మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్
పనాజి : విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అంతకుముందు కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు స్వదేశంలో ఆడిన టెస్టు, టి20 సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. దీంతో కోహ్లీపై క్రికెట్ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి మద్దతుగా భారత జట్టు మాజీ సారథి, చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ నిలిచారు. కేవలం ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగా ఓ ఆటగాడిని అంచనా వేయడం సరికాదన్నారు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్స్‌లో ఒకడన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఐపిఎల్ ఒక ఎంటర్‌టైన్మెంట్ టోర్నీ దాన్ని ఆధారంగా ఒక ప్రధాన ఆటగాడిని విమర్శించడం సరికాదని, అతని సత్తా ఎంటో ఎప్పటికే ప్రపంచానికి చాటుకున్నాడని దిలీప్ పేర్కొన్నారు. టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ.. వన్డేలు, టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు టెస్టుల్లో నెంబర్ వన్, వన్డేల్లో రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఈ విషయాన్ని కొందరూ గుర్తించుకుంటే బాగుంటుందని వెంగ్‌సర్కార్ చెప్పారు. ఈ సారి వన్డే ప్రపంచకప్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. అక్కడి ఫాస్ట్ పిచ్‌లలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అయితే ఆ పరిస్థితులకు అలవాటుపడ్డ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియానే ఈసారి ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయని వెంగ్‌సర్కార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక భారత జట్టు పటిష్టంగా ఉన్న ప్రపంచకప్ గెలవడం అంత ఈజీ కాదని, టీమిండియా సెమీస్‌కు వెళ్లడం సులభమేనని నమ్మకం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో భారత్ మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని, కానీ బ్యాట్స్‌మెన్‌ల తడబాటు కలవరపెడుతున్న అంశమని ఆయన చెప్పారు. కోహ్లీ, రోహిత్ శర్మపైనే టీమిండియా బ్యాటింగ్ భారం వేయనుంది. వీరిద్దరూ రాణిస్తే వరల్డ్‌కప్ సాధించడం సులభమేనని వెంగ్‌సర్కార్ ధీమా వ్యక్తం చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కూడా కీలకమని వారు ఇంగ్లాండ్‌లో చెలరేగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరు కలిసి కట్టుగా రాణిస్తే భారత్ మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
కోహ్లీని తక్కువ అంచనా వేయొద్దు
RELATED ARTICLES