సిపిఐ విమర్శ : సంఘీభావానికి పిలుపు
న్యూఢిల్లీ : లాటిన్ అమెరికా దేశం క్యూబాను అస్థిరీకరించేందుకు అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న ప్రయత్నాలను సిపిఐ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ద్వారా క్యూబా దేశాన్ని అస్థిరీకరించేందుకు అమెరికా సామ్రాజ్యవాదం దుష్టపూరితమైన కుట్రలకు పాల్పడుతోందని పార్టీ విమర్శించింది. పార్టీ కేంద్ర కమిటీ తరపున సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారం ఈ మేరకు ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేస్తూ అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. దీనిని సంక్లిష్టమైన సమయంగా పరిగణించి క్యూ బాకు మడమతిప్పనిరీతిలో సంపూర్ణ సంఘీభావం ప్రకటించాలని, క్యూబా విప్లవోద్యమానికి, క్యూబా సోషలిస్టు వ్యవస్థకుమద్దతు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. క్యూబాలో సోషలిస్టు వ్యవస్థ పురుడుపోసుకున్నప్పటినుండీ క్యూబా గొంతు నొక్కేయాలని అమెరికా అనేక దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన ప్రకటన సారాంశం ఇలా ఉంది. ‘క్యూబా విప్లవోద్యమం గొంతు నొక్కేందుకు ఆరంభం నుండీ అమెరికా సామ్రాజ్యవాదం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే నాటి క్యూబా నేత ఫైడల్ కాస్ట్రోను హతమార్చేందుకు ఎన్నోసార్లు కుట్రలకు పాల్పడ్డారు. క్యూబాకు వ్యతిరేకంగా వ్యవస్థాగతమైన నేరాలను అమెరికా సామ్రాజ్యవాదం కొనసాగిస్తూనే ఉంది. క్యూబాలో పరిపాలనను మార్చేసే లక్ష్యంతో విప్లవ ప్రతీఘాత శక్తులను పెంచి పోషించడం ద్వారా క్యూబా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎన్ని వ్యూహాలు పన్నినాగానీ, ప్రజలపై అమెరికా పాలనాయంత్రాంగం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ క్యూబా దేశ ప్రజలు వాటన్నింటినీ తట్టుకుని నిలబడి 62వ విప్లవ వార్షికోత్సవం చేసుకున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తమ స్వాతంత్య్రాన్ని సంరక్షించుకునేందుకు, స్వేచ, సమానత్వం, న్యాయాలను కాపాడుకునేందుకు క్యూబా ప్రజలు క్యూబా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన వీరోచిత పోరాటాలు చేశారు. ఆచరణలో సామ్యవాద వ్యవస్థ నిర్మించుకునేందుకు పురోబాటలో కొనసాగుతున్నారు. ఇప్పుడు తన సొంత టీకా తయారు చేసుకుని కరోనా మహమ్మారి నుండి కోలుకున్న తరువాత ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ముఖ్యంగా పర్యాటక రంగాన్ని విస్తరించి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునేందుకు లాంఛనంగా దేశ సరిహద్దులను తెరిచిన ముఖ్యమైన సందర్భంలో తాజాగా అమెరికా క్యూబాను అస్థిరత్వంపాలు చేసేందుకు దుష్టపూరిత కుట్రలకు పాల్పడుతోంది. క్యూబా దేశ ప్రజలు సుధీర్ఘకాలంగా అమానవీయమైన పద్ధతుల్లో అమెరికా బ్లాకేడ్ ను ఎదుర్కొంటున్నారు.అయినప్పటికీ విద్యాహక్కు, ఆరోగ్యం, విజ్ఞానరంగం, సంస్కృతి, క్రీడలు వంటి ఇతర రంగాలలో కూడా రాణిస్తూ క్యూబా ప్రజలు ఎంతో గౌరవప్రదమైన, హుందాతో కూడిన జీవితాలను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా సామ్రాజ్యవాదం సర్వశక్తులూ కూడదీసుకుని పూర్తి యంత్రాంగంతో చేసే అన్ని రకాల విప్లవ ప్రతీఘాత విచ్ఛన్నకరమైన చర్యలను క్యూబా ప్రజలు అనుమతించబోరని, తమ విప్లవ స్వాతంత్య్రాన్ని రక్షించుకుంటారని కమ్యూనిస్టుపార్టీ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. ప్రియమైన స్నేహితులారా! ఈ సంక్లిష్టమైన సమయంలో క్యూబాకు సంఘీభావం, క్యూబా విప్లవానికి, సోషలిజం సంరక్షణకు మద్దతుగా నిలవండి’ అని డి రాజా తన ప్రకటనలో పిలుపు ఇచ్చారు.
క్యూబాపై అమెరికా దుష్టపూరిత కుట్ర
RELATED ARTICLES