అదుపులోకి మరో ఇద్దరు ఉద్యోగులు
ప్రజాపక్షం/ హైదరాబాద్: మల్టీ లెవల్ మనీ స్కీమ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న ‘క్యూనెట్’ సంస్థ డైరెక్టర్ పుక్కెల దిలీప్ రాజ్ (44)తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు జార్ఖండ్‌కు చెందిన చందన్‌కుమార్ చౌదరి (26), బీహార్‌కు చెందిన అతుల్ కుమార్ సింగ్ (28)లను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీసు స్టేషన్‌లలో క్యూనెట్ సంస్థపై నమోదైన 30 కేసులలో ఇప్పటికే 58 మంది నిందితులను అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో అరెస్టయిన వారి సంఖ్య 61కి చేరింది. తాజాగా అరెస్టు అయిన వారి వివరాలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారి, అదనపు డిసిపి ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. విశాకపట్నంకు చెందిన దిలీప్‌రాజ్ క్యూనెట్ సంస్థ తరపున తెలంగాణలో శాఖను తెరిచి డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హాంకాంగ్ కేంద్రంగా దందా నిర్వహిస్తున్న క్యూనెట్ సంస్థ వివిధ స్కీమ్‌ల పేర్లతో విద్యార్థులు, నిరుద్యోగులనే టార్గెట్ చేసిందన్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్‌పై సంస్థకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారన్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థపై వివిధ పోలీసు స్టేషన్లలో వేరు వేరుగా 30 కేసులు నమోదు చేశామన్నారు. సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ జనవరి నెలలోనే 58 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా ఆ సంస్థ డైరెక్టర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలను క్యూనెట్ మోసగాళ్లు వసూలు చేశారని అన్నారు. అలా సేకరించిన డబ్బులతో వస్తువులు ఇస్తామం టూ చైన్ బిజెనెస్ చేస్తున్నారని చెప్పారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారని, ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ రంగంలోకి దిగి నిందితులను పట్టుకుందని వివరించారు. ఇప్పటి వరకు క్యూనెట్ మోసంపై 30 కేసులు నమోదు చేశామని, దేశ వ్యాప్తంగా క్యూనెట్ అకౌంట్లతో సీజ్ చేశామన్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబాయిలోని క్యూనెట్ గోదాములను సీజ్ చేశామని, బాధితుల సంఖ్య మరింత పెరగనుందన్నారు.