కోల్‌కతా: ఐపిఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయ్ శంకర్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) మెరుపు మెరిపించాడు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెకెఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆండ్రీ రస్సెల్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విజయ్ శంకర్, మిల్లర్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్(35 బంతుల్లో 8 ఫోర్లతో 49) రాణించాడు. కెకెఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. విజయానికి చివరి 37 బంతుల్లో 73 పరుగులు అవసరమవ్వగా.. శంకర్, మిల్లర్ ధాటికి 24 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది. 14వ ఓవర్‌లో 9 పరుగులు పిండుకున్న ఈ జోడీ.. 15వ ఓవర్‌లో 18, 16వ ఓవర్‌లో 13, 17వ ఓవర్‌లో 24, 18వ ఓవర్‌లో 14 పరుగులు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ ఇద్దరూ 4వ వికెట్‌కు అజేయంగా 87 పరుగులు జోడించారు. ఓపెనర్ వృద్ది మాన్ సాహా(10) విఫలమైనా.. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ప్రత్యర్థి ఇలాఖలో నాలుగు విజయాలు నమోదు చేసింది. కేకేఆర్‌ను కోల్‌కతాలో.. ఢిల్లీని ఢిల్లీలో.. పంజాబ్‌ను మొహాలీ, లక్నోను లక్నోలో ఓడించింది.
కోల్‌కతాపై గుజరాత్ ఘనవిజయం
RELATED ARTICLES