న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా(కొవిడ్ భారత్‌లో కూడా విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో మరో కేసు నమోదుకావడంతో ఈ కేసుల సంఖ్య 31కి చేరింది. ఈ తాజా కేసు ఢిల్లీలో మూడోది. ఢిల్లీకి చెందిన ఓవ్యక్తి ఈమధ్యే థాయిలాండ్, మలేషియా దేశాల్లో పర్యటించి వచ్చాడు. తాజాగా అతడు అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్య అధికారులు వెల్లడించా రు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికి త్స అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్ట చర్యలు చేపట్టాయి. తాజా అడ్వయిజరీ ప్రకారం… ఏ దేశానికి చెందిన వ్యక్తన్న తేడా లేకుండా అంతర్జాతీయ ప్రయాణికులందరూ యూనివర్సల్ మెడికల్ స్క్రీనింగ్ చేయించుకోవలసిందే. ఇపుడున్న 21 విమానాశ్రయాలకు తోడు అదనంగా కొన్నింటిని చేర్చడంతో మొత్తం 30 విమానాశ్రయాల్లో ప్రయాణికుల స్క్రీనింగ్ జరుగుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కొవిడ్ ఒక రోజు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రాష్ట్రాలు, రైల్వే ఆసుపత్రులకు చెందిన 280 మంది ఆరోగ్య అధికారుల ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా దుబాయ్ గుండా కెన్యా నుంచి భారత్‌కు వచ్చిన రాయ్‌పుర్‌కు చెందిన వ్యక్తికి కరోనావైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతడిని క్వారంటైన్‌లో ఉంచారు.