కోదండరామ్ దీక్షలో రాజకీయ పార్టీల నేతల డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్‌ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాతర పెడుతోందని, నిరుద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. నిరుద్యోగ, ప్రైవే టు టీచర్లు, రైతు సమస్యలపై దీక్ష చేపట్టేందుకు అనుమతి నిరాకరించడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్ల స మస్యల పరిష్కారం, వాటి హక్కుల సాధన కోసం “బతుకుదెరువు నిలబెట్టాలని- తెలంగాణను కాపాడాలని”అనే నినాదంతో హైదరాబాద్‌లోని టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ఆదివారం నిరాహారదీక్ష చేపట్టారు. కోదండరామ్‌కు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంఎల్‌సి చుక్కారామయ్య పూలదండ వేసి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసి నాయకులు సాదినేని వెంకటేశ్వర్లు, కె.గోవర్దన్,రమాదేవితో పాటు ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి, తెలంగాణ టీచర్ల సంఘం నాయకులు చందు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘలు, విద్యార్థి, యువజన,నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి కోదండ రామ్‌కు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ, ఉపాధ్యాయ, రైతు సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌లో కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. శాంతి భద్రతల పేరుతో ఇందిరాపార్క్ వద్ద కోదండరామ్ దీక్షకు అనుమతి నిరాకరించడం టిఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలగా పేర్కొన్నారు.
ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడమేమిటి: చాడ వెంకట్‌రెడ్డి
ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఉండడం ఏమిటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ప్రభువులుగా వ్యవహరిస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాతర పెడుతోందని విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద మొన్నటి వరకు దీక్షకు అనుమతినిచ్చి ఇప్పుడు కోదండరామ్‌కు అనుమతి నిరాకరించడంలో ఆంతర్యమేమిటని, ఆయన అప్రజస్వామ్యవాదా? లేదా టెర్రరిస్టా అని ప్రశ్నించారు. దీక్ష చేపడితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ఎలా గుర్తించారన్నారు. అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకపోవడం అన్యాయమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం మళ్ళీ పోరాటం చేయాల్సి రావడం దురదృష్ట కరమని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన భారత్‌బంద్‌లో పాల్గొన్న అధికార టిఆర్‌ఎస్ ప్రస్తుతం ఎందుకు మౌనం పాటిస్తుందని సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలతోనైనా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇప్పటికైనా ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ మాట్లాడుతూ ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరితే సిఎం కెసిఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిధులు ఏమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని, కేంద్రంలోని పాలకులను చులకనగా మాట్లాడి ఆ తర్వాత మళ్లీ కాళ్లబేరం ఆడటం ఒక్క కెసిఆర్‌కే చెల్ల్లిందని ఎద్దేవా చేశారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ కోదండరామ్ స్వార్థం కోసం పోరాడటం లేదని, యువకుల కోసం పోరాడుతున్నారని, దీక్ష శిబిరం ద్వారా యువకులంతా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వబోతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల వాణిని వినిపించాలంటే శాసనమండలిలో కోదండరామ్ ఉండాలన్నారు. సాదినేని వెంకటేశ్వర్లు, కె.గోవర్ధన్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై సిఎం కెసిఆర్ యూటర్న్ తీసుకున్నారన్నారు. ప్రొఫెసర్ డి.నరసింహరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
బలహీనమైన టిఆర్‌ఎస్ ప్రభుత్వం: కోదండరామ్
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడిందని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ఆరోపించారు. బలహీనపడినందుకే కెసిఆర్ ఢిల్లీ వైపు చూస్తున్నారన్నారు. అవినీతిపై కేంద్రం విచారణ జరుపుతోందన్న భయం సిఎం కెసిఆర్‌ను వెంటాడుతోందని, కెసిఆర్ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఉద్యోగాల క్యాలండర్‌ను భర్తీ చేయాలని, రైతులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఖాళీగా ఉన్న పోస్టులపై తక్షణం శ్వేతపత్రం
RELATED ARTICLES