ఐసిసి టెస్టు ర్యాకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా సారథి
911 పాయింట్లతో టాప్‌లో నిలిచిన స్టీవ్‌స్మిత్
దుబాయి : ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన అగ్రస్థానం కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 21 పరుగులే చేసిన కోహ్లీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం పతనమై రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 906 పాయింట్లతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో ఉన్నారు. ఇక ఈ తొలి టెస్ట్‌లోనే దారుణంగా విఫలమైన టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా రెండు ర్యాంకులు కోల్పోయి 9వ స్థానానికి చేరుకోగా.. రహానే ఒక్క స్థానం మెరుగై 8వ స్థానం దక్కించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 2 ర్యాంకులు ఎగబాకి 10 ర్యాంక్ అందుకున్నాడు. మయాంక్ 727 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. టీమిండియాతో టెస్టులో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్-10లో చోటు కోల్పోయాడు. తొలి టెస్టులో ఒక్క వికెట్ మాత్రమే తీసిన బూమ్రా ర్యాకింగ్స్‌లో 11వ ర్యాంకుకు దిగిపోయాడు. భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే తొమ్మిదో ర్యాంకులో నిలిచి, టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ ఐదోస్థానం దక్కించుకోగా.. రవీంద్ర జడేజా మూడో ర్యాంకులో ఉన్నాడు.
కోహ్లీకి షాక్!
RELATED ARTICLES