తెలంగాణ ఉద్యమాన్ని ప్రధాని అవమానపరిచారు
మోడీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే దేశ వ్యాప్త ఉద్యమం
విభజనపై ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఆందోళనలు
మోడీ, బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం
బైక్‌ర్యాలీలు, మానవహారాలు
ప్రజాపక్షం/ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధా ని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టిఆర్‌ఎస్ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. మోడీ, బిజెపి ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పలు జిల్లాల్లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు రాస్తారోకో, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై మోడీ చేసిన వ్యాఖ్యలు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమేనని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బహిరంగ క్ష మాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, నిధుల కేటాయింపుల వివక్షత చూపుతున్న మోడీ ప్రభు త్వం, తాజాగా చేసిన వ్యాఖ్యలతో తెలంగాణకు బిజెపి వ్యతిరేకి అని స్పష్టమైందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా మోడీ తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోకుంటే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని వారు హెచ్చరించారు. ప్రధాని మోడీ వైఖరి చూస్తేంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను మళ్ళీ కలుపుతారేమోనని అనుమానం వస్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి అసెంబ్లీ గన్ పార్కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు కార్పొరేటర్‌లు, పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై ఇప్పుడు మాట్లాడుతున్న ప్రధాని ఇన్నేళ్లు మోడీ గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుపిలో ఎస్‌పి గెలుస్తుందని వస్తున్న సర్వేలు చూసి మోడీ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. మోడీ క్షమాపణ చెప్పకపోతే దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు తెలంగానాను కించపరిచేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. నాంపల్లిలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఆధ్యర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా టిజిఎ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ అన్ని పార్టీల మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్‌లో అమోదం పొందిందని, బిల్లును అమోదించిన వారిలో బిజెపి ఎంపిలతో పాటు సీనియర్ నాయకురాలు సుష్మస్వరాజ్ ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యోగుల విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులపై ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి భారాలు మోపుతున్న మోడీ సర్కార్, తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. బిజెపి పార్టీకి తెలంగాణ మీద అవగాహన లేదని, ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాకినాడ తీర్మాణంతో బిజెపి డ్రామాలు చేసిందని, ఆ తరువాత మూడు రాష్ట్రా లు ఏర్పాటు చేసి తెలంగాణను విస్మరించిందని మంత్రి విమర్శించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుండి గట్టయ్య సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు, జెడ్పి సెంటర్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు. మోడీ శవ యాత్రను నిర్వహించి దగ్ధం చేశారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలు జనగామ జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించడంతో పాటు మోడీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,, జనగామలో ఎంఎల్‌ఎలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి స్టేషన్‌ఘనపురంలో తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. తెలంగానాకు వ్యతిరేకమైన బిజెపిని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో మాహాధర్నా కార్యక్రమం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పల మండల కేంద్రాలలో నల్ల బాడ్జీలు ధరించి, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించి బిజెపి బొమ్మను దహనం చేశారు. నిర్మల్ పట్టణంలో టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో జరిగిన నిరసన ర్యాలీలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్గాన్నారు. తెలంగాణ రాష్ట్రంపై, రాష్ట్ర విభజనపై ప్రధాని విషం కక్కారని మంత్రి విమర్శించారు. కరీంనగర్ పట్టణంలోని రామ్‌నగర్ చౌరస్తాలో గల మార్క్‌ఫెడ్ మైదానం నుంచి తెలంగాణ చౌక్ వరకు వందలాది మంది టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌక్‌లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
క్షమాపణ చెప్పాలి
RELATED ARTICLES