రాష్ట్రం రోగాల మయమైనా వైద్యశాఖ పోస్టులు భర్తీ చేయరా?
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మల్లు భట్టి విక్రమార్క, సీతక్క మండిపాటు
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం రోగాలమయంగా మారిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం నాడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఫిజీషియన్లు, సర్జన్లు, పారామెడికల్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఐదేళ్లలో ప్రభుత్వం ఈ ఖాళీల్లో ఎన్ని పోస్టులను భర్తీ చేసిందో వెల్లడించాలని కోరారు. ఆయా పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో వెల్లడించాలని వైద్యశాఖ మంత్రిని ప్రశ్నించారు. ఆపరేషన్ థియేటర్లలో కనీసం శస్త్ర చికిత్సకు అవసరమైన పరికరాలేమీ లేవన్నారు. ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరతపై ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలేమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 6 సంవత్సరాలుగా పరిశుభ్రత కోసం గ్రామాలకు నిధులు మంజూరు చేయక పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శాసనసభ దృష్టికి తీసుకుని వచ్చారు. ఆసుపత్రుల్లో శానిటేషన్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. అందువల్ల వాళ్లు పని చేయడానికి నిరాకరిస్తున్నారని అన్నారు.
క్యాంపు ఆఫీసులో కుక్క చస్తే సస్సెండ్ చేశారు.. మనుషుల చస్తుంటే పట్టించుకోరా? ః సీతక్క
క్యాంపు కార్యాలయంలో కుక్క చస్తే డాక్టర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం జిల్లాల్లో డెంగీ తదితర విష జ్వరాలు వచ్చి మనుషులు చస్తుంటే మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ డి.అనసూయ (సీతక్క) ఆరోపించారు. రాష్ట్రం గత నెల రోజులుగా డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలతో అల్లాడుతోందన్నారు. ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. పారిశుద్ధ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఈ కారణంగానే దోమలు విజృంభించి డెంగీ వ్యాధి విస్తరిస్తోందన్నారు. వివిధ ఆసుపత్రుల్లో సివిల్ సర్జన్‌లు, పారా మెడికల్ సిబ్బంది పోస్టులు దాదాపు 9256 ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ పోస్టులను ఎప్పటిలోగా నింపుతారో ప్రభుత్వం తెలియజేయాలన్నారు. గిరిజన, లంబాడా తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 50 పడకల ఆసుపత్రులను వంద పడకలకు విస్తరించామని చెబుతున్న ప్రభుత్వం కావాల్సిన మందులు, ఇతర సామాగ్రిని మాత్రం పాత పద్ధతిలోనే 50 పడకల ఆసుపత్రి మాదిరిగానే అందజేస్తోందన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి కారణంగా వరంగల్ జిల్లాలో టిఆర్‌ఎస్ నేత ఒకరు డెంగీ కారణంగా మృతి చెందారన్నారు. వైద్యులు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పని చేయకుండా వారు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లోనూ పని చేసేలా వారికి ఆకర్షణీయమైన ఇన్‌సెంటీవ్స్‌ను ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు.