పుట్టెడు దుఃఖంలో అన్నదాత
నిండా మునిగిన పత్తి రైతు
పెట్టుబడి మొత్తం వర్షార్పణం
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో మూడేళ్ల ఆదాయాన్ని ఓ ఏడాది నష్టం మింగేస్తుంది. గతేడాది కాస్త ఫర్వాలేదనుకుంటే ఈ ఏడాది మరో రెండేళ్లు కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది. ఈ పంట.. ఆ పంట అనే తేడా లేకుండా సర్వం వర్షార్పణమైంది. ఏడాది ఆరంభంలో సానుకూలంగా వర్షాలు పడుతుంటే రైతన్న మోమున చిరునవ్వు మెరిసింది. విత్తిన విత్తు విత్తినట్లు మొలకెత్తి మారాకు తొడుగుతుంటే ఈ ఏడాది ఇక తనకు ఇబ్బందులు తొలగినట్లేనన్న ఆనందం తొంగి చూసింది. నవనవలాడుతూ పత్తి పెరుగుతుంటే పత్తి తీత అమ్మకాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మొక్కజొన్న వేయకపోవడమో మంచిదైందని, పెసర భలే ఏపుగా ఉందని, పూత, కాతతో పసందుగా ఉందనుకున్నాడు. మిరపకాయ రోజు రోజుకు ధర పెరుగుతుంటే ఈ ఏడాది అంతే ఉంటుందిలే అనుకుని తన తోటను చూస్తూ మురిసిపోయాడు. వాన దేవుడు రైతు ఆశలన్నీంటిని నిరాశలు చేశాడు. ఏ ఒక్క పంట చేతికి రాకుండానే నేలపాలు చేసి రైతన్న ఆశలపై నీళ్లు చల్లాడు. ఏ ఒక్క రైతుకో కాదు ఊర్లకు ఊర్లు, మండలాలకు మండలాలే అతివృష్టి భారీన పడి విలవిలలాడుతున్నాయి. ఒకరిద్దరు కాదు సాగు చేసిన ప్రతి రైతుది ఇదే పరిస్థితి. అన్ని పంటలు దెబ్బతినడం ద్వారా ఈ ఏడాది మరో మూడేళ్లు కోలుకోకుండా దెబ్బతీసింది. పత్తి ఏపుగా పెరిగినా పూత, పిందె రాకపోవడంతో పదును ఆరితే వస్తుంది కాదా అని ఆశించాడు. కానీ వర్షం ఈ రకంగా పత్తి పంటను ధ్వంసం చేస్తుందని ఊహించ లేదు. మూడు నాలుగు నెలలుగా అల్లారు ముద్దుగా పెంచిన పత్తి వర్షానికి వడబడిపోయింది. నీరు నిల్వ ఉండి పదునెక్కువ కావడంతో పత్తి చేలు నేలవాలాయి. పదెకరాలు పత్తి సాగు చేసిన రైతుకు కూడా ఒక్క కిలో పత్తి కూడా ఇంటికి రాలేదంటే ఇందులో ఈసమెత్తయినా అబద్ధం లేదు. పత్తితీత ప్రారంభించకుండానే పత్తి చేలు పీకేయాల్సిన దయనీయ స్థితి. పత్తిపై ఆశలు పెంచుకున్న రైతన్నకు చివరకు నిరాశే మిగిలింది. ఇక అపరాలు విత్తనం కూడా మల్లలేదు. ఏ ఒక్క రైతు పెసర కోసిన దాఖలాలు భూతద్దం వేసి వెతుకులాడిన కన్పించడం లేదు. రైతన్న వ్యథ వర్ణనాతీతం. వరి కాస్త ఫర్వాలేదనుకుంటే గాలి వానలకు అది కూడా పూర్తిగా నేలకొరిగింది. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి రైతుకు కష్టాలు, కన్నీళ్లే దర్శనమిచ్చాయి. మూడు నాలుగు రోజులుగా ఏ రైతు ఎదురు పడినా కన్నీళ్లు ఊబికి వస్తున్నాయి. వేల రూపాయల అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీలకు అందిన కాడల్లా అప్పు చేశారు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితి. పాలకులు ఆదుకుంటే తప్ప రైతన్న కోలుకునే పరిస్థితి లేదు. అంచనాలు రూపొందించడం ఆనవాయితీగా మారింది. అంచనాలు రూపొందించడం ఆ తర్వాత ముఖం చాటేయడం పాలకులకు అలవాటుగా మారింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగిందంటే అంచనాలు వేయడం ఆ తర్వాత మౌనంగా ఉండడం పాలకుల విధుల్లో భాగమైంది. ఇంతటి ఘోర విపత్తులోనైనా పాలకులు సరైన రీతిలో స్పందించాలని రైతాంగం కోరుతుంది. రైతాంగం వ్యథను పట్టించుకోవాలని కోరుతుంది. గతంలో మాదిరి అంచనాలతో సరిపుచ్చకుండా ఆదుకోవాలని ప్రతి రైతు కోరుతున్నాడు. నష్టం కళ్ల ముందు కనపడుతుంది. ఇక ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా మారాలి. లేకుంటే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోక తప్పదు.
కోలుకునేదెలా..?
RELATED ARTICLES