77 మందిలో 10 మందికి ఫస్ట్ టెస్ట్‌లో కరోనా నెగెటివ్!
మరోసారి పరీక్షలో నెగెటివ్ అని తేలితే డిశ్చార్జ్
గాంధీ నుండి మరో ఇద్దరు డిశ్చార్జ్
ఇప్పటికి 14 మంది డిశ్చార్జ్
హైదరాబాద్ : కరోనా బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ప్రభుత్వం, వైద్యులు, ఇతర సిబ్బంది చేస్తున్న కృషికి తగిన ఫలితం వస్తుంది. చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 10 మందికి మొదటి పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చినట్లు బుధవారం వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరో సారి వారందరికి వైద్యులు పరీక్షలు చేసి నెగెటివ్ వచ్చిన వారిని అబ్జర్వేషన్‌లో పెట్టి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదికాకుండా మరో ఇద్దరిని బుధవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో మొత్తం 97 కేసులు(మార్చి 31 వరకు) నమోదయ్యాయి. ఇందులో 77 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 14 మంది డిశ్చార్జ్ చేయగా ఆరుగురు కరోనా బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రి, చెస్ట్, ఇతర ఆసుపత్రుల్లో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారు 77 మంది ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారికి వైద్యులు నిర్వహించిన మొదటి పరీక్షలో 10 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. వీరందరికీ రెండవ సారి కూడా పరీక్ష చేసి నెగెటివ్ అని తేలితే వారికి కూడా డిశ్చార్జ్ చేయనున్నారు. అంటే 77 మందిలో 12 మంది దాదాపు పూర్తిగా కోలుకున్నట్టే. ఇక మిగలేది 65 మంది మాత్రమే. వీరందరూ కూడా దశలవారిగా డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఆదిశగా కరోనా బాధితులకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే కరోనా బాధితులను ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ఆసుపత్రి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. గంటగంటకు వారి ఆరోగ్య పరిస్థితిని అబ్జర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సోకిన వ్యక్తులు ఆందోళన చెందకుండా తొందరగా కోలుకునే విధంగా కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా వీరి ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటుంది. ఇదిలా ఉంటే మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని గాంధీ ఆసుపత్రికి అధికారులు తరలించి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొంతమంది ఎవరికివారుగా స్వచ్ఛందంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలివస్తున్నారు. మరికొంత మందిని అధికారులు స్వయంగా రంగంలోకి దికి వారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
కోలుకుంటున్న కరోనా బాధితులు
RELATED ARTICLES