ముంబయి : కరోనా కట్టడికి కేంద్రంలోని మోడీ సర్కారు భారీగా అప్పు చేయనున్నది. ఏప్రిల్ 1తో ఆరంభం కానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.4.88 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం రుణంగా తీసుకురానుంది. కరోనా వైరస్ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి మంగళవారంనాడు వెల్లడించారు. నూతన ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో అంచనా వేశారు. అంతకు ముందు ఏడాది ఇది రూ.7.1 లక్షల కోట్లే కావడం గమనార్హం. స్థూల రుణాల్లో పాత అప్పుల చెల్లింపులు సైతం ఉంటాయి. ఇక నికర రుణాలు 2020-21కి రూ.5.36 లక్షల కోట్లు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. 2019-20లో ఇది రూ.4.99 లక్షల కోట్లు కావడం గమనార్హం. రూ.22,000 కోట్లను కొన్ని మౌలిక సదుపాయాలకు రుణాలు అందజేసే ఆర్థిక సంస్థలకు కేటాయిస్తామని, వీటితో ఆ సంస్థలు మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థలకు దీర్ఘకాల రుణాలు మంజూరు చేస్తాయని తెలిపారు. దాని వల్ల ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందన్నది నిర్మలా సీతారామన్ వాదన.
కరోనా కట్టడికి రూ. 4.88 లక్షల కోట్లు అప్పు
RELATED ARTICLES