కు చెందిన కొందరు ఒడిస్సా నుండి గంజాయిని భద్రాచలంలో డంప్‌ చేసి వారి ఆధీనంలో ఉంచుకుని స్మగర్ల చేతికి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే వ్యవహారం బయటపడింది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు భద్రాచలం పట్టణ శివారు కాలనీల్లోని కొన్ని ఇళ్లలో తనిఖీలు నిర్వహించి, వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇటుగా తరలిపోతున్న గంజాయి వేరే జిల్లాల్లో పట్టుపడింది. అందులో పెద్ద సంఖ్యలో గంజాయి ప్యాకెట్లు లభ్యం కావడంతో విచారించగా, భద్రాచలం మీదుగా తరలించుకొచ్చినట్లు నింధితులు వెల్లడించారు. గంజాయిని తరలించేందుకు కేటుగాళ్లు ట్రాక్టర్లు, ఖరీదైన కార్లు, కంటైనర్లు, బస్సులను వినియోగిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం పోలీస్‌ స్టేషన్‌లో పట్టుబడ్డ లారీలు, కార్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. గంజాయిని హైదరాబాద్‌ తరలించేందుకు పలు మార్గాలను కూడా స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. రైలుమార్గం అనువుగా ఉన్న ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని, హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో కిలో గంజాయి ధర రూ.2వేలు పలికితే దానిని ఇతర రాష్ట్రాలకు తరలించి, అదే కిలో గంజాయిని రూ.6 వేలు అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తునట్లు తెలుస్తోంది. కాగా గంజాయిని పండించే వారు ఒకరు, దానిని తరలించే వారు ఇంకొకరు, దానిని స్వాధీనం చేసుకునే వారు మరొకరు, రాష్ట్ర రాజధానిలో అడ్డా ఏర్పాటు చేసుకునే వారు ఒకరు, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునే వారు ఒకరు. ఇలా ఐదంచెల వ్యవస్థ ద్వారా గంజాయి రాష్ట్రాలను దాటి స్మగ్లర్లకు కోట్ల రూపాయలను సంపాదించి పెడుతోంది.
అడ్డుకట్టకు అడ్డంకులు
గంజాయి స్మగ్లింగ్‌ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దొరికితే పట్టుకోవడం తప్ప అసలు స్థావరాలను తనిఖీ చేసే పరిస్థితి లేదు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పండిస్తుండటంతో పోలీసు, అటవీ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఇబ్బందిగా తయారైంది. పండించే ప్రదేశాలకు చేరుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే. గంజాయిని సాగు చేసే వారికి లోపలి నుండి అండదండలు కూడా ఉంటాయనే ప్రచారం జరుగుతుండడంతో అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడటం లేదు. సమాచారం తెలుసుకుని, కోవర్టుల ద్వారా విషయాన్ని తెలుసుకుని కాపుగాసి పట్టుకుంటే తప్ప దొరకడం లేదు. స్మగ్లర్లు కూడా పోలీసులు, ఎక్సైజ్‌ వారిని ఏమార్చేందుకు పలు మార్గాల్లో రవాణాను సాగిస్తున్నట్లు, కొన్ని సందర్భాల్లో తక్కువ మోతాదులో తరలించేటప్పుడు వారే సమాచారాన్ని అందించి పోలీసులకు పట్టుకునేలా చేసుకుని వారిని తప్పుదోవ పట్టించి ఆ తర్వాత రాత్రి వేళల్లో పెద్ద మొత్తంలో తరలిస్తున్నట్లు సమాచారం.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments